2 సమూయేలు 13
13
అమ్నోను తామారు
1దావీదు కుమారుడైన అబ్షాలోముకు తామారు అనే అందమైన చెల్లి ఉండగా దావీదు కుమారుడైన అమ్నోను తామారును గాఢంగా ప్రేమించాడు.
2అమ్నోనుకు తన చెల్లి తామారుపై ఉన్న వ్యామోహంతో అతడు అనారోగ్యం పాలయ్యాడు. ఆమె కన్య కాబట్టి ఆమెను ఏమైన చేయడం సాధ్యం కాదని అతనికి అనిపించింది.
3అమ్నోనుకు యెహోనాదాబు అనే ఒక సలహాదారుడు ఉన్నాడు. అతడు దావీదు అన్న షిమ్యా కుమారుడు. యెహోనాదాబు చాలా యుక్తిపరుడు. 4అతడు అమ్నోనును చూసి, “రాజకుమారుడవైన నీవు రోజు రోజుకు ఎందుకు చిక్కిపోతున్నావు? విషయమేంటో నాకు చెప్పవా?” అని అడిగాడు.
అమ్నోను అతనితో, “నేను నా సోదరుడైన అబ్షాలోము చెల్లి తామారును ప్రేమిస్తున్నాను” అన్నాడు.
5అందుకు యెహోనాదాబు, “నీకు అనారోగ్యంగా ఉన్నట్లు నటిస్తూ మంచం మీద పడుకో. నీ తండ్రి నిన్ను చూడడానికి వచ్చినప్పుడు, ‘నా చెల్లి తామారు వచ్చి నాకు తినడానికి ఏదైనా ఇస్తే బాగుండేది. నా కళ్లముందు ఆమె భోజనం సిద్ధం చేసి, తన చేతితో నాకు తినిపించనివ్వండి’ అని నీ తండ్రితో చెప్పు” అన్నాడు.
6కాబట్టి తనకు అనారోగ్యంగా ఉన్నట్లు నటిస్తూ అమ్నోను పడుకున్నాడు. రాజు అతన్ని చూడడానికి వచ్చినప్పుడు అమ్నోను, “నేను నా చెల్లి తామారు చేతితో తినేలా ఆమె వచ్చి నేను చూస్తుండగా నా కోసం ప్రత్యేకంగా రెండు రొట్టెలు చేయమని చెప్పండి” అని అడిగాడు.
7కాబట్టి దావీదు తామారుకు, “నీ అన్న అమ్నోను ఇంటికి వెళ్లి, అతని కోసం భోజనం సిద్ధం చేయి” అని ఇంట్లో ఉన్న తామారుకు కబురు పంపాడు. 8తామారు తన అన్న అమ్నోను ఇంటికి వెళ్లింది. అతడు ఇంకా పడుకునే ఉన్నాడు. ఆమె కొంత పిండి తీసుకుని కలిపి అతడు చూస్తుండగా రొట్టెలు చేసి కాల్చింది. 9ఆమె ఆ రొట్టెలు వడ్డిస్తూ ఉంటే అతడు తినడానికి ఒప్పుకోలేదు.
అమ్నోను, “అందరు బయటకు వెళ్లండి” అని చెప్పగానే అక్కడున్న వారందరు బయటకు వెళ్లిపోయారు. 10అప్పుడు అమ్నోను తామారుతో, “భోజనం నా పడకగదిలోనికి తెచ్చి నీ చేతితో తినిపించు” అన్నాడు. తామారు తాను తయారుచేసిన రొట్టెలు తీసుకుని పడకగదిలో ఉన్న తన అన్న అమ్నోను దగ్గరకు వచ్చింది. 11ఆమె అతనికి తినడానికి భోజనం తీసుకువచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకుని, “నా చెల్లి, వచ్చి నాతో పడుకో” అన్నాడు.
12ఆమె, “అన్నా, వద్దు నన్ను బలవంతం చేయవద్దు! ఇశ్రాయేలులో ఇలాంటిది చేయకూడదు! ఈ దుర్మార్గపు పని చేయవద్దు. 13నేను ఏమైపోతాను? ఈ అవమానాన్ని నేను ఎలా భరించగలను? ఇశ్రాయేలీయులలో నీవు ఒక దుర్మార్గుడివి అవుతావు. రాజుతో మాట్లాడు. ఆయన నీకు నాతో పెళ్ళి చేయకుండా ఉండడు” అని చెప్పింది. 14కాని అతడు ఆమె మాట వినకుండా ఆమెను బలవంతంగా లొంగదీసుకుని అత్యాచారం చేశాడు.
15తర్వాత అమ్నోనుకు ఆమె పట్ల విపరీతమైన ద్వేషం కలిగింది. ఇంతకుముందు ఆమెను ఎంత ప్రేమించాడో దానికన్నా ఎక్కువగా అతడు ఆమెను ద్వేషించాడు. అమ్నోను ఆమెతో, “లేచి వెళ్లిపో!” అన్నాడు.
16అందుకు ఆమె, “వద్దు, నీవు నన్ను బయటకు త్రోసివేస్తే అది నీవు నాకిప్పుడు చేసిన దానికన్నా పెద్ద తప్పు అవుతుంది” అని అన్నది.
కాని అతడు ఆమె మాట వినలేదు. 17అతడు తన వ్యక్తిగత సేవకుని పిలిచి, “ఈమెను నా దగ్గర నుండి వెళ్లగొట్టి, తలుపు గడియ వేయి” అని ఆజ్ఞాపించాడు. 18ఆ సేవకుడు ఆమెను బయటకు గెంటి తలుపు గడియ వేశాడు. కన్యలైన రాజకుమార్తెలు ధరించే ఒక అందమైన వస్త్రాన్ని తామారు ధరించి ఉంది. 19తామారు తన తలపై బూడిద వేసుకుని తాను వేసుకున్న వస్త్రాన్ని చింపుకుని తలమీద చేతులు పెట్టుకుని గట్టిగా ఏడుస్తూ వెళ్లిపోయింది.
20ఆమె అన్న అబ్షాలోము ఆమెను చూసి, “నీ అన్న అమ్నోను కదా నీతో ఉన్నది? నా చెల్లీ, నెమ్మదిగా ఉండు; అతడు నీ అన్న. బాధపడకు” అన్నాడు. తామారు తన అన్న అబ్షాలోము ఇంట్లో ఒంటరిగానే ఉండిపోయింది.
21ఇదంతా రాజైన దావీదు విన్నప్పుడు అతడు చాలా కోపంతో మండిపడ్డాడు. 22అబ్షాలోము తన అన్న అమ్నోనుతో మంచి గాని చెడు గాని ఏమి మాట్లాడలేదు; తన చెల్లియైన తామారును అవమానపరిచాడు కాబట్టి అతడు అమ్నోనును ద్వేషించాడు.
అబ్షాలోము అమ్నోనును చంపుట
23రెండు సంవత్సరాల తర్వాత, అబ్షాలోము యొక్క గొర్రెల బొచ్చు కత్తిరించేవారు ఎఫ్రాయిం సరిహద్దు దగ్గర ఉన్న బయల్-హసోరులో ఉన్నప్పుడు, అతడు రాజకుమారులందరినీ అక్కడికి విందుకు పిలిచాడు. 24అబ్షాలోము రాజు దగ్గరకు వచ్చి, “మీ సేవకుని యొక్క గొర్రెల బొచ్చు కత్తిరించే సమయం వచ్చింది. రాజు రాజ సేవకులు నాతో పాటు వస్తారా?” అన్నాడు.
25“లేదు, నా కుమారుడా, మేమందరం రావద్దు; మేము నీకు ఎక్కువ భారం అవుతాం” అని రాజు అన్నాడు. అబ్షాలోము రాజును బ్రతిమాలినా అతడు వెళ్లడానికి నిరాకరించి అతన్ని దీవించాడు.
26అప్పుడు అబ్షాలోము, “నీవు రాకపోతే నా అన్నయైన అమ్నోనును మాతో పంపించు” అన్నాడు.
అందుకు రాజు, “అతడు మీతో ఎందుకు వెళ్లాలి?” అని అడిగాడు. 27అయితే అబ్షాలోము అతన్ని చాలా బ్రతిమిలాడాడు, కాబట్టి రాజు అమ్నోనును, మిగిలిన రాజకుమారులను అతనితో పంపాడు.
28తర్వాత అబ్షాలోము తన సేవకులను పిలిచి, “వినండి, అమ్నోను బాగా త్రాగి మత్తు ఎక్కినప్పుడు నేను మీతో, ‘అమ్నోనును కొట్టి చంపండి’ అని చెప్తాను. అప్పుడు మీరు అతన్ని చంపండి. భయపడకండి! మీకు ఆజ్ఞ ఇచ్చింది నేను కాదా? కాబట్టి ధైర్యంగా ఉండండి” అని ఆదేశించాడు. 29అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే అతని సేవకులు అమ్నోనును చంపేశారు. అప్పుడు రాజకుమారులంతా లేచి తమ కంచరగాడిదల మీద ఎక్కి పారిపోయారు.
30వారు ఇంకా దారిలో ఉండగానే, “అబ్షాలోము రాజకుమారుల్లో ఒక్కరు మిగులకుండా అందరిని చంపేశాడు” అనే వార్త దావీదుకు చేరింది. 31రాజు లేచి నిలబడి తన బట్టలు చింపుకుని నేల మీద పడుకున్నాడు. అతని సేవకులందరు తమ బట్టలు చింపుకుని దగ్గర నిలబడ్డారు.
32కానీ దావీదు అన్న షిమ్యా కుమారుడైన యెహోనాదాబు, “నా ప్రభువా, వారు రాజకుమారులందరినీ చంపేశారని అనుకోవద్దు; అమ్నోను మాత్రమే చనిపోయాడు. అతడు అబ్షాలోము చెల్లి తామారును అత్యాచారం చేసిన రోజు నుండే అతన్ని చంపాలనే పగతో అబ్షాలోము ఉన్నాడని అతని మాటలు చెప్తున్నాయి. 33కాబట్టి రాజకుమారులందరూ చనిపోయారని భావించి నా ప్రభువైన రాజు బాధపడవద్దు. అమ్నోను మాత్రమే చనిపోయాడు” అని చెప్పాడు.
34ఈలోగా, అబ్షాలోము పారిపోయాడు.
కాపలాగా నిలబడి ఉన్న వ్యక్తి పైకి చూసేటప్పటికి అతనికి పశ్చిమాన ఉన్న రహదారిపై చాలామంది ప్రజలు కొండ వైపుకు రావడం కనిపించింది. కావలివాడు వెళ్లి రాజుతో, “హొరొనయీము దిశలో, కొండ వైపున మనుష్యులు కనబడుతున్నారు” అని చెప్పాడు.
35యెహోనాదాబు, “అదిగో రాజకుమారులు వస్తున్నారు; మీ సేవకుడనైన నేను చెప్పినట్టే జరిగింది” అని రాజుతో చెప్పాడు.
36అతడు చెప్పడం ముగిస్తూ ఉండగానే, రాజకుమారులు వచ్చి గట్టిగా ఏడ్వడం మొదలుపెట్టారు. అది చూసి రాజు అతని సేవకులందరూ చాలా బిగ్గరగా ఏడ్చారు.
37అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడు, గెషూరు రాజైన తల్మయి దగ్గరకు చేరాడు. రాజైన దావీదు చాలా రోజుల వరకు తన కుమారుని కోసం దుఃఖిస్తూనే ఉన్నాడు.
38అబ్షాలోము పారిపోయి గెషూరుకు వెళ్లి అక్కడ మూడు సంవత్సరాలు ఉన్నాడు. 39అమ్నోను మరణం విషయంలో ఓదార్పు పొందిన రాజైన దావీదు, అబ్షాలోము దగ్గరకు వెళ్లాలని కోరాడు.
Currently Selected:
2 సమూయేలు 13: OTSA
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.