YouVersion Logo
Search Icon

2 సమూయేలు 9

9
సౌలు కుటుంబానికి దావీదు కనికరము చూపటం
1“సౌలు కుటుంబంలో ఇంకాఎవరైనా మిగిలియున్నారా? యోనాతాను కోసం ఆ వ్యక్తికి నేను కనికరం చూపదల్చుకున్నాను” అని దావీదు చెప్పాడు.
2సౌలు కుటుంబానికి చెందిన సీబా అనే ఒక సేవకుడు ఉన్నాడు. దావీదు మనుష్యులు సీబాను దావీదు వద్దకు తీసుకొని వచ్చారు. దావీదు రాజు సీబాతో, “నీవు సీబావేనా?” అని అడిగాడు.
“అవును, నీ సేవకుడనైన సీబానే” అని అన్నాడు సీబా.
3“అయితే సౌలు కుటుంబంలో ఎవరైనా జీవించివున్నారా? వుంటే ఆ వ్యక్తికి దేవుని కృపను చూపాలని అనుకుంటున్నాను” అని దావీదు చెప్పాడు. దావీదు రాజుతో సీబా యిలా అన్నాడు:
“యోనాతాను కుమారుడొకడు ఇంకా జీవించియున్నాడు. అతని రెండు కాళ్లూ అవిటివి.”
4“ఈ కుమారుడెక్కడున్నాడని” రాజు సీబాను అడిగాడు.
“లోదెబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడైన మాకీరు ఇంటిలో వున్నాడని” రాజుకు చెప్పాడు సీబా.
5అప్పుడు దావీదు రాజు తన సేవకులను లోదెబారుకు పంపాడు. అమ్మీయేలు కుమారుడైన మాకీరు ఇంటిలో వున్న యోనాతాను కుమారుని తీసుకొని రమ్మని చెప్పాడు. 6యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి వంగి నమస్కరించాడు.
“మెఫిబోషెతూ” అని పిలిచాడు దావీదు.
“అవునయ్యా! నేను నీ సేవకుడను మీ ముందు వున్నాను” అని అన్నాడు మెఫీబోషెతు.
7మెఫీబోషెతుతో దావీదు ఇలా అన్నాడు, “భయపడకు. నేను నీ పట్ల దయగలిగి ఉంటాను. నీ తండ్రియైన యోనాతాను కారణంగా నేను నీకు సహాయం చేస్తాను. నీ తాతయైన సౌలు భూమినంతా నీకు తిరిగి ఇచ్చివేస్తాను. నీవు ఎల్లప్పుడూ నాతో నా బల్ల వద్ద భోజనం చేస్తావు.”
8మెఫీబోషెతు మరల దావీదుకు వంగి నమస్కరించాడు. మెఫీబోషెతు ఇలా అన్నాడు: “మీరు మీ సేవకుడనైన నా పట్ల చాలా దయగలిగియున్నారు! పైగా నేను చచ్చిన కుక్కకంటె హీనమైన వాడిని!”
9పిమ్మట దావీదు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలిచి, “సౌలుకు, సౌలు కుటుంబానికి చెందిన ఆస్తి పాస్తులన్నీ నీ యజమాని మనుమడైన మెఫీబోషెతుకు ఇచ్చాను. 10మెఫీబోషెతు కొరకు ఆ భూమిని నీవు సాగుచేయి. మెఫీబోషెతు కొరకు నీ కుమారులు, సేవకులు కలిసి చేయండి. పంట పండించండి. దానితో నీ యజమాని మనుమడు మెఫిబోషెతుకు పుష్కలంగా ఆహారం దొరుకుతుంది. కాని నీ యజమాని మనుమడు నా బల్లవద్ద తింటూ వుంటాడు.”
సీబాకు పదునైదుగురు కుమారులు, ఇరువైమంది సేవకులు వున్నారు. 11దావీదు రాజుతో సీబా ఇలా అన్నాడు: “నేను నీ సేవకుడను. రాజైన నా ప్రభువు ఆజ్ఞాపించిన విధంగా నేను అంతా చేస్తాను.”
ఆ ప్రకారంగానే మెఫీబోషెతు దావీదు బల్లవద్ద రాజ కుమారులలో ఒకనిగా భోజనం చేస్తాడు. 12మెఫీబోషెతుకు మీకా అనబడే ఒక చిన్న కుమారుడున్నాడు. సీబా కుటుంబంలోని వారంతా మెఫీబోషెతుకు సేవకులయ్యారు. 13మెఫీబోషెతు రెండు కాళ్లూ కుంటివే. మెఫీబోషెతు యెరూషలేములోనే నివసించాడు. ప్రతిరోజూ మెఫీబోషెతు రాజు భోజనాల బల్ల వద్దనే తినేవాడు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in