YouVersion Logo
Search Icon

ప్రకటన 3

3
సార్దీసు సంఘానికి వర్తమానం
1“సార్దీసులో ఉన్న సంఘ దూతకు వ్రాసే సందేశం:
దేవుని ఏడు ఆత్మలు,#3:1 అంటే, ఏడంతల ఆత్మ ఏడు నక్షత్రాలు గలవాడు ఈ మాటలు చెప్తున్నాడు.
నీ క్రియలు నాకు తెలుసు, నీవు బ్రతికున్నావని పేరు ఉంది కాని నీవు చచ్చిన దానివే. 2మేల్కో, నా దేవుని దృష్టిలో నీ క్రియలను సంపూర్తిగా ముగించలేదని నేను కనుగొన్నాను కనుక మిగిలిన ప్రాణాన్ని బలపరచు. 3కనుక నీవు పొందిన వాటిని విన్నవాటిని జ్ఞాపకం చేసుకొని, వాటిని పాటిస్తూ గట్టిగా పట్టుకొని పశ్చాత్తాపపడు. కాని నీవు మేలుకోక పోతే నేను దొంగలా వస్తాను, నేను ఏ సమయంలో నీ దగ్గరకు వస్తానో నీకు తెలియదు.
4అయినా సార్దీసులో నీ దగ్గర ఉన్న కొందరు తమ వస్త్రాలను మురికి చేసుకోలేదు. వారు యోగ్యులు కనుక వారు తెల్లని వస్త్రాలను ధరించుకొని నాతో పాటు నడుస్తారు. 5జయించువారు వారిలా తెల్లని వస్త్రాలు ధరించుకొంటారు. వాని పేరును నేను జీవగ్రంథంలో నుండి ఎన్నడు తుడిచివేయను నా తండ్రి ముందు, ఆయన దూతల ముందు వాని పేరును ఒప్పుకుంటాను. 6ఆత్మ సంఘాలతో చెప్పే మాటలు చెవులుగలవారు విందురు గాక!
ఫిలదెల్ఫియ సంఘానికి వర్తమానం
7“ఫిలదెల్ఫియలో ఉన్న సంఘ దూతకు వ్రాసే సందేశం:
దావీదు తాళపు చెవిని కలిగి ఉన్న సత్యవంతుడైన పరిశుద్ధుడు ఈ మాటలు చెప్తున్నాడు. ఆయన తెరచిన దాన్ని ఎవరూ మూయలేరు, ఆయన మూసిన దాన్ని ఎవరూ తెరవలేరు.
8నీ క్రియలు నాకు తెలుసు. ఎవరు మూయలేని ద్వారం నేను నీ ముందు తెరచి ఉంచాను. నీకు కొద్ది బలమే ఉన్నా నీవు నా వాక్యాన్ని పాటించి జీవిస్తూ నా పేరును తిరస్కరించలేదని నాకు తెలుసు. 9యూదులు కాకపోయినా తాము యూదులం అని అబద్ధాలు చెప్పుకొనే సాతాను సమాజానికి చెందిన వారందరిని నీ దగ్గరకు రప్పించి నీ పాదాల ముందు సాగిలపడి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని వారు ఒప్పుకొనేలా చేస్తాను. 10నేను నీకు ఆజ్ఞాపించినట్లే నీవు సహనంతో సహించావు కనుక భూనివాసులు అందరిని పరీక్షించడానికి లోకం మీద రానున్న ఆ శోధన సమయం నుండి నేను నిన్ను కాపాడతాను.
11నేను త్వరగా వస్తున్నాను. కనుక ఎవరు నీ కిరీటాన్ని తీసుకోకుండా నీవు కలిగివున్న దాన్ని గట్టిగా పట్టుకో. 12జయించినవారిని నా దేవాలయంలో ఒక స్తంభంగా నిలబెడతాను. అప్పుడు వారు దానిలో నుండి ఎన్నడూ తొలగిపోలేరు. వారి మీద నేను నా దేవుని పేరును పరలోకంలో ఉన్న నా దేవుని నుండి దిగి వస్తున్న నూతన యెరూషలేము అనే నా దేవుని పట్టణం పేరును వ్రాస్తాను, వాని మీద నేను నా క్రొత్త పేరును కూడా వ్రాస్తాను. 13ఆత్మ సంఘాలతో చెప్పే మాటలు చెవులుగలవారు విందురు గాక!
లవొదికయ సంఘానికి వర్తమానం
14“లవొదికయలో ఉన్న సంఘ దూతకు వ్రాసే సందేశం:
ఆమేన్ అనువాడు, నమ్మకమైనవాడు, సత్య సాక్షి, దేవుని సృష్టిని పరిపాలించేవాడు ఈ మాటలు చెప్తున్నాడు.
15నీ క్రియలు నాకు తెలుసు, నీవు చల్లగా కాని వెచ్చగా కాని లేవు. నీవు చల్లగా కాని వెచ్చగా కాని ఉంటే మంచిది. 16నీవు చల్లగా కాని వెచ్చగా కాని లేకుండా నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నా నోటిలో నుండి నిన్ను ఉమ్మి వేస్తాను. 17‘నేను ధనవంతున్ని నేను చాలా ఆస్తులను సమకూర్చుకొన్నాను కనుక నాకు ఏమి లోటులేదు’ అని నీవు చెప్పుకొంటున్నావు. కాని నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, బీదవాడవు, గ్రుడ్డివాడివి, దిగంబరివి అని నీకు గ్రహింపులేదు. 18నీవు ధనవంతునివి అయ్యేలా అగ్నిలో పుటం వేసిన బంగారాన్ని, అవమానకరమైన నీ దిగంబరత్వం కనబడకుండా ధరించుకోవడానికి తెల్లని వస్త్రాన్ని, నీకు చూపు కలుగడానికి నీ కళ్ళకు మందును నా దగ్గర కొనుక్కో అని నేను నీకు సలహా ఇస్తున్నాను.
19నేను ప్రేమించేవారిని గద్దించి శిక్షిస్తాను కనుక నీవు ఆసక్తి కలిగి పశ్చాత్తాపపడు. 20ఇదిగో! నేను తలుపు దగ్గర నిలబడి తలుపు తడుతున్నాను. ఎవరైనా నా స్వరంను విని తలుపు తీస్తే నేను లోపలికి వచ్చి, అతనితో నేను, నాతో అతడు భోజనం చేస్తాము.
21జయించినవారికి నేను జయించి, నా తండ్రితో పాటు ఆయన సింహాసనం మీద కూర్చున్నట్లే వానిని నా సింహాసనంలో నాతో పాటు కూర్చోనిస్తాను. 22ఆత్మ సంఘాలతో చెప్పే మాటలను చెవులుగలవారు విందురు గాక!”

Currently Selected:

ప్రకటన 3: TCV

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in