YouVersion Logo
Search Icon

2 సమూయేలు 14

14
యెరూషలేముకు తిరిగివచ్చిన అబ్షాలోము
1రాజు అబ్షాలోము మీద మనస్సు పెట్టుకున్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించాడు. 2కాబట్టి యోవాబు తెకోవాకు ఒకరిని పంపించి అక్కడినుండి ఒక తెలివైన స్త్రీని తెప్పించాడు. అతడు ఆమెతో, “నీవు దుఃఖంలో ఉన్నట్లు నటించు, దుఃఖ వస్త్రాలను ధరించు, ఎలాంటి సౌందర్య అలంకరణలను ఉపయోగించవద్దు. చనిపోయినవారి కోసం దుఃఖిస్తూ చాలా రోజులు గడిపిన స్త్రీలా నటించు. 3రాజు దగ్గరకు వెళ్లి అతనితో ఈ మాటలు చెప్పు” అని చెప్పి ఏమి మాట్లాడాలో యోవాబు ఆమెకు నేర్పాడు.
4ఆ తెకోవా స్త్రీ రాజు దగ్గరకు వెళ్లి తన తల నేలకు ఆనించి నమస్కారం చేసి, “ఓ రాజా! నాకు సహాయం చేయండి!” అని వేడుకొంది.
5“నీకు వచ్చిన కష్టం ఏంటి?” అని రాజు ఆమెను అడిగాడు.
అందుకామె, “నేను విధవరాలిని; నా భర్త చనిపోయాడు. 6నీ సేవకురాలినైన నాకు ఇద్దరు కుమారులు. వారు పొలంలో ఒకరితో ఒకరు పోట్లాడుకున్నారు. వారిని వేరు చేయడానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో ఒకడు ఇంకొకడిని కొట్టి చంపేశాడు. 7ఇప్పుడు నా కుటుంబమంతా నీ సేవకురాలినైన నా మీదికి లేచి, ‘తన సోదరుని కొట్టి చంపినవాన్ని మాకు అప్పగించు. వాడు తన సోదరుని చంపాడు కాబట్టి మేము వాన్ని చంపాలి: అప్పుడు వారసుడే లేకుండ పోతాడు’ అని వారు అంటున్నారు. వారు నా భర్త పేరును గాని వారసులను గాని భూమి మీద మిగలకుండా, నా దగ్గర మిగిలి ఉన్న ఏకైక మండే బొగ్గును చల్లార్చాలని చూస్తున్నారు” అని చెప్పింది.
8అందుకు రాజు, “నీవు ఇంటికి వెళ్లు, నీ గురించి నేను ఆజ్ఞ ఇస్తాను” అని ఆమెతో చెప్పాడు.
9అప్పుడు తెకోవా స్త్రీ, “నా ప్రభువైన రాజు నన్ను నా కుటుంబాన్ని క్షమించును గాక, రాజు, వారి సింహాసనం నిర్దోషంగా ఉండును గాక” అని రాజుతో చెప్పింది.
10అందుకు రాజు, “ఎవరైనా దీని గురించి నిన్ను ఏమైనా అంటే వారిని నా దగ్గరకు తీసుకురా, వారు మరలా నిన్ను ఇబ్బంది పెట్టరు” అన్నాడు.
11ఆమె, “అయితే, రక్తానికి ప్రతీకారం తీర్చుకునేవాడు ఇంకెక్కువ నాశనం చేయకుండా నిరోధించడానికి రాజు తన దేవున్ని ప్రార్థించాలి, తద్వార నా కుమారుడు నాశనానికి గురి కాకుండా ఉంటాడు” అని చెప్పింది.
అందుకు రాజు, “సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నీ కుమారుని తలవెంట్రుకలలో ఒకటి కూడా నేల రాలదు” అన్నాడు.
12అప్పుడు ఆమె, “నా ప్రభువైన రాజుతో మీ సేవకురాలినైన నన్ను ఒక మాట చెప్పనివ్వండి” అన్నాడు.
అప్పుడు రాజు, “చెప్పు” అన్నాడు.
13ఆ స్త్రీ ఇలా చెప్పింది, “మీరు దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఇలాంటి పని ఎందుకు చేశారు? రాజు ఇలా చెప్పినప్పుడు, బహిష్కరించబడిన తన కుమారున్ని రాజు తిరిగి తీసుకురాలేదు కాబట్టి తాను దోషి కావడం లేదా? 14మనమందరం చనిపోతాం గదా. ఒకసారి నేల మీద ఒలికిన తర్వాత మరలా ఎత్తలేని నీళ్లలా ఉన్నాము. అయితే దేవుడు కోరుకునేది ఇది కాదు; వెలివేయబడినవారు తన దగ్గరకు తిరిగి రావడానికి ఆయన మార్గాలు ఏర్పరుస్తారు.
15“నా ప్రజలు నన్ను భయపెట్టారు కాబట్టి నేను నా ప్రభువైన రాజుకు దీని గురించి చెప్పడానికి వచ్చాను. నీ సేవకురాలు ఏమనుకుందంటే, ‘నేను రాజుతో మాట్లాడతాను. ఆయన తన సేవకురాలి మనవిని వింటారు. 16రాజు నా మనవి అంగీకరించి, దేవుడిచ్చిన వారసత్వాన్ని నేను, నా ఇద్దరు కుమారులు అనుభవించకుండ మమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నించేవారి చేతిలో నుండి నన్ను విడిపించడానికి ఒప్పుకుంటాడు.’
17“నీ సేవకురాలినైన నేను చెప్పేది ఏంటంటే, ‘మంచి చెడులను విచారించడంలో నా ప్రభువైన రాజు దేవుని దూతవంటివాడు కాబట్టి నా ప్రభువైన రాజు మాట నా వారసత్వాన్ని కాపాడును గాక. నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును గాక’ ” అని చెప్పింది.
18అప్పుడు రాజు ఆమెతో, “నేను నిన్ను ఒక విషయం అడుగుతాను. ఏదీ దాచకుండా చెప్పాలి” అన్నాడు.
అందుకు ఆమె, “నా ప్రభువైన రాజా ఏమిటో అడగండి” అన్నది.
19రాజు, “దీనంతటి వెనకాల యోవాబు హస్తమేమైన ఉందా?” అని అడిగాడు.
అప్పుడు ఆమె, “నా ప్రభువైన రాజు జీవం తోడు, నా ప్రభువైన రాజు చెప్పినదాని నుండి ఎవరూ కుడికి గాని ఎడమకు గాని తిరుగరు. నిజమే, ఇలా చేయమని నీ సేవకుడైన యోవాబు నాకు చెప్పాడు. నేను చెప్పిన మాటలన్నీ అతడు చెప్పినవే. 20ప్రస్తుత పరిస్థితులను మార్చడానికి మీ సేవకుడైన యోవాబు ఇలా చేశాడు. దేశంలో జరుగుతున్నదంతా తెలుసుకోవడానికి నా ప్రభువుకు దేవుని దూతవంటి జ్ఞానం ఉన్నది” అన్నది.
21అప్పుడు రాజు యోవాబుతో, “సరే, నీ విన్నపం ప్రకారం నేను చేస్తాను. నీవు వెళ్లి, యువకుడైన అబ్షాలోమును తీసుకురా” అన్నాడు.
22యోవాబు తన తల నేలకు ఆనించి నమస్కారం చేసి రాజును దీవిస్తూ ఇలా అన్నాడు, “నా ప్రభువైన రాజా! నీవు నీ సేవకుడైన నా మనవి అంగీకరించావు కాబట్టి నా ప్రభువైన రాజు దృష్టిలో నీ సేవకుడనైన నేను దయ పొందానని ఈ రోజు నాకు తెలిసింది.”
23అప్పుడు యోవాబు గెషూరు వెళ్లి అబ్షాలోమును యెరూషలేముకు తీసుకువచ్చాడు. 24అయితే రాజు, “అతడు తన ఇంటికి వెళ్లాలి; అతడు నా ముఖాన్ని చూడకూడదు” అన్నాడు కాబట్టి అబ్షాలోము రాజు ముఖాన్ని చూడకుండ తన సొంత ఇంటికి వెళ్లాడు.
25ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోము వంటి అందమైనవారు ఇంకెవరు లేరు. అరికాలు నుండి నడినెత్తి వరకు అతనిలో ఏ లోపం లేదు. 26అతని తలవెంట్రుకలు చాలా భారంగా ఉండడంతో సంవత్సరానికి ఒకసారి తన తలవెంట్రుకలు కత్తిరించేవాడు. వాటి తూకం రాజు ఆమోదించిన తూనిక ప్రకారం రెండువందల షెకెళ్ళు#14:26 అంటే, సుమారు 2.3 కి. గ్రా. లు ఉండేది.
27అబ్షాలోముకు ముగ్గురు కుమారులు ఒక కుమార్తె పుట్టారు. అతని కుమార్తె పేరు తామారు. ఆమె చాలా అందమైనది.
28రాజు ముఖాన్ని చూడకుండ అబ్షాలోము రెండు సంవత్సరాలు యెరూషలేములో నివసించాడు. 29అప్పుడు యోవాబును రాజు దగ్గరకు పంపించాలని అబ్షాలోము అతన్ని పిలిచాడు కాని యోవాబు అతని దగ్గరకు రావడానికి ఒప్పుకోలేదు. అతన్ని రెండవసారి పిలిచినా సరే యోవాబు రావడానికి ఒప్పుకోలేదు. 30అప్పుడు అబ్షాలోము తన సేవకులతో, “చూడండి, యోవాబు పొలం నా పొలం ప్రక్కనే ఉంది, అతని పొలంలో యవల పంట ఉంది. మీరు వెళ్లి దానిని తగలబెట్టండి” అన్నాడు. కాబట్టి అబ్షాలోము పనివారు ఆ పొలాన్ని తగలబెట్టారు.
31అప్పుడు యోవాబు అబ్షాలోము ఇంటికి వెళ్లి, “నీ పనివారు నా పొలాన్ని ఎందుకు తగలబెట్టారు?” అని అడిగాడు.
32అందుకు అబ్షాలోము యోవాబుతో, “నీవు రావాలని నేను కబురు పంపాను. ‘గెషూరు నుండి నేను ఎందుకు వచ్చాను? నేనక్కడే ఉండడం నాకు మంచిది గదా!’ అని నీ చేత రాజుతో చెప్పించడానికి నిన్ను రాజు దగ్గరకు పంపాలని నిన్ను పిలిచాను. నేను రాజు ముఖాన్ని చూడాలి. నేను దోషినైతే రాజు నన్ను చంపించవచ్చు” అన్నాడు.
33కాబట్టి యోవాబు రాజు దగ్గరకు వెళ్లి ఆ సంగతి చెప్పాడు. అప్పుడు రాజు అబ్షాలోమును పిలిపించగా అతడు రాజు దగ్గరకు వచ్చి తన తల నేలకు ఆనించి రాజుకు నమస్కారం చేశాడు. రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకున్నాడు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in