YouVersion Logo
Search Icon

నహూ 3

3
నీనెవేకి బాధ
1నరహత్య చేసిన పట్టణమా, నీకు బాధ తప్పదు. అది నిరంతరం అబద్ధాలతో దొంగిలించి తెచ్చిన వస్తువులతో నిండి ఉంది. దాని చేతుల్లో హతమైన వారు దానిలో ఉన్నారు. 2రథసారధి చేసే కొరడా శబ్దం, రథ చక్రాల ధ్వని, గుర్రాల అడుగుల శబ్దం, వేగంగా పరిగెత్తే రథాల శబ్దం వినబడుతున్నాయి. 3రౌతులు వేగంగా పరుగెత్తుతున్నారు, కత్తులు, ఈటెలు తళతళ మెరుస్తున్నాయి. శవాలు కుప్పలుగా పడి ఉన్నాయి. కూలిన శవాలకు లెక్కే లేదు, శవాలు కాళ్ళకు తగిలి దాడి చేసే వారు తొట్రుపడుతున్నారు.
4ఇందుకు కారణం, అది మంత్ర విద్యలో ఆరితేరిన అందమైన వేశ్య జరిగించిన కామ క్రీడలే. ఆమె తన జారత్వంతో జాతులను అమ్మేసింది. తన ఇంద్రజాలంతో మనుషులను వశపరచుకుంది. 5సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే “నేను నీకు విరోధిని. నీ బట్టలు నీ ముఖం పైకి ఎత్తి ప్రజలకు నీ మర్మాంగాలను చూపిస్తాను. రాజ్యాలకు నీ అవమానాన్ని బట్టబయలు చేస్తాను. 6నీ ముఖంపై పెంట విసిరి చూసేవారు నిన్ను ఏవగించుకునేలా చేస్తాను. 7అప్పుడు నిన్ను చూసేవారంతా నీ దగ్గర నుండి పారిపోతారు. ‘నీనెవె పాడైపోయింది. దాని కోసం ఎవరు విలపిస్తారు? నిన్ను ఓదార్చేవాళ్ళు ఎక్కడ దొరుకుతారు’ అంటారు.”
8చుట్టూ నీటితో సముద్రాన్నే తనకు కావలిగా, సరిహద్దుగా చేసుకుని, నైలు నది దగ్గర ఉన్న తేబేసు#3:8 తేబేసు నో అమోస్ అనేది హీబ్రూభాషలో (ఈజిప్టు రాజధాని) పట్టణం కంటే నువ్వు గొప్పదానివా? 9ఇతియోపియా, ఈజిప్టు దేశాలు దానికి అండ. పూతు, లిబియా దాని మిత్ర పక్షాలు. 10అయినప్పటికీ దాని నివాసులు బందీలయ్యారు. పురవీధుల్లో శత్రువులు దానిలోని చిన్నపిల్లలను బండలకు కొట్టి చంపారు. ప్రముఖుల మీద చీట్లు వేశారు, దాని ప్రధానులనందరినీ సంకెళ్లతో బంధించారు. 11నీకు కూడా మత్తు ఎక్కుతుంది. నువ్వు దాక్కుంటావు. నీ మీదికి శత్రువు రావడం చూసి ఆశ్రయం కోసం వెదకుతావు.
12అయితే నీ కోటలన్నీ అకాలంలో పండిన కాయలున్న అంజూరపు చెట్లలాగా ఉన్నాయి. ఎవరైనా ఒకడు వాటిని ఊపితే చాలు, పండ్లు తిందామని వచ్చినవాడి నోట్లో పడతాయి. 13నీ నివాసులు స్త్రీల వంటి వారు. నీ దేశపు ద్వారాలు శత్రువులకు తెరిచి ఉన్నాయి. ద్వారాల అడ్డకర్రలు కాలిపోయాయి. 14వారు ముట్టడించే సమయానికి నీళ్లు చేదుకో. నీ కోటలను దిట్టపరచుకో. బంకమట్టిలోకి దిగి ఇటుకల కోసం బురద తొక్కు. కొలిమి సిద్ధం చేసుకో. 15అక్కడే నిన్ను అగ్ని కాల్చివేస్తుంది. కత్తివాత పడి నువ్వు నాశనం అవుతావు. గొంగళిపురుగు తినివేసే విధంగా అది నిన్ను నాశనం చేస్తుంది. గొంగళిపురుగులంత విస్తారంగా, మిడతలంత విస్తారంగా నీ సంఖ్యను పెంచుకో.
16నీ వర్తకుల సంఖ్య లెక్కకు ఆకాశ నక్షత్రాలకంటే ఎక్కువగా ఉన్నప్పటికీ వాళ్ళు మిడతల్లాగా వచ్చి దోచుకుని ఎగిరిపోతారు. 17నీ వీరులు లెక్కకు మిడతలంత విస్తారంగా ఉన్నారు. నీ సేనానులు చలికాలంలో కంచెల్లో దిగిన మిడతల్లాగా ఉన్నారు. ఎండ కాసినప్పుడు అవన్నీ ఎగిరిపోతాయి. అవి ఎక్కడికి వెళ్లి వాలతాయో ఎవరికీ తెలియదు.
18అష్షూరు రాజా, నీ సంరక్షకులు నిద్రపోయారు. నీ ప్రధానులు విశ్రాంతిలో ఉన్నారు. నీ ప్రజలు పర్వతాల్లోకి చెదరిపోయారు. వారిని తిరిగి సమకూర్చేవాడు ఒక్కడు కూడా లేదు. 19నీకు తగిలిన దెబ్బ తీవ్రమైనది. నీ గాయాన్ని ఎవ్వరూ బాగు చెయ్యలేరు. నిన్ను గూర్చిన వార్త విన్న వాళ్ళంతా నీకు జరిగిన దానికి సంతోషంతో చప్పట్లు కొడతారు. ఎందుకంటే ప్రజలంతా నీచేత ఎడతెగకుండా హింసల పాలయ్యారు.

Currently Selected:

నహూ 3: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in