2 సమూయేలు 2
2
యూదాకు రాజుగా అభిషేకించబడిన దావీదు
1కొంతకాలం తర్వాత దావీదు యెహోవా దగ్గర విచారణ చేసి, “యూదా పట్టణాలకు నేను వెళ్ల వచ్చా?” అని అడిగాడు.
అందుకు యెహోవా, “వెళ్లు” అని చెప్పారు.
“ఎక్కడికి వెళ్లాలి?” అని దావీదు అడిగాడు.
అందుకు యెహోవా, “హెబ్రోనుకు వెళ్లు” అని చెప్పారు.
2దావీదు తన ఇద్దరు భార్యలైన యెజ్రెయేలుకు చెందిన అహీనోయము, కర్మెలుకు చెందిన నాబాలు విధవరాలు అబీగయీలును తీసుకుని అక్కడికి వెళ్లాడు. 3దావీదు తనతో ఉన్నవారందరిని వారి వారి కుటుంబాలతో పాటు తనతో తీసుకెళ్లగా వారు హెబ్రోను పట్టణాల్లో స్థిరపడ్డారు. 4యూదా మనుష్యులు హెబ్రోనుకు వచ్చి దావీదును యూదా గోత్రానికి రాజుగా అభిషేకించారు.
సౌలును యాబేషు గిలాదుకు చెందినవారు పాతిపెట్టారని దావీదుకు తెలిసినప్పుడు, 5దావీదు యాబేషు గిలాదు ప్రజల దగ్గరకు దూతను పంపి, “మీ ప్రభువైన సౌలును పాతిపెట్టి అతని పట్ల మీకున్న దయ చూపించారు కాబట్టి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. 6యెహోవా మీకు తన దయను నమ్మకత్వాన్ని చూపించును గాక, మీరు చేసిన ఈ పనిని బట్టి నేను కూడా మీమీద అదే దయను చూపిస్తాను. 7మీ రాజైన సౌలు చనిపోయాడు కాని యూదా ప్రజలు తమపై రాజుగా నన్ను అభిషేకించారు కాబట్టి మీరు దృఢంగా ధైర్యంగా ఉండండి” అని కబురు పంపాడు.
సౌలు, దావీదు కుటుంబాల మధ్య యుద్ధం
8ఆ సమయంలో, నేరు కుమారుడును సౌలు సేనాధిపతియైన అబ్నేరు అనేవాడు సౌలు కుమారుడైన ఇష్-బోషెతును మహనయీముకు తీసుకెళ్లాడు. 9అతన్ని గిలాదు, అషూరీ, యెజ్రెయేలు, ఎఫ్రాయిం బెన్యామీను, ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా చేశాడు.
10సౌలు కుమారుడైన ఇష్-బోషెతు ఇశ్రాయేలుకు రాజైనప్పుడు అతని వయస్సు నలభై సంవత్సరాలు, అతడు రెండు సంవత్సరాలు పరిపాలించాడు. అయితే యూదా ప్రజలు నమ్మకంగా దావీదు పక్షం ఉన్నారు. 11దావీదు హెబ్రోనులో యూదా వారిని రాజుగా పరిపాలించిన కాలం ఏడు సంవత్సరాల ఆరు నెలలు.
12నేరు కుమారుడైన అబ్నేరు, సౌలు కుమారుడైన ఇష్-బోషెతు మనుష్యులతో కలిసి మహనయీములో నుండి బయలుదేరి గిబియోనుకు వెళ్లారు. 13సెరూయా కుమారుడైన యోవాబు, దావీదు మనుష్యులతో కలిసి బయలుదేరి వెళ్లి వారిని గిబియోను కొలను దగ్గర కలుసుకున్నారు. ఒక గుంపు కొలనుకు ఈ ప్రక్కన మరో గుంపు కొలనుకు ఆ ప్రక్కన కూర్చున్నారు.
14అప్పుడు అబ్నేరు యోవాబుతో, “కొంతమంది సైనికులు మన ముందుకు వచ్చి మల్లయుద్ధం చేస్తారు” అని అన్నాడు.
అందుకు యోవాబు, “సరే, చేయనిద్దాం” అన్నాడు.
15సౌలు కుమారుడైన ఇష్-బోషెతుకు చెందిన బెన్యామీనీయులు పన్నెండుమంది, దావీదుకు చెందిన పన్నెండుమంది లేచి నిలబడ్డారు. 16ప్రతి ఒక్కరూ తమ ప్రత్యర్థి తల పట్టుకుని వాని ప్రక్కలో కత్తితో పొడవగా అందరు ఒకేసారి చనిపోయారు. అందుకే ఆ స్థలానికి హెల్కత్ హన్సూరీము#2:16 హెల్కత్ హన్సూరీము అంటే కత్తుల పొలం అని పేరు వచ్చింది. అది గిబియోనులో ఉంది.
17ఆ రోజు భయంకరమైన యుద్ధం జరిగింది. అబ్నేరు, ఇశ్రాయేలీయులు దావీదు సైన్యం ముందు ఓడిపోయారు.
18సెరూయా ముగ్గురు కుమారులైన యోవాబు, అబీషై, అశాహేలు అక్కడే ఉన్నారు. అశాహేలు అడవిలేడిలా చాలా వేగంగా పరుగెత్తగలడు. 19అశాహేలు కుడికైనా ఎడమకైనా తిరగకుండా అబ్నేరును వెంటాడాడు. 20అబ్నేరు వెనుకకు తిరిగి చూసి, “అశాహేలు నువ్వేనా?” అని అడిగాడు.
అందుకు అతడు, “అవును నేనే” అన్నాడు.
21అప్పుడు అబ్నేరు అతనితో, “కుడికైనా ఎడమకైనా తిరిగి యువకులలో ఒకన్ని పట్టుకుని వాని ఆయుధాలను దోచేయ్” అని చెప్పాడు. కాని అశాహేలు అటు ఇటు తిరగకుండా అతన్ని వెంటాడుతూనే ఉన్నాడు.
22మరొకసారి అబ్నేరు అశాహేలును హెచ్చరించి, “నన్నెందుకు వెంటాడుతావు? నేను నిన్ను నేలకు కొట్టి చంపితే నీ సోదరుడైన యోవాబు ముఖాన్ని ఎలా చూడగలను?” అన్నాడు.
23అయినా అశాహేలు ఆగిపోవడానికి ఒప్పుకోలేదు. అప్పుడు అబ్నేరు ఈటె పిడి యొక్క అంచుతో అతన్ని పొట్టలో పొడవడంతో అతని వీపులో నుండి ఈటె బయటకు వచ్చి అక్కడికక్కడే అతడు పడి చనిపోయాడు. అశాహేలు చనిపోయి పడి ఉన్న చోటికి వచ్చిన వారందరూ అక్కడే ఆగిపోయారు.
24కాని యోవాబు, అబీషై ఇద్దరూ కలిసి అబ్నేరును వెంటాడారు. సూర్యాస్తమయం అవుతుండగా వారు గిబియోను అరణ్యమార్గంలోని గియా దగ్గరగా ఉన్న అమ్మహు అనే కొండ దగ్గరకు వచ్చారు. 25అప్పుడు బెన్యామీనీయులు అబ్నేరు వెనుక గుంపుగా ఏర్పడి కొండ శిఖరంపై నిలబడ్డారు.
26అప్పుడు అబ్నేరు బిగ్గరగా, “కత్తి ఎప్పుడూ నాశనం చేస్తూనే ఉండాలా? అది చివరకు ద్వేషంతోనే ముగుస్తుందని నీకు తెలియదా? తోటి ఇశ్రాయేలీయులను తరమడం ఆపమని నీ మనుష్యులకు చెప్పకుండా ఎంతకాలం ఉంటావు?” అని యోవాబుతో అన్నాడు.
27అందుకు యోవాబు, “సజీవుడైన దేవుని పేరిట, నీవు ఈ మాటలు చెప్పకపోతే వీరు తన సోదరులను ఉదయం వరకు తరుముతూనే ఉండేవారు” అన్నాడు.
28అప్పుడు యోవాబు బూర ఊదినప్పుడు, అందరు ఇశ్రాయేలీయులను వెంటాడడం, యుద్ధం చేయడం ఆపివేశారు.
29అబ్నేరు అతని మనుష్యులు ఆ రాత్రంతా అరాబా గుండా ప్రయాణం చేశారు. వారు యొర్దాను నదిని దాటి, ఉదయ కాలంలో ప్రయాణం కొనసాగించి మహనయీముకు చేరుకున్నారు.
30అప్పుడు యోవాబు అబ్నేరును తరమడం ఆపి సైన్యాన్నంతా సమావేశపరిచాడు. అశాహేలు కాకుండా దావీదు మనుష్యుల్లో పందొమ్మిది మంది తగ్గారు. 31అయితే దావీదు సైన్యం అబ్నేరుతో ఉన్న బెన్యామీనీయులలో మూడువందల అరవై మందిని చంపేశారు. 32వారు అశాహేలును తీసుకెళ్లి బేత్లెహేములో ఉన్న అతని తండ్రి సమాధిలో పాతిపెట్టారు. తర్వాత, యోవాబు, అతని మనుష్యులు రాత్రంతా నడిచి తెల్లవారేసరికి హెబ్రోనుకు చేరుకున్నారు.
Currently Selected:
2 సమూయేలు 2: OTSA
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.