ప్రకటన 18
18
కూలిపోయిన బబులోను గురించి విలాపం
1తర్వాత మరొక దేవదూత పరలోకం నుండి క్రిందికి దిగి రావడం నేను చూశాను; అతనికి గొప్ప అధికారం ఉంది, అతని వెలుగుతో భూమి ప్రకాశించింది. 2అతడు గొప్ప స్వరంతో ఇలా అన్నాడు,
“బబులోను మహా పట్టణం కూలిపోయింది! కూలిపోయింది!#18:2 యెషయా 21:9
అది దయ్యాలు సంచరించే స్థలంగా,
ప్రతి దుష్ట ఆత్మలు సంచరించే స్థలంగా,
ప్రతి అపవిత్ర పక్షి సంచరించే స్థలంగా,
ప్రతి మలినమైన అసహ్యమైన క్రూరమృగాలు సంచరించే స్థలంగా మారింది.
3ఎందుకంటే ఆమె వ్యభిచార మద్యాన్ని త్రాగి
దేశాలన్నీ మత్తులయ్యాయి.
భూలోక రాజులు ఆమెతో వ్యభిచరించారు.
భూలోక వర్తకులు ఆమె ఇచ్చే అధిక విలాసాలతో ధనికులయ్యారు.”
బబులోను తీర్పును తప్పించుకోవడానికి హెచ్చరిక
4అప్పుడు పరలోకంలో నుండి మరొక స్వరం వినిపించింది:
“ ‘నా ప్రజలారా! మీరు ఆమె పాపాల్లో భాగం పంచుకోకుండా’#18:4 యిర్మీయా 51:45
ఆమెకు సంభవించే ఏ కీడు మీ మీదికి రాకుండా,
ఆమెలో నుండి బయటకు రండి;
5ఆమె చేసిన పాపాలు ఆకాశమంత ఎత్తుగా ఉన్నాయి కాబట్టి,
దేవుడు ఆమె అతిక్రమాలను జ్ఞాపకం చేసుకున్నారు.
6ఆమె ఎలా ఇచ్చిందో ఆమెకు అలాగే ఇవ్వండి;
ఆమె చేసిన దానికి రెండింతలు ఆమెకు తిరిగి చెల్లించండి.
ఆమె పాత్ర నుండే ఆమెకు రెండింతలు పోసి ఇవ్వండి!
7ఆమె తనను తాను హెచ్చించుకొంటూ ఎన్ని సుఖభోగాలు అనుభవించిందో,
అంత వేదన దుఃఖాన్ని ఆమెకు కలుగజేయండి.
ఎందుకంటే, ఆమె తన హృదయంలో,
‘నేను రాణిగా నా సింహాసనం మీద కూర్చున్నాను.
నేను విధవరాలిని కాను,#18:7 యెషయా 47:7,8
ఇక ఎన్నడు సంతాపం అనుభవించను’ అని అనుకుంది.
8కాబట్టి ఒక్క రోజులోనే ఆమె తెగుళ్ళన్ని ఆమెను పట్టుకుంటాయి,
ఆమె మీదికి మరణం, దుఃఖం, కరువు వస్తాయి.
ఆమెకు తీర్పు తీర్చే ప్రభువైన దేవుడు శక్తిగలవాడు,
కాబట్టి ఆమె అగ్నితో కాల్చివేయబడుతుంది.”
బబులోను మహా పట్టణం పతనానికి మూడు రెట్ల విపత్తు
9ఆమెతో వ్యభిచరించి ఆమె సుఖభోగాలను అనుభవించిన భూ రాజులు ఆమె కాలుతున్నప్పుడు వచ్చే పొగను చూసి ఆమె కోసం కన్నీరు కారుస్తూ దుఃఖిస్తారు. 10ఆమె పడే వేదన చూసి భయపడి, వారు దూరంగా నిలబడి ఇలా రోదిస్తారు:
“మహా పట్టణమా! నీకు శ్రమ! శ్రమ!
బబులోను మహా పట్టణమా,
ఒక్క గంటలోనే నీ మీదికి శిక్ష వచ్చింది.”
11భూలోక వ్యాపారులు ఇకపై తమ సరుకులు కొనేవారెవరు లేరని ఆమె కోసం కన్నీరు కారుస్తూ దుఃఖిస్తారు. 12వారి సరుకులు ఏవంటే బంగారం, వెండి, విలువైన రాళ్లు, ముత్యాలు; సన్నని నారబట్టలు, ఊదా రంగు బట్టలు, పట్టు బట్టలు, ఎర్రని బట్టలు; సువాసన ఇచ్చే అన్ని రకాల చెక్కలు, దంతాలతో చాలా విలువైన చెక్కతో ఇత్తడి ఇనుము నునుపురాళ్లతో తయారుచేసిన అన్ని రకాల వస్తువులు; 13దాల్చిన చెక్క, సుగంధద్రవ్యాలు, ధూపద్రవ్యాలు, బోళం సాంబ్రాణి, ద్రాక్షరసం ఒలీవనూనె, శ్రేష్ఠమైన పిండి గోధుమలు; పశువులు గొర్రెలు, గుర్రాలు రథాలు; మానవులు కేవలం భౌతిక శరీరాలు మాత్రమే కాదు, మనుష్యుల ప్రాణాలు, బానిసలు.
14అప్పుడు వర్తకులు ఆ పట్టణంతో, “నీ ప్రాణం కోరుకున్న ఫలం నిన్ను విడిచిపోయింది, నీకున్న సుఖవిలాసం, వైభవాలు ఇంకెన్నడు నీకు కనిపించకుండా మాయమైపోయాయి” అని అన్నారు. 15ఈ సరుకులను అమ్ముతూ ఆమె వలన ధనవంతులైన వ్యాపారులు ఆమె అనుభవించే వేదన చూసి భయంతో దూరంగా నిలబడ్డారు. వారు ఏడుస్తూ రోదిస్తూ, 16బిగ్గరగా ఇలా రోదించారు,
“ ‘మహా పట్టణమా! నీకు శ్రమ! శ్రమ!
సన్నని నారబట్టలు, ఊదా రంగు బట్టలు, ఎరుపురంగు బట్టలు ధరించుకొని,
బంగారంతో, విలువైన రాళ్లతో, ముత్యాలతో అలంకరించుకుని మెరుస్తున్నదానా,
17ఒక్క గంటలోనే ఈ నీ గొప్ప ధనసంపద అంతా వ్యర్థమైపోయిందా?’
“ప్రతి ఓడ అధిపతి, ఓడ ప్రయాణికులందరు, నావికులు, సముద్ర వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు దూరంగా నిలబడ్డారు. 18కాలిపోతున్న ఆమె నుండి వస్తున్న పొగను చూసి, ‘ఈ మహా పట్టణం వంటి గొప్ప పట్టణం ఎప్పుడైనా ఉన్నదా?’ అని బిగ్గరగా కేకలు వేస్తారు. 19వారు తమ తలలపై దుమ్మును పోసుకుంటూ కన్నీరు కార్చుతూ దుఃఖిస్తూ బిగ్గరగా రోదిస్తూ,
“ ‘మహా పట్టణమా, నీకు శ్రమ! శ్రమ!
సముద్రంలో ఓడలున్న వారందరు
ఆమె ధన సమృద్ధితో ధనికులయ్యారు.
గాని ఒక్క గంటలోనే ఆమె నశించిపోయిందే అని చెప్పుకుంటారు.’
20“పరలోకమా ఆమెను బట్టి ఆనందించండి.
దేవుని ప్రజలారా, ఆనందించండి.
అపొస్తలులారా, ప్రవక్తలారా ఆనందించండి.
ఎందుకంటే, ఆమె మీకు విధించిన తీర్పును బట్టి
దేవుడు ఆమెకు తీర్పు తీర్చారు.”
బబులోను పతనం యొక్క అంతిమఘట్టం
21ఆ తర్వాత ఒక బలమైన దేవదూత ఒక పెద్ద తిరుగలి రాయంత బండరాయిని తీసుకుని సముద్రంలో పడవేసి,
“ఇలాంటి హింసలతో
బబులోను మహా పట్టణం క్రిందికి త్రోయబడుతుంది
మరి ఎన్నడు అది కనబడదు.
22వీణ వాయించేవారి, పిల్లన గ్రోవులు బూరలు ఊదేవారి సంగీతం
మరి ఎన్నడు నీలో వినబడదు.
వ్యాపారం చేసే ఏ పనివాడైనా
నీలో ఎన్నడు కనిపించడు.
తిరుగలి రాయి తిప్పే శబ్దం
మరెన్నడు నీలో వినబడదు.
23ఇక ఒక దీపపు వెలుగైనా
నీలో ఎన్నడూ ప్రకాశించదు.
ఇక వధువు స్వరం వరుని స్వరం
నీలో ఎన్నడూ వినిపించదు.
నీ వర్తకులు ప్రపంచంలో ప్రఖ్యాతి పొందినవారిగా ఉన్నారు.
నీ మాయ మంత్రాలతో దేశాలన్నీ మోసపోయాయి.
24ప్రవక్తల రక్తం దేవుని పరిశుద్ధ ప్రజల రక్తం,
భూమి మీద వధించబడిన వారందరి రక్తం ఆమెలో కనిపిస్తుంది.”
Currently Selected:
ప్రకటన 18: TSA
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.