YouVersion Logo
Search Icon

2 సమూయేలు 1

1
సౌలు మరణవార్త విన్న దావీదు
1సౌలు మరణించిన తర్వాత, దావీదు అమాలేకీయులను ఓడించి తిరిగివచ్చి సిక్లగులో రెండు రోజులు ఉన్నాడు. 2మూడవ రోజు సౌలు శిబిరం నుండి ఒక వ్యక్తి చిరిగిన బట్టలు వేసుకుని తలమీద దుమ్ముతో వచ్చాడు. అతడు దావీదు దగ్గరకు వచ్చి గౌరవంతో నేలమీద పడి నమస్కారం చేశాడు.
3“ఎక్కడి నుండి వచ్చావు?” అని దావీదు అతన్ని అడిగాడు.
అందుకతడు, “ఇశ్రాయేలు శిబిరం నుండి తప్పించుకుని వచ్చాను” అన్నాడు.
4“ఏ జరిగిందో నాకు చెప్పు” అని దావీదు అడిగాడు.
అప్పుడతడు, “యుద్ధరంగం నుండి సైనికులంతా పారిపోయారు. వారిలో ఎంతోమంది చనిపోయారు. సౌలు, అతని కుమారుడు యోనాతాను కూడా చనిపోయారు” అని సమాధానం ఇచ్చాడు.
5అందుకు దావీదు, “సౌలు, అతని కుమారుడు యోనాతాను కూడా చనిపోయారని నీకెలా తెలుసు?” అని వార్త తెచ్చిన యువకుని అడిగాడు.
6ఆ యువకుడు, “అనుకోకుండ నేను గిల్బోవ పర్వతం మీదికి వెళ్లినప్పుడు అక్కడ సౌలు తన ఈటె మీద అనుకుని ఉన్నాడు, రథాలు దాని రౌతులు అతని తరుముతూ వెనుక వస్తూ ఉన్నారు. 7అతడు వెనుకకు తిరిగినప్పుడు నన్ను చూసి, నన్ను పిలిచాడు. అందుకు నేను, ‘నన్ను ఏమి చేయమంటారు?’ అని అడిగాను.
8“అందుకతడు, ‘నీవెవరు?’ అని అడిగాడు.
“అందుకు నేను, ‘నేను అమాలేకీయుడను’ అని జవాబిచ్చాను.
9“అప్పుడతడు నాతో, ‘నా ప్రాణం పోకుండా మరణవేదనతో నా తల తిరుగుతుంది. నా దగ్గరకు వచ్చి నిలబడి నన్ను చంపెయ్యి’ అన్నాడు.
10“అంతగా గాయపడిన అతడు ఇక బ్రతకడని భావించి నేను అతని ప్రక్కన నిలబడి అతన్ని చంపేశాను. అతని తలమీద ఉన్న కిరీటం, చేతికున్న కంకణం తీసి నా ప్రభువైన మీకు అప్పగిద్దామని తెచ్చాను” అని అన్నాడు.
11ఆ వార్త వినగానే దావీదు అతని మనుష్యులు దుఃఖంతో బట్టలు చింపుకున్నారు. 12సౌలు, అతని కుమారుడు యోనాతాను, యెహోవా సైన్యం ఇశ్రాయేలీయులు యుద్ధంలో ఖడ్గంతో చంపబడ్డారని విని, వారి కోసం సాయంకాలం వరకు దుఃఖిస్తూ ఏడుస్తూ ఉపవాసం ఉన్నారు.
13తనకు వార్త తీసుకువచ్చిన యువకునితో దావీదు, “నీవు ఎక్కడ నుండి వచ్చావు?” అని అడిగాడు.
“నేను విదేశీయుని కుమారుడను, నా తండ్రి అమాలేకీయుడు” అని చెప్పాడు.
14అందుకు దావీదు, “యెహోవా అభిషేకించినవాన్ని చంపడానికి నీకు భయం వేయలేదా?” అని అడిగాడు.
15దావీదు తన మనుష్యుల్లో ఒకని పిలిచి, “వెళ్లి అతన్ని చంపు” అని చెప్పాడు. 16వెంటనే అతడు వాన్ని కొట్టి చంపాడు. ఎందుకంటే దావీదు ఆ యువకునితో, “ ‘నేను యెహోవా అభిషేకించినవాన్ని చంపాను’ అని నీ నోరే నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది కాబట్టి నీ చావుకు నీవే బాధ్యుడవు” అన్నాడు.
సౌలు యోనాతానుల గురించి దావీదు విలపించుట
17సౌలు గురించి అతని కుమారుడైన యోనాతాను గురించి దావీదు ఒక శోకగీతాన్ని వ్రాసి, 18యూదావారందరికి ఆ విల్లు విలాపగీతాన్ని నేర్పించాలని అతడు ఆదేశించాడు. ఇది యాషారు అనగా యథార్థవంతులు అనే గ్రంథంలో వ్రాయబడి ఉంది:
19“ఇశ్రాయేలూ, నీ ఉన్నతస్థలాల మీద నీ వైభవం గలవారు చంపబడ్డారు.
బలవంతులు ఎలా పడిపోయారు కదా!
20“ఫిలిష్తీయుల కుమార్తెలు సంతోషించకూడదు
సున్నతిలేనివారి కుమార్తెలు ఆనందించకూడదు.
కాబట్టి ఈ వార్త గాతులో చెప్పకండి,
అష్కెలోను వీధుల్లో దీనిని ప్రకటించకండి.
21“గిల్బోవ పర్వతాల్లారా,
మీమీద మంచు గాని వర్షం గాని కురవకుండును గాక,
అర్పణల కోసం ధాన్యాన్ని ఇచ్చే పొలాలపై జల్లులు పడకుండును గాక.
ఎందుకంటే అక్కడ బలవంతుల డాలు అవమానపరచబడింది,
ఇకపై సౌలు డాలు నూనెతో పూయబడదు.
22“హతుల రక్తం ఒలికించకుండా,
బలవంతుల శరీరంలో చొచ్చుకుపోకుండా,
యోనాతాను విల్లు వెనుదిరగలేదు,
సౌలు ఖడ్గం అసంతృప్తిగా వెనుదిరగలేదు.
23సౌలు యోనాతానులు
తమ బ్రతుకంతా ప్రేమ కలిగి దయ కలిగినవారిగా ఉన్నారు.
చావులోనూ ఒకరిని ఒకరు విడిచిపెట్టలేదు.
వారు గ్రద్దల కన్నా వేగం గలవారు,
సింహాల కన్నా బలవంతులు.
24“ఇశ్రాయేలు కుమార్తెలారా,
సౌలు గురించి ఏడవండి,
అతడు, మీకు విలాసవంతమైన ఎర్రని వస్ర్తాలు ధరింపచేశాడు,
మీ వస్త్రాలను బంగారు ఆభరణాలతో అలంకరించాడు.
25“యుద్ధరంగంలో బలవంతులు ఎలా పడిపోయారో కదా!
నీ పర్వతాలమీద యోనాతాను హతమైపోయాడు.
26నా సోదరుడా, యోనాతానా! నీకోసం నేనెంతో దుఃఖిస్తున్నాను;
నీవు నాకెంతో ప్రియమైనవాడవు.
నాపై నీకున్న ప్రేమ ఎంతో అద్భుతమైనది,
అది స్త్రీలు చూపించే దానికన్నా అద్భుతమైనది.
27“బలవంతులు ఎలా పడిపోయారు కదా!
యుద్ధ ఆయుధాలు నశించిపోయాయి.”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in