YouVersion Logo
Search Icon

ప్రకటన 1

1
ప్రారంభ భాగం
1త్వరలో సంభవించబోయే వాటి గురించి దేవుడు తన సేవకులకు కనుపరచడానికి యేసుక్రీస్తుకు ఇచ్చిన ప్రత్యక్షత. ఆయన తన దూతను తన సేవకుడైన యోహాను దగ్గరకు పంపి ఈ సంగతులను తెలియజేసారు. 2అతడు దేవుని వాక్యం గురించి, యేసు క్రీస్తు సాక్ష్యం గురించి తాను చూసిన వాటన్నిటిని గురించి సాక్ష్యమిస్తున్నాడు. 3సమయం సమీపంగా ఉంది కనుక ఈ ప్రవచన వాక్యాలను బిగ్గరగా చదివేవారు ధన్యులు, దానిలో వ్రాయబడిన వాటిని విని వాటి ప్రకారం నడుచుకొనేవారు ధన్యులు.
వందనం మరియు ఆశీర్వచనం
4యోహాను,
ఆసియా ప్రాంతంలో ఉన్న ఏడు సంఘాలకు వ్రాయునది:
ఉన్నవాడు, ఉండినవాడు, రానున్న వాడు, దేవుని సింహాసనం ముందు ఉన్న ఏడు ఆత్మల#1:4 అంటే, ఏడంతల ఆత్మ నుండి 5నమ్మకమైన సాక్షిగా, మృతులలో నుండి అందరికంటే మొదటిగా జీవంతో తిరిగి లేచి, భూరాజులందరిని పరిపాలిస్తున్న యేసు క్రీస్తు నుండి మీకు కృపా సమాధానం కలుగును గాక!
ఆయనే మనల్ని ప్రేమిస్తూ తన రక్తం ద్వారా మన పాపాల నుండి మనల్ని విడిపించి, 6తన తండ్రియైన దేవునికి పరిచర్య చేసే యాజకుల రాజ్యంగా మనల్ని చేసిన ఆయనకే మహిమా ప్రభావం నిరంతరం కలుగును గాక! ఆమేన్.
7“ఇదిగో! ఆయన మేఘాలలో వస్తున్నారు.”#1:7 దాని 7:13
“ప్రతి కన్ను ఆయనను చూస్తుంది,
ఆయనను పొడిచిన వారు కూడ ఆయనను చూస్తారు”;
భూమి మీద ఉన్న జనులందరు “ఆయనను చూసి బిగ్గరగా విలపిస్తారు.”#1:7 జెకర్యా 12:10
అలా జరుగును గాక! ఆమేన్.
8“ఉన్న వాడు, ఉండినవాడు, రానున్నవాడైన సర్వశక్తిగల ప్రభువైన దేవుడు” చెప్తున్నారు, “ఆల్ఫాను, ఒమేగాను నేనే” అని.
యోహాను చూసిన క్రీస్తు దర్శనం
9యోహాను అనే నేను మీ సహోదరున్ని, యేసులో మనకు కలిగే శ్రమ, రాజ్యం, దీర్ఘ సహనంలో మీతో పాలిభాగస్థుడనైన నేను దేవుని వాక్యం కొరకు, యేసు సాక్ష్యం కొరకు పత్మాసు ద్వీపంలో బంధీగా ఉన్నాను. 10ప్రభువు దినాన నేను ఆత్మవశుడనై యున్నప్పుడు నా వెనుక నుండి బూరధ్వని వంటి ఒక పెద్ద స్వరం వినబడింది. 11ఆ స్వరం, “నీవు చూసినవాటిని ఒక గ్రంథపు చుట్టలో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియ, లవొదికయ అనే ఏడు సంఘాలకు పంపించు” అని చెప్పడం విన్నాను.
12నేను నాతో మాట్లాడిన స్వరం ఎవరా అని చూడడానికి చుట్టూ తిరిగాను. నేనలా తిరిగినప్పుడు అక్కడ ఏడు బంగారు దీపస్తంభాలను చూసాను. 13ఆ దీపస్తంభాల మధ్య, కాళ్ళ అంచుల వరకు పొడవైన వస్త్రాలను ధరించుకొని, తన రొమ్ముకు బంగారు దట్టీని కట్టుకొని మనుష్యకుమారునిలా ఉన్న ఒకరిని చూసాను.#1:13 దాని 7:13 14ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిలా, మంచు అంత తెల్లగా ఉన్నాయి. ఆయన కళ్ళు మండుతున్న అగ్ని జ్వాలల్లా ఉన్నాయి. 15ఆయన పాదాలు కొలిమిలో కాలుతూ ధగధగ మెరుస్తున్న కంచులా ఉన్నాయి; ఆయన కంఠస్వరం అనేక జలప్రవాహాల ధ్వనిలా వినిపించింది. 16ఆయన కుడిచేతిలో ఏడు నక్షత్రాలను పట్టుకొన్నాడు; ఆయన నోటి నుండి పదును గల రెండు అంచుల ఖడ్గం బయటకు వస్తుంది; ఆయన ముఖం పూర్తి తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యునిలా ఉంది.
17నేను ఆయనను చూడగానే చనిపోయిన వానిలా ఆయన పాదాల దగ్గర పడిపోయాను. అప్పుడు ఆయన తన కుడి చేతిని నా మీద పెట్టి నాతో, “భయపడకు, నేను మొదటి వాడను చివరి వాడను. 18జీవించు వాడను నేనే. ఇదిగో, నేను చనిపోయాను కాని ఇప్పుడు, ఎల్లకాలం నేను జీవిస్తున్నాను! మరణం, పాతాళ లోకపు తాళపుచెవులు నా అధికారంలోనే ఉన్నాయి.
19“కనుక నీవు చూసినవాటిని, ఇప్పుడు ఉన్నవాటిని, వాటి తరువాత జరుగబోయే వాటిని వ్రాసి పెట్టు. 20నా కుడిచేతిలో నీవు చూసిన ఏడు నక్షత్రాల గురించి, ఏడు దీపస్తంభాల గురించి మర్మం ఇదే: ఏడు నక్షత్రాలు అంటే ఏడు సంఘాల ఏడు దూతలు, ఏడు దీపస్తంభాలు అంటే ఏడు సంఘాలు.

Currently Selected:

ప్రకటన 1: TCV

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for ప్రకటన 1