YouVersion Logo
Search Icon

అపొస్తలుల కార్యములు 2

2
పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దిగి వచ్చుట
1పెంతెకొస్తు పండుగ రోజు వచ్చినప్పుడు, వారందరు ఒక్కచోట చేరుకొన్నారు. 2అప్పుడు అకస్మాత్తుగా పరలోకం నుండి వేగంగా వీస్తున్న గాలి లాంటి ధ్వని వచ్చి వారు కూర్చున్న ఇల్లంతా నింపింది. 3అగ్ని జ్వాలల్లాంటి నాలుకలు విభజింపబడి వారిలో ప్రతి ఒక్కరిపై నిలిచినట్లు వారు చూసారు 4వారందరు పరిశుద్ధాత్మతో నింపబడి, ఆత్మ వారికి ఇచ్చిన సామర్థ్యంతో ఇతర భాషలలో మాట్లాడడం మొదలుపెట్టారు.
5ఆ రోజుల్లో ఆకాశం క్రింద ఉన్న దేశాలన్నింటి నుండి వచ్చిన దైవభక్తి కలిగిన యూదులు యెరూషలేములో నివసిస్తున్నారు. 6వారు ఈ శబ్దం విన్నప్పుడు, ప్రజలు కలవరంతో ఒక్క చోటికి గుంపుగా వచ్చారు, ఎందుకంటే ప్రతి ఒక్కరు తమ స్వంత భాష మాట్లాడడం విన్నారు. 7వారు ఎంతగానో ఆశ్చర్యపడి, “మాట్లాడుతున్న వీరందరు గలిలయులు కారా? 8అయితే మనలో ప్రతి ఒక్కరూ మన మాతృభాషలో వారు మాట్లాడటాన్ని ఎలా వింటున్నాం? అని చెప్పుకొన్నారు. 9పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతమియ నివాసులు, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియా, 10ఫ్రుగియ, పంఫులియా, ఈజిప్టు, కురేనే దగ్గరి లిబియ ప్రాంతాలకు చెందినవారు, రోమా నుండి వచ్చిన కొంతమంది సందర్శకులు 11అనగా యూదులు, యూదా మతంలోనికి మారిన వారు; క్రేతీయులు, అరబీయులు మొదలైన వారందరు విస్మయపడి ఆశ్చర్యంతో, వీరు మన భాషలో దేవుని గొప్ప కార్యాలను ప్రకటించడాన్ని మనం వింటున్నాం.” 12దీని భావం ఏంటి? అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు.
13అయితే కొందరు, “వీరు క్రొత్త మద్యాన్ని చాలా ఎక్కువగా త్రాగారు” అంటూ వారిని హేళన చేశారు.
పేతురు జనసమూహంతో మాట్లాడుట
14అప్పుడు పేతురు ఆ పదకొండు మందితో పాటు నిలబడి, బిగ్గరగా ఆ జనసమూహంతో ఇలా అన్నాడు: “తోటి యూదులారా మరియు యెరూషలేములో ఉంటున్నవారలారా, నేను మీకు దీని గురించి వివరిస్తాను; నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. 15మీరందరు అనుకుంటున్నట్లు, వీరు మద్యం త్రాగిన మత్తులో లేరు. ఇప్పుడు ఉదయం తొమ్మిది గంటలు అవుతుంది! 16యోవేలు ప్రవక్త ఇలా చెప్పాడు:
17“ ‘దేవుడు ఇలా చెప్తున్నారు, చివరి రోజులలో,
నేను ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను.
మీ కుమారులు, కుమార్తెలు ప్రవచిస్తారు,
మీ యవ్వనస్థులు దర్శనాలు చూస్తారు,
మీ వృద్ధులు కలలు కంటారు.
18ఆ రోజుల్లో నా సేవకుల మీద, సేవకురాండ్ర మీద,
నా ఆత్మను కుమ్మరిస్తాను,
అప్పుడు వారు ప్రవచిస్తారు,
19నేను పైన ఆకాశంలో నా అద్బుతాలను,
క్రింద భూమి మీద నా సూచక క్రియలను,
రక్తం, అగ్ని, పొగ మేఘాన్ని చూపిస్తాను.
20మహా మహిమ గల ప్రభువు దినము రావడానికి
సూర్యుడు చీకటిగా
మరియు చంద్రుడు రక్తంగా మారుతాడు.
21అయితే ప్రభువు పేరట మొరపెట్టిన
ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు.’#2:21 యోవేలు 2:28-32
22“తోటి ఇశ్రాయేలీయులారా, ఇది వినండి: మీ కొరకు దేవుని నుండి అధికారం పొందిన నజరేయుడైన యేసు ద్వారా అద్బుతాలను, మహత్కార్యాలను, సూచక క్రియలను దేవుడే మీ మధ్యలో చేయించారని మీకు కూడ తెలుసు. 23దేవుడు తన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం యేసుక్రీస్తును మీకు అప్పగించారు; అయితే మీరు, దుష్టుల సహాయంతో, ఆయనను సిలువకు మేకులు కొట్టి చంపారు. 24కానీ మరణం ఆయనను బంధించి ఉంచడం అసాధ్యం, కనుక దేవుడు ఆయనను మరణ వేదన నుండి విడిపించి, మృతులలో నుండి లేపారు. 25దావీదు ఆయన గురించి ఇలా అన్నారు:
“ ‘ఎల్లప్పుడు నేను నాయెదుట నా ప్రభువును చూస్తున్నాను.
నా ప్రభువు, నా కుడి ప్రక్కనే ఉన్నారు,
కనుక నేను కదల్చబడను.
26కాబట్టి నా హృదయం సంతోషించి, నా నాలుక ఆనందిస్తుంది;
నా శరీరం కూడా నిరీక్షణలో విశ్రమిస్తుంది,
27ఎందుకంటే నీవు నా అంతరాత్మను మృతుల రాజ్యంలో విడిచిపెట్టవు,
నీ పరిశుద్ధుని కుళ్ళి పోనీయవు.
28నీవు నాకు జీవ మార్గాన్ని తెలిపావు;
నీ సన్నిధిలోని ఆనందంతో నన్ను నింపుతావు.’#2:28 కీర్తన 16:8-11
29“తోటి ఇశ్రాయేలీయులారా, నేను మీతో ధైర్యంగా చెప్పగలను, మీ పితరుడైన దావీదు చనిపోయి పాతిపెట్టబడ్డాడు, అతని సమాధి ఇప్పటికీ మన మధ్య ఉంది. 30అతడు ఒక ప్రవక్త మరియు దేవుడు అతని సంతానంలోని ఒకనిని అతని సింహాసనం మీద కూర్చోపెడతానని ఒట్టుపెట్టుకొని తనకు ప్రమాణం చేశాడని దావీదుకు తెలుసు. 31రాబోయేదాన్ని చూసిన ఆయన క్రీస్తు పునరుత్థానం గురించి మాట్లాడుతూ, ఆయన మృతుల రాజ్యంలో విడిచిపెట్టబడలేదని, ఆయన శరీరం కుళ్ళి పోవడం చూడలేదని చెప్పారు. 32దేవుడు యేసును జీవంతో లేపారు, దీనికి మేమంతా సాక్షులం. 33దేవుని కుడి చేతి వైపుకు ఎత్తబడి, తండ్రి చేసిన వాగ్దానం ప్రకారం పరిశుద్ధాత్మను పొందుకొని ఇప్పుడు మీరు చూస్తూ వింటున్న దానిని మీ మీద కుమ్మరించారు. 34దావీదు పరలోకానికి ఎక్కి పోలేదు అయినా ఇలా చెప్పాడు,
“ ‘నేను నీ శత్రువులను
నీకు పాదపీఠంగా చేసే వరకు
35“నీవు నా కుడి వైపున కూర్చోమని
ప్రభువు నా ప్రభువుతో చెప్పారు.” ’#2:35 కీర్తన 110:1
36“కనుక ఇశ్రాయేలు ప్రజలందరు ఖచ్చితంగా తెలుసుకోవలసింది ఏంటంటే: మీరు సిలువ వేసిన ఈ యేసునే, దేవుడు ప్రభువుగా మరియు క్రీస్తుగా చేశారు.”
37ప్రజలు ఈ మాటలు విని, మనస్సులో బాధపడి పేతురు, ఇతర అపొస్తలులతో, “సహోదరులారా, మేము ఏమి చేయాలి?” అని అన్నారు.
38అందుకు పేతురు, “మీలో ప్రతి ఒక్కరు, మీ పాపాల క్షమాపణ కొరకు పశ్చాత్తాపపడి, యేసు క్రీస్తు పేరట బాప్తిస్మం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుకొంటారు. 39ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకు మరియు దూరంగా ఉన్నవారందరికి అనగా, మన ప్రభువైన దేవుడు పిలిచే వారందరికి చెందుతుంది” అని వారితో చెప్పాడు.
40ఇంకా అనేక రకాల మాటలతో పేతురు వారిని హెచ్చరించి, “ఈ వక్ర తరం నుండి మీరు రక్షణ పొందండి” అని వారికి విజ్ఞప్తి చేశాడు. 41అతని సందేశాన్ని అంగీకరించినవారు బాప్తిస్మం పొందుకొన్నారు, ఆ రోజు సుమారుగా మూడు వేలమంది చేర్చబడ్డారు.
విశ్వాసుల సహవాసము
42వారు అపొస్తలులు చెప్పే బోధలకు లోబడి, వారి సహవాసంలో ఉండి, రొట్టె విరుచుటలో మరియు ప్రార్థనలో ఆసక్తితో కొనసాగుతున్నారు. 43అపొస్తలుల ద్వార జరిగిన అనేక అద్బుతాలు మరియు సూచక క్రియలను బట్టి ప్రతి ఒక్కరికి భయం కలిగింది. 44విశ్వాసులందరు కలిసి ఉన్నారు, ప్రతిదీ ఉమ్మడిగా కలిగి ఉన్నారు. 45వారు తమ ఆస్తిపాస్తులను అమ్మి అవసరంలోవున్న వారికి ఇచ్చారు. 46వారందరు ప్రతి రోజు దేవాలయ ఆవరణంలో క్రమంగా కలుసుకొనేవారు. తమ ఇండ్లలో అందరు కలిసి ఆనందంగా యదార్థమైన హృదయంతో రొట్టెను విరిచి తినేవారు. 47వారు దేవుని స్తుతిస్తూ, ప్రజలందరి అభిమానం పొందుకున్నారు. ప్రభువు ప్రతి దినము రక్షించబడుచున్న వారిని వారి సంఖ్యకు చేర్చారు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for అపొస్తలుల కార్యములు 2