YouVersion Logo
Search Icon

2 సమూయేలు 12

12
నాతాను దావీదును గద్దించుట
1కాబట్టి యెహోవా నాతానును దావీదు దగ్గరకు పంపించారు. అతడు దావీదు దగ్గరకు వచ్చి అతనితో, “ఒక ఊరిలో ఇద్దరు మనుష్యులు ఉన్నారు. ఒకడు ధనవంతుడు మరొకడు పేదవాడు. 2ధనవంతునికి పెద్ద సంఖ్యలో గొర్రెలు, పశువులు ఉన్నాయి. 3అయితే పేదవానికి తాను కొనుక్కున్న చిన్న ఆడ గొర్రెపిల్ల మాత్రమే ఉంది. అతడు దాన్ని పెంచుకున్నాడు. అది అతని దగ్గర అతని పిల్లల దగ్గర పెరుగుతూ, అతని చేతి ముద్దలు తింటూ, అతని గిన్నెలోనిది త్రాగుతూ అతని చేతుల మీద పడుకునేది. అది అతనికి కుమార్తెలా ఉండేది.
4“ఒక రోజు ఒక బాటసారి ధనవంతుని దగ్గరకు వచ్చాడు. తన దగ్గరకు వచ్చిన ఆ బాటసారికి విందు చేయడానికి తన గొర్రెలను పశువులను ఉపయోగించడానికి అతడు ఇష్టపడలేదు. దానికి బదులు అతడు ఆ పేదవాని ఆడ గొర్రెను తీసుకుని తన దగ్గరకు వచ్చిన వానికి విందు చేశాడు” అని చెప్పాడు.
5అది విని దావీదు ఆ ధనవంతునిపై తీవ్ర కోపం తెచ్చుకుని నాతానుతో, “సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న; ఆ పని చేసినవాడు తప్పనిసరిగా చావాలి! 6వాడు జాలి లేకుండ అలాంటి పని చేసినందుకు వాడు ఆ గొర్రెపిల్లకు బదులుగా నాలుగు గొర్రెపిల్లలు ఇవ్వాలి” అన్నాడు.
7అప్పుడు నాతాను దావీదుతో, “ఆ మనిషివి నీవే! ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నారు: ‘నేను నిన్ను ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించాను. సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించాను. 8నీ యజమాని ఇంటిని నీకు అప్పగించాను, అతని భార్యలను నీ కౌగిటిలోనికి చేర్చాను. ఇశ్రాయేలు, యూదా రాజ్యాలను నీకు అప్పగించాను. ఇవన్నీ చాలవని నీవు అనుకుంటే నేను నీకు మరిన్ని ఇచ్చి ఉండేవాన్ని. 9యెహోవా దృష్టికి చెడ్డదైన పనిని చేసి ఆయన మాటను ఎందుకు తృణీకరించావు? హిత్తీయుడైన ఊరియాను ఖడ్గంతో చనిపోయేలా చేసి అతని భార్యను నీ సొంతం చేసుకున్నావు. అమ్మోనీయుల ఖడ్గంతో అతడు చనిపోయేలా చేశావు. 10నీవు నన్ను నిర్లక్ష్యం చేసి హిత్తీయుడైన ఊరియా భార్యను నీ సొంతం చేసుకున్నావు కాబట్టి నీ కుటుంబాన్ని ఖడ్గం ఎన్నడూ విడిచిపెట్టదు.’
11“యెహోవా చెప్పిన మాట ఇదే: ‘నీ సొంత కుటుంబంలో నుండే నేను నీమీదికి గొప్ప ఆపద రప్పిస్తాను. నీవు చూస్తూ ఉండగానే నేను నీ భార్యలను నీకు సన్నిహితులైన వారికి అప్పగిస్తాను. పట్టపగలే అతడు నీ భార్యలతో పడుకుంటాడు. 12నీవు రహస్యంగా చేశావు గాని, నేనైతే దీన్ని పట్టపగలు ఇశ్రాయేలీయులందరి ముందే జరిగేలా చేస్తాను’ ” అని చెప్పాడు.
13అప్పుడు దావీదు నాతానుతో, “నేను యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశాను” అన్నాడు.
అందుకు నాతాను, “యెహోవా నీ పాపాన్ని తొలగించారు. నీవు చావవు. 14కానీ నీవు ఇలా చేయడం వల్ల యెహోవాను పూర్తిగా ధిక్కరించావు కాబట్టి, నీకు పుట్టిన కుమారుడు చనిపోతాడు” అని చెప్పాడు.
15తర్వాత నాతాను తన ఇంటికి వెళ్లిపోయాడు, యెహోవా ఊరియా భార్య ద్వార దావీదుకు పుట్టిన బిడ్డను మొత్తగా ఆ బిడ్డకు జబ్బుచేసింది. 16దావీదు బిడ్డ కోసం దేవున్ని వేడుకున్నాడు. అతడు ఉపవాసం ఉండి రాత్రులు గోనెపట్టలో#12:16 కొ.ప్రా.ప్ర.లలో గోనెపట్ట అని వ్రాయబడలేదు నేలపై పడుకున్నాడు. 17అతని ఇంట్లోని పెద్దలు అతని ప్రక్కన నిలబడి నేలపై నుండి అతన్ని లేపడానికి ప్రయత్నించారు కాని అతడు ఒప్పుకోలేదు, వారితో కలిసి భోజనం చేయలేదు.
18ఏడవ రోజు ఆ బిడ్డ చనిపోయాడు. దావీదు సలహాదారులు, “బిడ్డ బ్రతికి ఉన్నప్పుడే అతడు మనం చెప్పిన ఏ మాట వినలేదు. బిడ్డ చనిపోయిన విషయం అతనికి ఎలా చెప్పగలం? చెప్తే తనకు తాను ఏదైనా హాని చేసుకుంటాడేమో” అనుకుని బిడ్డ చనిపోయిన విషయం అతనికి చెప్పడానికి భయపడ్డారు.
19తన సలహాదారులు తమలో తాము గుసగుసలాడుకోవడం దావీదు చూసి, బిడ్డ చనిపోయాడని గ్రహించి, “బిడ్డ చనిపోయాడా?” అని అడిగాడు.
వారు, “అవును చనిపోయాడు” అని జవాబిచ్చారు.
20వెంటనే దావీదు నేలపై నుండి లేచి స్నానం చేసి నూనె రాసుకుని బట్టలు మార్చుకుని యెహోవా మందిరంలోనికి వెళ్లి ఆరాధించాడు. తర్వాత అతడు తన ఇంటికి తిరిగివచ్చి భోజనం తెమ్మని చెప్పాడు. వారు భోజనం వడ్డించగానే అతడు తిన్నాడు.
21అతని సలహాదారులు, “బిడ్డ ప్రాణాలతో ఉన్నప్పుడు మీరు ఉపవాసముండి ఏడ్చారు. కాని ఇప్పుడేమో ఆ బిడ్డ చనిపోయాక లేచి భోజనం చేస్తున్నారు. మీరు ఎందుకిలా చేస్తున్నారు?” అని అతన్ని అడిగారు.
22అందుకతడు, “బిడ్డ ప్రాణాలతో ఉన్నప్పుడు ‘ఒకవేళ యెహోవా నా మీద జాలి చూపించి బ్రతకనిస్తాడేమో’ అనుకుని ఉపవాసముండి ఏడ్చాను. 23ఇప్పుడు ఆ బిడ్డ చనిపోయాడు. నేనెందుకు ఉపవాసముండాలి? నేను అతన్ని మళ్ళీ బ్రతికించగలనా? నేనే వాని దగ్గరకు వెళ్లాలి తప్ప, వాడు నా దగ్గరకు తిరిగి రాడు కదా!” అని జవాబిచ్చాడు.
24తర్వాత దావీదు తన భార్యయైన బత్షెబను ఓదార్చాడు. అతడు ఆమెతో కలువగా ఆమె కుమారుని కన్నది. దావీదు వానికి సొలొమోను అని పేరు పెట్టాడు. యెహోవా అతన్ని ప్రేమించారు; 25యెహోవా అతన్ని ప్రేమించారు కాబట్టి అతనికి యెదీద్యా#12:25 అంటే యెహోవా ప్రేమించినవాడు అని అర్థం అని పేరు పెట్టమని నాతాను ప్రవక్త ద్వారా కబురు పంపారు.
26ఇంతలో యోవాబు అమ్మోనీయుల పట్టణమైన రబ్బామీద యుద్ధం చేసి రాజభవనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. 27యోవాబు దూతల ద్వార ఈ వార్త దావీదుకు పంపిస్తూ, “నేను రబ్బామీద యుద్ధం చేసి ఆ పట్టణపు నీళ్ల సరఫరాను స్వాధీనం చేసుకున్నాను. 28ఇప్పుడు నీవు మిగిలిన సైన్యాన్ని పంపి పట్టణాన్ని ముట్టడించి దానిని స్వాధీనం చేసుకో. లేకపోతే నేను ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటాను అప్పుడు దానికి నా పేరు పెట్టబడుతుంది” అని కబురు పంపాడు.
29కాబట్టి దావీదు సైన్యాన్నంతా తీసుకుని రబ్బాకు వెళ్లి దానిపై దాడిచేసి దానిని స్వాధీనం చేసుకున్నాడు. 30దావీదు వారి రాజు తలమీద నుండి కిరీటాన్ని తీసి తన తలమీద పెట్టుకున్నాడు. అది ఒక తలాంతు బరువు కలిగి ఉండి, ప్రశస్తమైన రాళ్లతో పొదిగించబడి ఉంది. దావీదు ఆ పట్టణం నుండి పెద్ద మొత్తంలో దోపుడుసొమ్ము తీసుకెళ్లాడు. 31అక్కడి ప్రజలను బయటకు తీసుకువచ్చి రంపతో, పదునైన ఇనుప పనిముట్లతో, గొడ్డళ్ళతో కఠినమైన పని చేయించాడు. ఇటుక బట్టీలలో వారితో పని చేయించాడు. దావీదు అమ్మోనీయుల పట్టణాలన్నిటికి ఈ విధంగా చేశాడు. తర్వాత అతడు అతని సైన్యమంతా యెరూషలేముకు తిరిగి వచ్చారు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in