2 దినవృత్తాంతములు 1
1
సొలొమోను జ్ఞానం కోసం ప్రార్థించుట
1దావీదు కుమారుడు సొలొమోను తన రాజ్యంలో రాజుగా స్థిరపడ్డాడు, అతని దేవుడైన యెహోవా అతనికి తోడుగా ఉండి అతన్ని గొప్పగా హెచ్చించాడు.
2అప్పుడు సొలొమోను ఇశ్రాయేలీయులందరితో అంటే సహస్రాధిపతులతో,#1:2 సహస్రాధిపతులతో అంటే వేయిమంది సైనికులపై అధిపతి శతాధిపతులతో#1:2 శతాధిపతులతో అంటే, వందమంది సైనికులపై అధిపతులతో, న్యాయాధిపతులతో, ఇశ్రాయేలులోని నాయకులందరితో, కుటుంబాల పెద్దలతో మాట్లాడాడు. 3సొలొమోను సమాజమంతా గిబియోనులోని ఉన్నత స్థలానికి వెళ్లారు, ఎందుకంటే యెహోవా సేవకుడైన మోషే అరణ్యంలో ఏర్పాటుచేసిన దేవుని యొక్క సమావేశ గుడారం అక్కడ ఉంది. 4దావీదు దేవుని మందసాన్ని కిర్యత్-యారీము నుండి దాని కోసం సిద్ధపరచిన స్థలానికి తీసుకువచ్చాడు, ఎందుకంటే అతడు యెరూషలేములో దాని కోసం ఒక గుడారాన్ని వేశాడు. 5అయితే హూరు మనుమడు ఊరి కుమారుడైన బెసలేలు చేసిన ఇత్తడి బలిపీఠం గిబియోనులో యెహోవా సమావేశ గుడారం ముందు ఉంది; కాబట్టి సొలొమోను సమాజం అక్కడ అతని గురించి విచారణ చేశారు. 6సొలొమోను సమావేశ గుడారంలో ఉన్న యెహోవా సన్నిధి ఎదుట ఉన్న బలిపీఠం దగ్గరకు వెళ్లి దానిమీద వెయ్యి దహనబలులు అర్పించాడు.
7ఆ రాత్రివేళ దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, “నేను నీకు ఏమివ్వాలో అడుగు” అన్నారు.
8అందుకు సొలొమోను దేవునితో, “మీరు నా తండ్రియైన దావీదు మీద ఎంతో దయను చూపించారు, అంతేకాక ఆయన స్థానంలో నన్ను రాజుగా చేశారు. 9యెహోవా దేవా, నా తండ్రియైన దావీదుకు మీరు చేసిన వాగ్దానాన్ని స్థిరపరచండి. భూమిమీది ధూళియంత విస్తారమైన ప్రజలకు నన్ను రాజుగా చేశారు. 10నేను ఈ ప్రజలను నడిపించడానికి నాకు జ్ఞానాన్ని, వివేచనను ఇవ్వండి. లేకపోతే మీ గొప్ప ప్రజలైన వీరిని ఎవరు పరిపాలించగలరు?”
11దేవుడు సొలొమోనుతో, “ఇది నీ హృదయ కోరిక, నీవు సంపదలు, ఆస్తులు గాని గౌరవాన్ని గాని నీ శత్రువుల మరణాన్ని గాని నీవు కోరలేదు, నీవు సుదీర్ఘ జీవితాన్ని కోరలేదు, కానీ ఏ ప్రజల మీద నిన్ను రాజుగా చేశానో, ఆ నా ప్రజలను పరిపాలించడానికి కావలసిన జ్ఞానం కోరావు, 12కాబట్టి నీకు జ్ఞాన వివేకాలు ఇస్తాను. అంతే కాకుండా నీకు ముందున్న ఏ రాజుకు నీ తర్వాత వచ్చే రాజులకు ఉండనంత సంపదలు, ఆస్తులు, గౌరవాన్ని నేను నీకు ఇస్తాను” అని చెప్పారు.
13తర్వాత సొలొమోను గిబియోనులో ఉన్న సమావేశ గుడారం ముందున్న బలిపీఠం దగ్గర నుండి యెరూషలేముకు వెళ్లి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించాడు.
14సొలొమోను రథాలను, గుర్రాలను సమకూర్చుకున్నాడు. అతనికి 1,400 రథాలు, 12,000 గుర్రాలు#1:14 లేదా రథసారధులు ఉన్నాయి, వీటిని రథాల పట్టణాల్లో యెరూషలేములో తన దగ్గర ఉంచాడు. 15రాజు యెరూషలేములో వెండి బంగారాలను రాళ్లంత విస్తారంగా చేశాడు, దేవదారు మ్రానులను కొండ దిగువ ప్రదేశంలోని మేడిచెట్లలా అతి విస్తారంగా ఉంచాడు. 16సొలొమోను గుర్రాలను ఈజిప్టు నుండి, క్యూ#1:16 బహుశ కిలికియ నుండి దిగుమతి చేసుకున్నారు. రాజ వర్తకులు తగిన ధర చెల్లించి వాటిని క్యూ దగ్గర కొనుగోలు చేశారు. 17వారు ఈజిప్టు నుండి ఒక్కో రథానికి ఆరువందల షెకెళ్ళ#1:17 అంటే, సుమారు 6.9 కి. గ్రా. లు వెండిని ఒక్కో గుర్రానికి నూట యాభై షెకెళ్ళ#1:17 అంటే, సుమారు 1.7 కి. గ్రా. లు వెండిని ఇచ్చి దిగుమతి చేశారు. హిత్తీయుల రాజులందరికి సిరియా రాజులకు వాటిని ఎగుమతి కూడ చేశారు.
Currently Selected:
2 దినవృత్తాంతములు 1: OTSA
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.