YouVersion Logo
Search Icon

1 యోహాను పత్రిక 5

5
దేవుని కుమారునిగా పుట్టిన వానిని విశ్వసించుట
1యేసే క్రీస్తు అని విశ్వసించే ప్రతి ఒక్కరు దేవుని మూలంగా పుట్టినవారే. తండ్రిని ప్రేమించే ప్రతి ఒక్కరు ఆయన కుమారుని కూడా ప్రేమిస్తారు. 2దేవుని ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలకు లోబడుట ద్వారా మనం దేవుని బిడ్డలను ప్రేమిస్తున్నామని మనకు తెలుస్తుంది. 3నిజానికి, దేవుని ప్రేమ అంటే ఆయన ఆజ్ఞలను పాటించడమే. ఆయన ఆజ్ఞలు కష్టతరమైనవి కావు. 4దేవుని మూలంగా పుట్టిన ప్రతి ఒక్కరు లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసమే. 5లోకాన్ని ఎవరు జయించగలరు? యేసు దేవుని కుమారుడని నమ్మినవారు మాత్రమే కదా.
6నీళ్ల ద్వారా రక్తం ద్వారా వచ్చినవాడు యేసు క్రీస్తే. ఆయన కేవలం నీటి ద్వారా మాత్రమే రాలేదు, కాని నీళ్ల ద్వారా రక్తం ద్వారా వచ్చారు. ఆత్మ సాక్ష్యమిస్తున్నాడు ఎందుకంటే ఆత్మ సత్యము. 7దానికై ముగ్గురు సాక్ష్యమిస్తున్నారు: 8ఆత్మ, నీరు, రక్తం; ఈ ముగ్గురు ఏకీభవిస్తున్నారు. 9మనం మానవులిచ్చే సాక్ష్యాన్ని అంగీకరిస్తాం, కాని దేవుడిచ్చే సాక్ష్యం గొప్పది, ఎందుకంటే అది ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యము. 10కాబట్టి దేవుని కుమారుని విశ్వసించే ప్రతివారు ఈ సాక్ష్యాన్ని అంగీకరిస్తారు. దేవుని విశ్వసించనివారు తన కుమారుని గురించి దేవుడిచ్చిన సాక్ష్యాన్ని నమ్మలేదు, కాబట్టి దేవున్ని అబద్ధికునిగా చేస్తున్నారు. 11ఆ సాక్ష్యం ఇదే: దేవుడు మనకు నిత్యజీవాన్ని ఇచ్చారు, ఈ జీవం ఆయన కుమారునిలో ఉంది. 12కుమారుని కలిగిన ప్రతివారిలో ఈ జీవం ఉన్నది; దేవుని కుమారుని పొందని వారిలో జీవం లేదు.
తుది ధ్రువీకరణలు
13దేవుని కుమారుని నామాన్ని విశ్వసించే మీరు నిత్యజీవం గలవారని తెలుసుకుంటారని వీటిని మీకు వ్రాస్తున్నాను. 14మనం దేవున్ని సమీపిస్తున్నప్పుడు మనకు ఉండే నమ్మకం ఇదే: ఆయన చిత్తప్రకారం మనమేది అడిగినా, మనం అడిగేది ఆయన వింటారు. 15మనమేది అడిగినా, మనం అడిగేది ఆయన వింటారని మనకు తెలిస్తే, మనం ఆయనను ఏది అడిగామో అది కలిగి ఉన్నామని మనకు తెలుసు.
16తన సహోదరుడు గాని సహోదరి గాని మరణానికి గురి చేయని పాపం చేయడం మీరు చూస్తే, మీరు తప్పక ప్రార్థించాలి. అప్పుడు దేవుడు వారికి జీవం ఇస్తారు. మరణానికి నడిపించే పాపం ఉంది. మీరు దాని గురించి ప్రార్థించాలని నేను చెప్పడం లేదు. 17తప్పులన్నీ పాపమే, మరణానికి నడిపించని పాపం ఉంది.
18దేవుని మూలంగా పుట్టిన వారెవరు పాపం కొనసాగించలేరని మనకు తెలుసు; దేవుని మూలంగా పుట్టిన వారు తమను తాము భద్రం చేసుకుంటారు, కాబట్టి దుష్టుడు వారిని ముట్టలేడు. 19మనం దేవుని పిల్లలమని, లోకమంతా దుష్టుని ఆధీనంలో ఉన్నదని మనకు తెలుసు. 20మనం సత్యవంతుడైన వానిని తెలుసుకునేలా చేయడానికి, దేవుని కుమారుడు వచ్చాడని, మనకు తెలివిని ఇచ్చారని మనకు తెలుసు. ఆయన కుమారుడైన యేసు క్రీస్తులో ఉండడం ద్వారా సత్యవంతునిలో మనం ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్యజీవము.
21చిన్న పిల్లలారా, విగ్రహాలకు దూరంగా ఉండండి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in