1 దినవృత్తాంతములు 29
29
ఆలయ నిర్మాణానికి కానుకలు
1అప్పుడు రాజైన దావీదు సమావేశంలో ఉన్నవారందరితో ఇలా అన్నాడు: “దేవుడు ఎన్నుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకా చిన్నవాడు, అనుభవం లేనివాడు. మందిరం నిర్మించేది మనుష్యునికి కాదు, దేవుడైన యెహోవా కోసం, కాబట్టి పని చాలా గొప్పది. 2నాకున్న శక్తికొలది నా దేవుని మందిరానికి కావలసిన బంగారు పనికి బంగారాన్ని, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, చెక్క పనికి చెక్కను, పెద్ద మొత్తంలో గోమేధికపురాళ్లను, వైడూర్యాలను, రకరకాల రంగుల రాళ్లను, అన్ని రకాల జాతి మేలిమి రాళ్లను, పాలరాతిని సమృద్ధిగా సమకూర్చి పెట్టాను. 3పరిశుద్ధ మందిరం కోసం నేను సమకూర్చినవన్నీ కాకుండా, ఇప్పుడు నా దేవుని మందిరం పట్ల నాకున్న నిబద్ధతను చూపించడానికి నా సొంత ఖజానాలో ఉన్న బంగారాన్ని, వెండిని, నా దేవుని మందిరానికి ఇస్తున్నవి: 4-5భవనాల గోడలకు పూత వేయడానికి, బంగారపు పనికి, వెండి పనికి, పనివారు చేసే ప్రతి పనికి మూడువేల తలాంతుల#29:4-5 మూడువేల తలాంతుల అంటే, సుమారు 110 టన్నులు ఓఫీరు బంగారం, ఏడువేల#29:4-5 అంటే, సుమారు 260 టన్నులు తలాంతుల శుద్ధి చేసిన వెండి. ఇప్పుడు, యెహోవాకు మనస్పూర్తిగా సమర్పించుకునే వారు మీలో ఎవరైనా ఉన్నారా?”
6అప్పుడు కుటుంబ నాయకులు, ఇశ్రాయేలు గోత్రాల అధికారులు, సహస్రాధిపతులు, శతాధిపతులు, రాజు పనుల మీద నియమించబడిన అధికారులు అందరు ఇష్టపూర్వకంగా సమర్పించారు. 7వారు దేవుని మందిరం పనికి అయిదువేల తలాంతుల#29:7 అంటే, సుమారు 190 టన్నులు బంగారాన్ని, పదివేల డారిక్కుల#29:7 అంటే, సుమారు 84 కి. గ్రా. లు బంగారాన్ని, పదివేల తలాంతుల#29:7 అంటే, 380 టన్నులు వెండిని, పద్దెనిమిది వేల తలాంతుల#29:7 అంటే, సుమారు 675 టన్నులు ఇత్తడిని, లక్ష తలాంతుల#29:7 అంటే, సుమారు 3800 టన్నులు ఇనుమును ఇచ్చారు. 8ప్రశస్తమైన రాళ్లు ఉన్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిర ఖజానాకు అధికారిగా ఉన్న గెర్షోనీయుడైన యెహీయేలుకు ఇచ్చారు. 9తమ నాయకులు హృదయమంతటితో స్వేచ్ఛగా యెహోవాకు సమర్పించడం చూసి ప్రజలు వారిని బట్టి సంతోషించారు. రాజైన దావీదు కూడా చాలా సంతోషించాడు.
దావీదు ప్రార్థన
10దావీదు, అక్కడ సమావేశమైన వారందరి ఎదుట యెహోవాను ఇలా స్తుతించాడు:
“యెహోవా, మా తండ్రియైన ఇశ్రాయేలు దేవా!
యుగయుగాల వరకు
మీకు స్తుతి కలుగును గాక.
11యెహోవా! మహాత్మ్యం, ప్రభావం,
వైభవం, తేజస్సు, మహిమ మీకే చెందుతాయి.
ఎందుకంటే భూమ్యాకాశాల్లో ఉన్నవన్నీ మీవే.
యెహోవా రాజ్యం మీదే;
మీరు అందరి మీద అధిపతిగా హెచ్చింపబడ్డారు.
12ఐశ్వర్యం, ఘనత మీ మూలంగా వస్తాయి;
మీరు సమస్తానికి పాలకులు.
అందరిని హెచ్చించి, బలపరచడానికి
మీ చేతిలో బలం, శక్తి ఉన్నాయి.
13మా దేవా! మేము మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ,
మీ ఘనమైన నామాన్ని స్తుతిస్తున్నాము.
14“అయితే, ఇంత ధారాళంగా ఇచ్చే సామర్థ్యం కలిగి ఉండడానికి నేను ఏపాటివాన్ని? నా ప్రజలు ఏపాటివారు? అన్నీ మీ నుండే వస్తాయి. మీ చేతి నుండి వచ్చిన దానిలో నుండే మేము మీకు ఇచ్చాము. 15మా పూర్వికుల్లా మేము మీ దృష్టిలో విదేశీయులం, అపరిచితులము. భూమిమీద మా జీవితకాలం నిరీక్షణలేని నీడలాంటిది. 16యెహోవా, మా దేవా, నీ పరిశుద్ధ నామం కోసం మందిరాన్ని కట్టించడానికి మేము సమకూర్చిన ఈ సంపదంతా మీ చేతి నుండి వచ్చేదే, దానిలో సమస్తం మీకు చెందినదే. 17నా దేవా! మీరు హృదయాన్ని పరిశోధిస్తారని, నిజాయితీ అంటే మీకు ఇష్టమని నాకు తెలుసు. నేను ఇవన్నీ ఇష్టపూర్వకంగా నిజాయితితో ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న మీ ప్రజలు కూడా మీకు ఇష్టపూర్వకంగా ఇవ్వడం చూసి నేను సంతోషిస్తున్నాను. 18యెహోవా! మా పూర్వికులైన అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఈ ఆశలు, తలంపులు మీ ప్రజల హృదయాల్లో ఎప్పుడూ ఉండేలా, వారి హృదయాలు మీ పట్ల నమ్మకంగా ఉండేలా చేయండి. 19నా కుమారుడైన సొలొమోను మీ ఆజ్ఞలను, శాసనాలను, నియమాలను పాటిస్తూ, నేను ఆలయ నిర్మాణం కోసం సమకూర్చిన వాటితో అతడు కట్టించడానికి అతడు పూర్ణహృదయంతో భక్తి కలిగి ఉండునట్లు చేయండి.”
20తర్వాత దావీదు సమావేశమైన వారందరితో, “మీ దేవుడైన యెహోవాను స్తుతించండి” అని చెప్పాడు. అప్పుడు వారందరూ తమ పూర్వికుల దేవుడైన యెహోవాను స్తుతించి, యెహోవా ఎదుట, రాజు ఎదుట తలలు వంచి, సాగిలపడ్డారు.
సొలొమోను రాజుగా నియమించబడుట
21మరుసటిరోజు వారు యెహోవాకు అర్పణలు ఇచ్చి దహనబలులు అర్పించారు: వెయ్యి ఎద్దులు, వెయ్యి పొట్టేళ్లు, వెయ్యి మగ గొర్రెపిల్లలు, వాటితో పాటు పానార్పణలను ఇశ్రాయేలీయులందరి పక్షాన సరిపడా ఇతర బలులు అర్పించారు. 22ఆ రోజు వారు యెహోవా సన్నిధిలో చాలా ఆనందంతో విందు చేసుకున్నారు.
అప్పుడు వారు దావీదు కుమారుడైన సొలొమోనుకు రెండవసారి పట్టాభిషేకం చేసి, యెహోవా సన్నిధిలో అతన్ని పాలకునిగా, సాదోకును యాజకునిగా అభిషేకించారు. 23కాబట్టి సొలొమోను రాజుగా తన తండ్రియైన దావీదు స్థానంలో యెహోవా రాజ్యసింహాసనం మీద కూర్చున్నాడు. అతడు అన్నిటిలో వృద్ధి చెందాడు, ఇశ్రాయేలీయులందరు అతనికి విధేయులయ్యారు. 24అధిపతులందరు, యుద్ధ వీరులందరు, రాజైన దావీదు కుమారులందరు, సొలొమోను రాజుకు విధేయత చూపించారు.
25యెహోవా సొలొమోనును ఇశ్రాయేలీయులందరి ఎదుట ఎంతో ఉన్నతంగా చేసి, అతనికి ముందున్న ఇశ్రాయేలీయుల రాజులలో ఏ రాజుకు కలగని రాజ వైభవాన్ని అతనికి ప్రసాదించారు.
దావీదు మరణము
26యెష్షయి కుమారుడైన దావీదు ఇశ్రాయేలు అంతటి మీద రాజుగా ఉన్నాడు. 27అతడు ఇశ్రాయేలును నలభై సంవత్సరాలు అంటే హెబ్రోనులో ఏడు సంవత్సరాలు, యెరూషలేములో ముప్పై మూడు సంవత్సరాలు పరిపాలించాడు. 28అతడు దీర్ఘకాలం జీవించి ఐశ్వర్యాన్ని ఘనతను పొంది మంచి వృద్ధాప్యంలో చనిపోయాడు. అతని స్థానంలో అతని కుమారుడైన సొలొమోను రాజయ్యాడు.
29-30రాజైన దావీదుకు సంబంధించిన ఇతర వివరాలన్నీ మొదటి నుండి చివరి వరకు, అతని పాలనకు అధికారానికి సంబంధించిన వివరాలు, అతడు, ఇశ్రాయేలీయులు ఇతర దేశాల రాజ్యాలు ఎదుర్కొన్న పరిస్థితుల వివరాలు దీర్ఘదర్శి సమూయేలు, నాతాను ప్రవక్త, దీర్ఘదర్శి గాదు వ్రాసిన చరిత్ర గ్రంథాల్లో ఉన్నాయి.
Currently Selected:
1 దినవృత్తాంతములు 29: OTSA
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.