YouVersion Logo
Search Icon

ప్రకటన 2

2
ఎఫెసు సంఘానికి వర్తమానం
1“ఎఫెసులో ఉన్న సంఘ దూతకు వ్రాసే సందేశం:
ఈ మాటలు ఏడు నక్షత్రాలను తన కుడిచేతిలో పట్టుకొని ఏడు దీపస్తంభాల మధ్య నడిచేవాడు చెప్తున్నాడు.
2నీ క్రియలు నీ ప్రయాస నీ పట్టుదల నాకు తెలుసు. నీవు దుష్టులను సహించలేవని నాకు తెలుసు. అపొస్తలులు కాకపోయినా మేము అపొస్తలులం అని చెప్పుకొనే వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు తెలుసుకున్నావు. 3నా పేరు కొరకు నీవు ఓర్పుతో అలసిపోకుండా కష్టాలను సహించావని నాకు తెలుసు.
4అయినా నీకు ఉండిన మొదటి ప్రేమను నీవు వదిలేసావు అనే తప్పును నేను నీ మీద మోపవలసివుంది. 5నీవు ఎంతగా పడిపోయావో గుర్తించు! నీవు పశ్చాత్తాపపడి మొదట చేసిన పనులు చేయి. నీవు పశ్చాత్తాపపడకపోతే నేను నీ దగ్గరకు వచ్చి, నీ దీపస్తంభాన్ని దాని స్థానంలో నుండి తీసివేస్తాను. 6అయితే నేను నీకొలాయితు పద్ధతులను ద్వేషించినట్లు నీవు కూడా ద్వేషిస్తున్నావు కనుక అది నీకు అనుకూలంగా ఉన్న మంచి కార్యం.
7ఆత్మ సంఘాలతో చెప్పే మాటలను చెవులుగలవారు విందురు గాక! వీటిని జయించినవారికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలాలను తినడానికి అనుమతిస్తాను.
స్ముర్న సంఘానికి వర్తమానం
8“స్ముర్నలో ఉన్న సంఘ దూతకు వ్రాసే సందేశం:
మొదటి వాడును చివరి వాడునై మరణించి తిరిగి లేచినవాడు ఈ మాటలు చెప్తున్నాడు.
9నీ శ్రమలు, నీ పేదరికం నాకు తెలుసు అయినా నీవు ధనవంతుడవే! తాము యూదులు కాకుండానే యూదులమని చెప్పుకొనే సాతాను సమాజం వారు నీకు విరుద్ధంగా పలికే దూషణ నాకు తెలుసు. 10నీకు కలుగబోయే కష్టాలను గురించి భయపడవద్దు. నిన్ను శోధించడానికి అపవాది మీలో కొందరిని చెరసాలలో వేస్తాడు, కనుక పది రోజులు హింస పొందుతారు అని తెలియజేస్తున్నాను. అయినా మరణం వరకు నమ్మకంగా ఉండండి. అప్పుడు నేను మీకు జీవాన్ని మీ విజయ కిరీటంగా బహూకరిస్తాను.
11ఆత్మ సంఘాలతో చెప్పే మాటలను చెవులుగలవారు విందురు గాక! జయించినవారికి రెండవ మరణం హాని చేయదు.
పెర్గము సంఘానికి వర్తమానం
12“పెర్గములో ఉన్న సంఘ దూతకు వ్రాసే సందేశం:
పదునైన రెండు అంచులు గల ఖడ్గం గలవాడు ఈ మాటలు చెప్తున్నాడు.
13సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు నివసిస్తున్నావని నాకు తెలుసు. నా నామానికి నిజంగా కట్టుబడి ఉన్నావు. సాతాను నివసించే నీ పట్టణంలో నా నమ్మకమైన సాక్షి అంతిప అనేవాడు హతసాక్షిగా చంపబడిన దినాలలో కూడ నాలో నీ విశ్వాసాన్ని వదలకుండా ఉన్నావు.
14అయినా, నేను నీ మీద కొన్ని తప్పులు మోపవలసివుంది: అవేమనగా విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినేలా, జారత్వం చేసేలా ఇశ్రాయేలీయులను వేధించమని బాలాకుకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. 15అలాగే నీకొలాయితు చేసే బోధలను అనుసరించేవారు కూడా నీలో ఉన్నారు. 16కనుక పశ్చాత్తాపపడు! లేకపోతే నేను త్వరలో నీ దగ్గరకు వచ్చినా నోటి ఖడ్గంతో వారితో యుద్ధం చేస్తాను.
17ఆత్మ సంఘాలతో చెప్పే మాటలను చెవులుగలవారు విందురు గాక! వీటిని జయించినవారికి నేను దాచి ఉంచిన మన్నాను ఇస్తాను. నేను వారికి తెల్లని రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరును ఇస్తాను. దాన్ని పొందినవారికి మాత్రమే ఆ పేరు తెలుస్తుంది.
తుయతైర సంఘానికి వర్తమానం
18“తుయతైరలో ఉన్న సంఘ దూతకు వ్రాసే సందేశం:
అగ్ని జ్వాలల్లాంటి కళ్ళు, తళతళ మెరుస్తున్న కంచును పోలిన పాదాలు గల దేవుని కుమారుడు ఈ మాటలు చెప్తున్నాడు:
19నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ సేవ, నీ పట్టుదల, నాకు తెలుసు. నీవు ఇప్పుడు చేసే క్రియలు ముందు చేసిన క్రియల కంటే గొప్పవని నాకు తెలుసు.
20అయినా నేను నీ మీద తప్పు మోపవలసివున్నది: తాను ప్రవక్తిని అని చెప్పుకొనే యెజెబెలును మీరు సహిస్తున్నారు. లైంగిక దుర్నీతి, విగ్రహాలకు అర్పించిన ఆహారం తినాలని నా సేవకులకు బోధిస్తూ వారిని మోసం చేసింది. 21ఆమె లైంగిక దుర్నీతి గురించి పశ్చాత్తాపపడడానికి నేను సమయం ఇచ్చాను కాని ఆమె ఇష్టపడలేదు. 22కనుక నేను ఆమెను శ్రమల పడకపై పడవేస్తాను. అలాగే ఆమెతో వ్యభిచరించిన వారిని కూడా వారు పశ్చాత్తాపపడకపోతే తీవ్రమైన బాధలకు గురి చేస్తాను. 23ఆమె పిల్లలను నేను మరణానికి అప్పగిస్తాను. అప్పుడు సంఘాలన్ని నేను అంతరంగాలను, హృదయాలను పరిశోధిస్తానని, మీలో ప్రతి ఒక్కరికి మీ క్రియలకు తగిన ప్రతిఫలం ఇస్తానని తెలుసుకొంటాయి.
24అయితే తుయతైరలో యెజెబెలు బోధను అంగీకరించకుండా, సాతాను లోతైన మర్మాలను నేర్చుకోకుండా ఉన్న తక్కిన వారందరికి, ‘నేను ఇక ఏ భారం మీ మీద మోపనని చెప్తున్నాను. 25కాని నేను వచ్చేవరకు మీరు కలిగి ఉన్నదానినే గట్టిగా పట్టుకోండి.’
26చివరి వరకు నా చిత్తం చేస్తూ జయించే వారికి నా తండ్రి నుండి నేను అధికారం పొందినట్లే రాజ్యాల మీద అధికారం ఇస్తాను. 27‘వారు ఇనుప దండంతో రాజ్యాలను పరిపాలిస్తారు, వారిని మట్టి కుండలను పగలగొట్టినట్లు పగలగొడతారు.’#2:27 కీర్తన 2:9 28నేను వారికి వేకువ చుక్కను కూడా ఇస్తాను. 29ఆత్మ సంఘాలతో చెప్పే మాటలు చెవులుగలవారు విందురు గాక!

Currently Selected:

ప్రకటన 2: TCV

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for ప్రకటన 2