YouVersion Logo
Search Icon

2 సమూయేలు 11

11
దావీదు బత్షెబ
1వసంతకాలంలో రాజులు యుద్ధానికి బయలుదేరే కాలంలో, దావీదు యోవాబును తన మనుష్యులతో ఇశ్రాయేలు సైన్యమంతటితో పంపించగా, వారు అమ్మోనీయులను నాశనం చేసి రబ్బా పట్టణాన్ని ముట్టడించారు. కాని దావీదు యెరూషలేములోనే ఉండిపోయాడు.
2ఒక రోజు సాయంత్రం దావీదు పడక మీద నుండి లేచి రాజభవనం పైకప్పు మీద నడుస్తూ, అక్కడినుండి ఒక స్త్రీ స్నానం చేయడం చూశాడు. ఆ స్త్రీ చాలా అందంగా ఉంది. 3ఆమె గురించి వివరాలు తెలుసుకొని రమ్మని దావీదు ఒక వ్యక్తిని పంపించాడు. అతడు వచ్చి, “ఆమె ఎలీయాము కుమార్తెయైన బత్షెబ, హిత్తీయుడైన ఊరియాకు భార్య” అని చెప్పాడు. 4ఆమెను తీసుకురావడానికి దావీదు తన మనుష్యులను పంపించాడు. ఆమె అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఆమెతో పడుకున్నాడు. ఆమె తనకు కలిగిన అపవిత్రతను శుద్ధి చేసుకుని తన ఇంటికి వెళ్లిపోయింది. 5ఆ స్త్రీ గర్భం ధరించగా, “నేను గర్భవతినయ్యాను” అని దావీదుకు కబురు పంపింది.
6అప్పుడు దావీదు, “హిత్తీయుడైన ఊరియాను నా దగ్గరకు పంపించు” అని యోవాబుకు కబురు చేయగా యోవాబు అతన్ని దావీదు దగ్గరకు పంపాడు. 7ఊరియా తన దగ్గరకు వచ్చినప్పుడు దావీదు అతన్ని, యోవాబు ఎలా ఉన్నాడో సైనికులు ఎలా ఉన్నారో యుద్ధం ఎలా జరుగుతుందో అడిగాడు. 8తర్వాత దావీదు ఊరియాతో, “నీవు ఇంటికి వెళ్లి పాదాలు కడుక్కో” అని చెప్పాడు. ఊరియా రాజభవనం నుండి వెళ్లిపోయాడు. అతని వెనుక రాజు అతనికి కానుక పంపించాడు. 9అయితే ఊరియా తన ఇంటికి వెళ్లకుండా తన రాజు సేవకులందరితో కలిసి రాజభవన ద్వారం దగ్గరే నిద్రపోయాడు.
10ఊరియా ఇంటికి వెళ్లలేదని దావీదు విని ఊరియాను పిలిచి, “నీవు చాలా కాలం తర్వాత తిరిగి వచ్చావు కదా! ఇంటికి ఎందుకు వెళ్లలేదు?” అని అడిగాడు.
11అందుకు ఊరియా దావీదుతో, “మందసం, ఇశ్రాయేలీయులు, యూదా వారు గుడారాల్లోనే#11:11 లేదా సుక్కోతు దగ్గర ఉంటున్నారు. నా దళాధిపతియైన యోవాబు, నా ప్రభువు యొక్క సైనికులు పొలిమేరల్లో ఉన్నారు. అలాంటప్పుడు నేను ఇంటికి వెళ్లి తిని త్రాగి, నా భార్యతో ఎలా సంతోషించగలను? నీ జీవం తోడు, నేను అలా చేయను” అన్నాడు.
12అందుకు దావీదు, “సరే, ఈ రోజు కూడా ఇక్కడే ఉండు. రేపు నేను నిన్ను వెనుకకు పంపిస్తాను” అని ఊరియాతో చెప్పాడు. కాబట్టి ఊరియా ఆ రోజు, మరుసటిరోజు యెరూషలేములోనే ఉండిపోయాడు. 13దావీదు అతన్ని పిలిపించి, అతనితో కలిసి తిని త్రాగి అతనికి బాగా మత్తెక్కేలా త్రాగించాడు. అయినా సాయంకాలం అతడు ఇంటికి వెళ్లకుండా తన రాజు సేవకుల మధ్యలో తన పడక మీద పడుకున్నాడు.
14ఉదయానే దావీదు యోవాబుకు ఉత్తరం వ్రాసి ఊరియా చేత పంపించాడు. 15ఆ ఉత్తరంలో అతడు, “యుద్ధం తీవ్రంగా జరుగుతున్న చోట ఊరియాను ముందు పెట్టు. అతడు దెబ్బతిని చనిపోయేలా చేసి నీవు అక్కడినుండి వెళ్లిపో” అని వ్రాశాడు.
16యోవాబు పట్టణాన్ని ముట్టడిస్తుండగా బలమైన శత్రుసైనికులు ఉన్న చోటికి అతడు ఊరియాను పంపాడు. 17ఆ పట్టణస్థులు బయటకు వచ్చి యోవాబుతో యుద్ధం చేసినప్పుడు దావీదు సైనికుల్లో కొంతమంది చనిపోయారు. హిత్తీయుడైన ఊరియా కూడా చనిపోయాడు.
18యోవాబు యుద్ధ సమాచారమంతా దావీదుకు పంపించాడు. 19అతడు ఆ దూతకు ఇచ్చిన ఆదేశమేమిటంటే, “నీవు రాజుకు యుద్ధ సమాచారమంతా చెప్పిన తర్వాత, 20రాజు కోపం తెచ్చుకుని, ‘యుద్ధం చేయడానికి పట్టణానికి అంత దగ్గరగా మీరెందుకు వెళ్లారు? వారు గోడ పైనుండి బాణాలు వేస్తారని మీకు తెలియదా? 21యెరుబ్-బెషెతు#11:21 యెరుబ్-బయలు (అంటే, గిద్యోను) అని పిలిచేవారు కుమారుడైన అబీమెలెకును ఎవరు చంపారు? ఒక స్త్రీ గోడ పైనుండి అతనిపై తిరగలి రాయి వేసినందుకు అతడు తేబేసు దగ్గర చనిపోయాడు గదా? మీరు గోడ దగ్గరకు ఎందుకు వెళ్లారు?’ అని అడిగితే నీవు, ‘మీ సేవకుడూ హిత్తీయుడైన ఊరియా కూడా చనిపోయాడు’ అని చెప్పు” అన్నాడు.
22ఆ దూత వెళ్లి యోవాబు పంపించిన సమాచారమంతా దావీదుకు చెప్పాడు. 23ఆ దూత దావీదుతో, “ఆ మనుష్యులు మమ్మల్ని తరుముతూ పొలంలో మాపై దాడి చేశారు, కాని మేము వారిని పట్టణపు ద్వారం వరకు తరిమి కొట్టాము. 24అప్పుడు గోడ పైనుండి విలుకాండ్రు మీ సేవకులపై బాణాలు వేయడంతో రాజు సైనికుల్లో కొంతమంది చనిపోయారు. మీ సేవకుడూ హిత్తీయుడైన ఊరియా కూడా చనిపోయాడు” అన్నాడు.
25దావీదు ఆ దూతతో, “నీవు యోవాబుతో ఇలా చెప్పు: ‘జరిగినదాన్ని బట్టి నీవు కంగారుపడకు; ఖడ్గం ఒకసారి ఒకరిని మరోసారి ఇంకొకరిని చంపుతుంది. ఆ పట్టణం మీద మీరు ముమ్మరంగా దాడిచేసి దానిని నాశనం చేయండి’ అని చెప్పి యోవాబును ధైర్యపరచు” అన్నాడు.
26తన భర్త చనిపోయిన సంగతి విని ఊరియా భార్య అతని కోసం దుఃఖించింది. 27దుఃఖ సమయం ముగిసిన తర్వాత దావీదు ఆమెను తన రాజభవనానికి రప్పించుకున్నాడు. ఆమె అతనికి భార్యయై ఒక కుమారుని కన్నది. అయితే దావీదు చేసిన పని యెహోవా దృష్టికి అసహ్యమైనది.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in