ప్రకటన 17
17
మృగం మీద ఉన్న బబులోను అనే మహావేశ్య
1ఏడు పాత్రలను పట్టుకుని ఉన్న ఏడుగురు దేవదూతల్లో ఒక దేవదూత వచ్చి నాతో, “ఇక్కడకు రా, అనేక జలాల మీద కూర్చుని ఉన్న మహావేశ్యకు విధించబడిన శిక్షను నీకు చూపిస్తాను. 2భూ రాజులు ఆ వేశ్యతో వ్యభిచరించారు, ఆమె వ్యభిచారమనే మద్యంతో భూనివాసులందరు మత్తులయ్యారు” అని చెప్పాడు.
3అప్పుడు ఆ దేవదూత నన్ను ఆత్మలో ఎడారిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఒక స్త్రీ ఎరుపు రంగులో ఉన్న మృగం మీద కూర్చుని ఉండడం నేను చూశాను. ఆ మృగం నిండా దైవదూషణ పేర్లు ఉన్నాయి; దానికి ఏడు తలలు, పది కొమ్ములు ఉన్నాయి. 4ఆ స్త్రీ ఊదా, ఎరుపురంగు వస్త్రాలను ధరించి, మెరిసే బంగారం, విలువైన రాళ్లు, ముత్యాలతో అలంకరించబడి ఉంది. ఆమె తన చేతితో ఒక బంగారు పాత్ర పట్టుకుని ఉంది. ఆ పాత్ర ఆమె చేసిన అసహ్యమైన పనులు, వ్యభిచారమనే మురికితో నిండి ఉంది. 5ఆమె నుదిటి మీద వ్రాసి ఉన్న పేరులో ఒక రహస్యం ఉంది:
“మహా బబులోను పట్టణం,
వేశ్యలకు తల్లి
భూమి మీద జరిగే ప్రతి అసహ్యమైన కార్యానికి తల్లి.”
6ఈ స్త్రీ దేవుని పరిశుద్ధ ప్రజల రక్తాన్ని అనగా యేసు హతసాక్షుల రక్తాన్ని త్రాగి మత్తులో ఉండడం నేను చూశాను.
నేను ఆమెను చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యపడ్డాను. 7అప్పుడు ఆ దేవదూత నాతో, “నీవెందుకు ఆశ్చర్యపడుతున్నావు? హతసాక్షుల స్వారీ చేసిన ఏడు తలలు పది కొమ్ములు కలిగిన మృగానికి సంబంధించిన రహస్యాన్ని నేను నీకు తెలియజేస్తాను” అని చెప్పాడు. 8నీవు చూసిన ఆ మృగం ఒకప్పుడు ఉండేది కాని ఇప్పుడు లేదు. అది అగాధం నుండి పైకి వచ్చి నాశనమై పోవడానికి సిద్ధంగా ఉన్నది. ఆ మృగం ఇంతకుముందు ఉండేది, కానీ ఇప్పుడు లేదు. అది మళ్ళీ వస్తుంది కాబట్టి సృష్టికి పునాది వేయబడక ముందు నుండి జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడని భూనివాసులందరు ఆ మృగాన్ని చూసి ఆశ్చర్యపడతారు.
9ఈ విషయాన్ని గుర్తించడానికి జ్ఞానంగల మనస్సు అవసరం. ఆ స్త్రీ కూర్చుని ఉన్న ఏడు తలలు ఏడు కొండలు. 10ఆ ఏడు తలలు ఏడుగురు రాజులను సూచిస్తున్నాయి. వారిలో అయిదుగురు పడిపోయారు, ఒక రాజు యేలుతున్నాడు, మరొక రాజు ఇంకా రాలేదు. కాని అతడు వచ్చినప్పుడు అతడు కేవలం కొంతకాలమే యేలుతాడు. 11ఇంతకుముందు ఉండి ఇప్పుడు లేని ఆ మృగమే ఎనిమిదవ రాజు. ఆ మృగమే ఏడుగురిలో ఒకడు, అతడు తన నాశనం కోసమే రాబోతున్నాడు.
12నీవు చూసిన పది కొమ్ములు పదిమంది రాజులు. వారు ఇంకా రాజ్యాన్ని పొందలేదు, కాని మృగంతో పాటు కలిసి ఒక గంట సమయం రాజుల్లా యేలడానికి వారికి అధికారం ఇవ్వబడుతుంది. 13వీరు ఒకే ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. వీరు తమ శక్తిని, అధికారాన్ని మృగానికి ఇస్తారు. 14ఈ రాజులందరూ మృగంతో పాటు కలిసి గొర్రెపిల్లకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తారు కాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు కాబట్టి ఆయన వారందరి మీద విజయం పొందుతాడు. ఆయనతో పాటు ఆయనచే పిలువబడిన వారు, ఏర్పరచబడినవారు ఆయనను నమ్మకంగా వెంబడించినవారు ఉంటారు.
15అప్పుడు ఆ దేవదూత నాతో, “ఆ వేశ్య కూర్చుని ఉన్న ఆ జలాలే ప్రజలు, జనసమూహాలు, దేశాలు, వివిధ భాషలు మాట్లాడేవారు. 16నీవు చూసిన ఆ మృగం ఆ పది కొమ్ములు ఆ వేశ్యను ద్వేషిస్తాయి. అవి ఆమెను దిక్కులేని దానిగా, దిగంబరిగా చేయడానికి ఆమెను తీసుకొస్తాయి. అవి ఆమె మాంసాన్ని తిని, ఆమె శరీరాన్ని అగ్నితో కాల్చివేస్తాయి. 17ఎందుకంటే దేవుడు ముందుగానే పలికిన మాటలు నెరవేరే వరకు వారు తమ రాజ్యాధికారాన్ని ఆ మృగానికి అప్పగించడానికి అంగీకరించడం ద్వారా ఆయన ఉద్దేశాలు పూర్తయ్యే వరకు దేవుడు దీన్ని వారి హృదయాల్లో ఉంచారు. 18నీవు చూసిన ఆ స్త్రీ భూరాజులను యేలుతున్న ఆ మహా పట్టణం” అని చెప్పాడు.
Currently Selected:
ప్రకటన 17: TSA
Highlight
Share
Copy
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapistaging.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fen.png&w=128&q=75)
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.