YouVersion Logo
Search Icon

అపొస్తలుల కార్యములు 1

1
యేసు క్రీస్తుని ఆరోహణం
1-2ఓ థెయోఫిలా, యేసు ఆరంభం నుండి ఆయన ఏర్పరచుకొన్న అపొస్తలులకు పరిశుద్ధాత్మ ద్వార సూచనలు ఇచ్చిన తర్వాత, పరలోకానికి ఆయన కొనిపోబడిన సమయం వరకు ఆయన ఏమేమి చేశారో ఏ విషయాలను బోధించారో వాటన్నిటిని గురించి నా మొదటి పుస్తకంలో నేను వ్రాసాను. 3అనగా, ఆయన హింసను పొందిన తర్వాత, తాను సజీవునిగా ఉన్నారని అనేక రుజువులతో తనను తాను వారికి నలభై రోజులు కనపరచుకుంటూ దేవుని రాజ్యాన్ని గురించి బోధించారు. 4ఒక రోజు యేసు వారితో కలసి భోజనం చేస్తున్నప్పుడు ఆయన వారికి ఈ ఆజ్ఞ ఇచ్చారు: “మీరు యెరూషలేమును వదిలి వెళ్లకండి, నేను మీతో ముందే చెప్పినట్లు, నా తండ్రి వాగ్దానం చేసిన ఆ బహుమానాన్ని పొందుకొనే వరకు కనిపెడుతూ ఉండండి. 5ఎందుకంటే, యోహాను నీటితో బాప్తిస్మమిచ్చాడు, కాని కొన్ని రోజులలో మీరు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందుకొంటారు.”
6అప్పుడు ఆ అపొస్తలులు ఆయన చుట్టుచేరి, “ప్రభువా, ఇప్పుడు నీవు ఇశ్రాయేలు రాజ్యాన్ని తిరిగి నిర్మిస్తావా?” అని అడిగారు.
7అందుకు ఆయన వారితో, “తండ్రి తన అధికారంతో నిర్ణయించిన సమయాలను, కాలాలను తెలుసుకోవడం మీ పని కాదు. 8అయితే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకొంటారు. అప్పుడు మీరు యెరూషలేములో, సమస్త యూదయ, సమరయ ప్రాంతాలలో, భూమి అంచుల వరకు నాకు సాక్షులుగా ఉంటారు” అన్నారు.
9ఈ మాటలను చెప్పిన తర్వాత, వారి కన్నుల ముందే, ఆయన ఆరోహణమయ్యారు. అప్పుడు ఒక మేఘం వచ్చి వారికి కనబడకుండా ఆయనను కమ్ముకొన్నది.
10ఆయన వెళ్తునప్పుడు వారు ఆకాశంవైపే తేరి చూస్తూ నిలబడ్డారు, అప్పుడు తెల్లని వస్త్రాలను ధరించుకొన్న ఇద్దరు వ్యక్తులు వారి దగ్గరకు వచ్చి, 11“గలిలయ వాసులారా, మీరు ఇక్కడ నిలబడి ఆకాశం వైపు ఎందుకు చూస్తున్నారు? మీ ముందు ఆరోహణమైన ఈ యేసే, ఏ విధంగా పరలోకానికి వెళ్లడం చూసారో, అదే విధంగా ఆయన తిరిగి వస్తారు” అని వారితో చెప్పారు.
యూదాకు బదులుగా ఎన్నుకోబడిన మత్తీయా
12తర్వాత అపొస్తలులు ఒలీవల కొండ నుండి బయలుదేరి యెరూషలేమునకు తిరిగి వెళ్లారు, అది ఒక విశ్రాంతి దిన ప్రయాణం అనగా దాదాపు ఒక కిలోమీటరు దూరం వుంటుంది. 13వారు పట్టణం చేరి, తాము ఉంటున్న మేడ గదికి ఎక్కి వెళ్లారు. అక్కడ ఎవరు ఉన్నారంటే:
పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ,
ఫిలిప్పు, తోమా;
బర్తలోమయి, మత్తయి;
అల్ఫయి కుమారుడైన యాకోబు, అత్యాసక్తి కలవాడైన#1:13 అత్యాసక్తి కలవాడైన అనగా కనానీయుడైన సీమోను సీమోను, యాకోబు కుమారుడైన యూదా.
14వీరితో పాటు కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియ, ఆయన తమ్ముళ్ళు కలిసి, ఏక మనస్సుతో విడువక ప్రార్థిస్తున్నారు.
15ఇంచుమించు నూట ఇరవై మంది విశ్వాసులు ఒక్కచోట చేరినప్పుడు పేతురు వారి మధ్యలో నిలబడి, 16“సహోదరీ సహోదరులారా, యేసును బంధించడానికి వారికి దారి చూపించిన యూదా గురించి, చాలా కాలం క్రిందట దావీదు ద్వారా పరిశుద్ధాత్మ చెప్పిన లేఖనాలు నెరవేరవలసి ఉంది. 17‘అతడు మనలో ఒకనిగా ఉండి మన పరిచర్యలో భాగం పంచుకొన్నాడు.’ ”
18ద్రోహం చేసి సంపాదించిన డబ్బుతో యూదా ఒక పొలాన్ని కొన్నాడు; అక్కడే అతడు తలక్రిందులుగా పడి, శరీరం చీలి అతని పేగులన్ని బయట చెదరిపడ్డాయి. 19ఈ సంగతిని గురించి యెరూషలేములో ఉన్న ప్రతి ఒక్కరు విన్నారు, కనుక ఆ పొలాన్ని వారి భాషలో అకెల్దమా అని పిలుస్తున్నారు, అకెల్దమా అనగా రక్త భూమి అని అర్థం.
20ఎందుకంటే, “కీర్తన గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది:
“ ‘అతని స్ధలం విడిచివేయబడును గాక;
దానిలో ఎవరు నివసించకపోవుదురు గాక,’#1:20 కీర్తన 69:25
మరియు,
“ ‘అతని నాయకత్వం వేరొకడు తీసుకొనును గాక.’#1:20 కీర్తన 109:8
21కనుక, ప్రభువైన యేసు యోహాను బాప్తిస్మం పొందుకొన్న రోజు నుండి, 22ఆయన పరలోకానికి వెళ్లిన రోజు వరకు మనతో ఉన్నవారిలో ఒకనిని ఏర్పరచుకోవడం అవసరం. వీరిలో ఒకడు మనతో కలిసి ఆయన పునరుత్థానం గురించి సాక్షిగా ఉండాలి” అన్నాడు.
23కనుక వారు యూస్తు, బర్సబ్బా అని పిలువబడే యోసేపు మరియు మత్తీయా అనే ఇద్దరి పేర్లు నిర్దేశించారు. 24తర్వాత వారు, “ప్రభువా, నీకు అందరి హృదయాలు తెలుసు. ఈ ఇద్దరిలో ఎవరు 25యూదా విడిచి వెళ్లిన ఈ అపొస్తలిక పరిచర్యను కొనసాగించడానికి మీరు ఎవరిని ఎన్నుకున్నారో మాకు చూపించండి” అని ప్రార్థించారు. 26తర్వాత వారు చీట్లు వేసినప్పుడు, మత్తీయా పేరున చీటి వచ్చింది, కనుక పదకొండు మంది అపొస్తలులతో అతన్ని చేర్చారు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for అపొస్తలుల కార్యములు 1