2 సమూయేలు 8
8
దావీదు అనేక యుద్ధాలను గెలవటం
1తరువాత దావీదు ఫిలిష్తీయులను ఓడించాడు. వారి రాజధాని నగరాన్ని స్వాధీన పర్చుకున్నాడు. 2దావీదు మోయాబీయులను కూడ ఓడించాడు. పట్టుబడిన వారందరినీ నేల మీద పరుండేలా చేసి, వారి పొడుగు కొలవటానికి ఒక తాడు తీసుకున్నాడు. రెండు కొలతల పొడవున్న వారందరినీ చంపించాడు. ఒక కొలత పొడవున్న వారందరినీ వదిలిపెట్టాడు. దానితో మోయాబీయులంతా దావీదుకు సేవకులయ్యారు. వారంతా ఆయనకు కప్పము#8:2 కప్పము యుద్ధంలో ఓడిపోయిన సామంతులు గెలిచిన రాజుకు చెల్లించే పైకం. చెల్లించారు.
3సోబారాజు రెహోబు కుమారుడైన హదదెజరును దావీదు ఓడించాడు. యూఫ్రటీసు నదీ తీరానగల తన ఆధిపత్యాన్ని దావీదు తిరిగి చేజిక్కించుకున్నాడు. 4హదదెజరు నుండి పదిహేడు వందల మంది గుర్రపు దళము వారిని, ఇరవై వేలమంది కాల్బలము వారిని దావీదు పట్టుకున్నాడు. ఒక వంద మంచి గుర్రాలు మినహా మిగిలిన గుర్రాలన్నిటినీ దావీదు కుంటివాటినిగా చేసాడు. ఆ వంద గుర్రాలను రథాలను లాగేందుకు రక్షించాడు.
5సోబా రాజగు హదదెజరుకు సహయం చేయటానికి దమస్కునుండి సిరియనులు వచ్చిరి. కాని దావీదు ఇరువది రెండువేల మంది సిరియనులను ఓడించాడు. 6తరువాత దమస్కు అధీనంలోనున్న సిరియా దేశమందు దావీదు రక్షక దళాలను నియమించాడు. సిరియనులు వచ్చి దావీదుకు కప్పము చెల్లించారు. దావీదు ఎక్కడికి వెళితే అక్కడ యెహోవా అతనికి విజయ పరంపర సమకూర్చి పెట్టాడు.
7హదదెజరు సైనికుల బంగారు డాళ్లను (రక్షకఫలకాలు) దావీదు తీసుకొని యెరూషలేముకు తెచ్చాడు. 8బెతహు, బేరోతైలనుండి దావీదు లెక్కకు మించి ఇత్తడి సామగ్రి పట్టుకొనిపోయాడు. (బెతహు, బేరోతై అను రెండు నగరాలూ హదదెజరుకు చెందినవి).
9హదదెజరు సైన్యాన్ని దావీదు ఓడించినట్లు హమాతు రాజైన తోయి విన్నాడు. 10తోయి తన కుమారుడైన యోరామును దావీదు రాజువద్దకు పంపాడు. యోరాము వచ్చి దావీదును పలకరించి, హదదెజరుతో పోరాడి ఓడించినందుకు అతన్ని అభినందించాడు. (తోయిపై హదదెజరు గతంలో దండెత్తి యుద్ధాలు చేశాడు). యోరాము దావీదు వద్దకు వెండి, బంగారు, ఇత్తడి వస్తువులను కానుకలుగా తెచ్చాడు. 11దావీదు వాటిని తీసుకొని యెహోవాకి సమర్పించాడు. తాను ఇతర దేశములను ఓడించి తెచ్చి యెహోవాకి సమర్పించిన వెండి బంగారు వస్తువులతో పాటు ఈ సామగ్రిని కూడ ఉంచాడు. 12తాను జయించిన దేశాలలో సిరియ, మోయాబు, అమ్నోను, ఫిలిష్తీయ, అమాలేకు ఉన్నాయి. సోబా రాజైన రెహోబు కుమారుడు హదదెజరును కూడ దావీదు ఓడించాడు. 13దావీదు పద్దెనిమిది వేల సిరియనులను ఉప్పులోయలో ఓడించాడు. అతను ఇంటికి తిరిగి వచ్చేసరికి మిక్కిలి కీర్తి గడించాడు. 14ఎదోములో దావీదు సైన్యాన్ని రక్షణకై నిలిపాడు. ఎదోము రాజ్యమంతటా కాపలా దళాలను నియమించాడు. ఎదోమీయులంతా దావీదుకు సేవకులయ్యారు. దావీదు వెళ్లిన ప్రతిచోటా యెహో వా అతనికి విజయాన్ని సమకూర్చి పెట్టాడు.
దావీదు పరిపాలన
15ఇశ్రాయేలంతటినీ దావీదు పరిపాలించాడు. దావీదు తీసుకున్న నిర్ణయాలు తన ప్రజలందరికీ నిష్పక్ష పాతంగా వుండి ఆమోదయోగ్యంగా వుండేవి. 16సెరూయా కుమారుడైన యోవాబు సర్వసైన్యాధ్యక్షుడయ్యాడు. అహీలూదు కుమారుడగు యెహోషాపాతు చరిత్రకారుడు పత్రలేఖకుడుగా నియమితుడయ్యాడు. 17అహీటూబు కుమారుడైన సాదోకు, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు యాజకులుగా ఉన్నారు. శెరాయా అనునతను ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించాడు. 18యెహోయాదా కుమారుడు బెనాయా కెరేతీయులకు, పెలేతీయులకు#8:18 కెరేతీయులు, పెలేతీయులు వీరు బహుశః దావీదుకు ప్రత్యేక అంగరక్షకులు కావచ్చు. ఒక ప్రాచీన అరమెయికు (సిలియను) అనువాదంలో “విలుకాండ్రు, ఒడిసెల వీరులు” అని వున్నది. అధిపతి అయ్యాడు. దావీదు కుమారులు రాజకీయ సలహాదారులైన ప్రముఖ వ్యక్తులుగా#8:18 ప్రముఖ వ్యక్తులు యాజకులని శబ్ధార్థం. నియమితులయ్యారు.
Currently Selected:
2 సమూయేలు 8: TERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International