అపొస్తలుల కార్యములు 23
23
1పౌలు న్వాయసభ వారిని సూటిగా చూసి, “నా సహోదరులారా, ఈ రోజు వరకు నేను నా మంచి మనస్సాక్షితో దేవుడు నాకు ఇచ్చిన కర్తవ్యాన్ని పూర్తి చేశాను” అని చెప్పాడు. 2అందుకు ప్రధాన యాజకుడైన అననీయ, పౌలుకు దగ్గరగా నిలబడి ఉన్నవానితో, అతని నోటి మీద కొట్టమని ఆదేశించాడు. 3అప్పుడు పౌలు అతనితో, “ఓ సున్నం కొట్టిన గోడా, దేవుడు నిన్ను కొడతాడు! ధర్మశాస్త్రం ప్రకారం నాకు తీర్పు తీర్చడానికి అక్కడ కూర్చుని, నన్ను కొట్టమని ఆదేశించి నీవు ధర్మశాస్త్ర ఆజ్ఞలను అతిక్రమిస్తున్నావు!” అన్నాడు.
4పౌలుకు దగ్గరగా నిలబడినవారు, “దేవుని ప్రధాన యాజకుని విమర్శించడానికి నీకెంత ధైర్యం!” అన్నారు.
5అందుకు పౌలు, “సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు; అయితే ‘మీ ప్రజల అధికారులను నిందించవద్దు అని’#23:5 నిర్గమ 22:28 ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉంది” అన్నాడు.
6అక్కడ ఉన్నవారిలో కొందరు సద్దూకయ్యులు మరికొందరు పరిసయ్యులు ఉన్నారని పౌలు గ్రహించి, ఆ న్యాయసభలోని వారితో, “నా సహోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతానంగా పుట్టాను. నేను మృతులకు పునరుత్థానం ఉందనే నిరీక్షణను బట్టి ఈ విచారణ పాలయ్యాను” అని బిగ్గరగా చెప్పాడు. 7అతడు ఆ విధంగా చెప్పిన వెంటనే, అక్కడ ఉన్న పరిసయ్యులు సద్దూకయ్యుల మధ్య విభేదం పుట్టి, ఆ సభ రెండుగా చీలిపోయింది. 8ఎందుకంటే, సద్దూకయ్యులు పునరుత్థానం లేదని, దేవదూతలు లేరని, ఆత్మలు లేవని అంటారు. కానీ పరిసయ్యులు ఇవన్నీ ఉన్నాయని నమ్ముతారు.
9అప్పుడు పరిసయ్యులలోని ధర్మశాస్త్ర ఉపదేశకులు కొందరు లేచి, “ఈ వ్యక్తిలో మాకు ఏ తప్పు కనిపించడం లేదు, అతనితో ఆత్మ కాని దేవదూత కాని మాట్లాడి ఉంటే తప్పు ఏంటి?” అని అడుగుతూ గట్టిగా వాదించారు, కాబట్టి గొప్ప అల్లరి చెలరేగింది. 10ఈ విభేదం మరింత హింసాత్మకంగా మారినందుకు పౌలును ముక్కలుగా చీల్చివేస్తారేమో అని ఆ అధిపతి భయపడ్డాడు. అతడు సైనికులను వెళ్లి వారి మధ్యలో నుండి పౌలును బలవంతంగా పట్టుకుని, సైనికుల కోటలోకి తీసుకుని రమ్మని ఆదేశించాడు.
11ఆ రాత్రి ప్రభువు పౌలు దగ్గర నిలబడి, “ధైర్యం తెచ్చుకో! యెరూషలేములో నా గురించి నీవు సాక్ష్యమిచ్చినట్టే రోమాలో కూడా నీవు సాక్ష్యమివ్వాలి” అని చెప్పారు.
పౌలును చంపడానికి కుట్ర
12మరుసటిరోజు ఉదయం కొందరు యూదులు ఒక కుట్రపన్ని, తాము పౌలును చంపే అంతవరకు ఏమి తినకూడదు త్రాగకూడదని ఒట్టు పెట్టుకొన్నారు. 13ఇలా కలిసి ఒట్టుపెట్టుకున్న వారు సుమారు నలభై కంటే ఎక్కువ మంది ఉన్నారు. 14వారు ముఖ్య యాజకులు యూదా పెద్దల దగ్గరకు వెళ్లి, “మేము పౌలును చంపే వరకు ఏమి తినకూడదని ఒట్టు పెట్టుకున్నాము. 15కాబట్టి మీరు న్యాయసభతో కలిసి, పౌలును మరింత వివరంగా విచారణ చేయాలని అతన్ని మీ దగ్గరకు తీసుకురమ్మని అధిపతితో మనవి చేయండి. అతడు ఇక్కడకు రావడానికి ముందే అతన్ని చంపడానికి మేము సిద్ధంగా ఉంటాం” అని చెప్పుకొన్నారు.
16అయితే పౌలు అక్క కుమారుడు ఈ కుట్ర గురించి విన్నప్పుడు, సైనిక కోటలోనికి పోయి ఆ విషయం పౌలుతో చెప్పాడు.
17అప్పుడు పౌలు ఒక శతాధిపతిని పిలిచి, “ఈ యువకుడిని అధిపతి దగ్గరకు తీసుకెళ్లండి; ఇతడు అధిపతికి ఒక మాట చెప్పాలి” అని చెప్పాడు. 18కాబట్టి అతడు ఆ యువకుని అధిపతి దగ్గరకు తీసుకుని వెళ్లాడు.
అప్పుడు శతాధిపతి, “ఈ యువకుడు నీకు ఒక మాట చెప్పాలి కాబట్టి ఇతన్ని మీ దగ్గరకు తీసుకెళ్లమని ఖైదీగా ఉన్న పౌలు నన్ను విన్నవించుకున్నాడు” అని అధిపతితో చెప్పాడు.
19అప్పుడు ఆ అధిపతి అతని చేతిని పట్టుకుని ప్రక్కకు తీసుకెళ్లి, “నీవు నాకు ఏమి చెప్పాలని అనుకున్నావు?” అని అడిగాడు.
20అందుకు అతడు, “కొందరు యూదులు పౌలును మరింత వివరంగా విచారణ చేయాలనే వంకతో రేపు న్యాయసభకు అతన్ని పంపించమని మిమ్మల్ని విన్నవించుకొంటారు. 21అయితే మీరు వారికి అనుమతి ఇవ్వకండి, ఎందుకంటే సుమారు నలభై కన్నా ఎక్కువ మంది అతని కోసం పొంచి ఉన్నారు. పౌలును చంపే వరకు ఏమి తినకూడదని వారు ఒట్టు పెట్టుకొన్నారు. ఇప్పుడు వారు మీ దగ్గర అనుమతి కోసం ఎదురుచూస్తూ, సిద్ధంగా ఉన్నారు” అని చెప్పాడు.
22ఆ అధిపతి, “ఈ సంగతిని నాకు చెప్పావని ఎవరికి చెప్పవద్దు” అని హెచ్చరించి ఆ యువకుడిని పంపించాడు.
పౌలు కైసరయకు పంపబడుట
23తర్వాత ఆ అధిపతి తన శతాధిపతులలో ఇద్దరిని పిలిచి, “రెండువందలమంది సైనికులు, డెబ్బైమంది గుర్రపురౌతులను రెండువందలమంది ఈటెల సైన్య పటాలంతో ఈ రాత్రి తొమ్మిది గంటలకు కైసరయకు వెళ్లడానికి సిద్ధపడండని ఆదేశించాడు. 24అలాగే అధిపతియైన ఫెలిక్స్ దగ్గరకు పౌలును క్షేమంగా తీసుకెళ్లడానికి అతనికి గుర్రాన్ని ఇవ్వండి” అని ఆదేశించాడు.
25అతడు ఈ విధంగా ఒక ఉత్తరం వ్రాశాడు:
26క్లౌదియ లూసియ,
మహా గౌరవనీయులైన ఫెలిక్స్ అధిపతికి,
నా వందనాలు.
27ఈ వ్యక్తిని యూదులు పట్టుకుని చంపబోతుంటే, ఇతడు రోమీయుడని తెలుసుకొని నేను సైనికులతో వెళ్లి రక్షించాను. 28వారు అతన్ని ఎందుకు నిందిస్తున్నారో తెలుసుకోవడానికి, వారి న్యాయసభ ముందు అతన్ని నిలబెట్టాను. 29వారు అతనిపై వారి ధర్మశాస్త్రానికి సంబంధించిన నిందలను మోపారు కాని, మరణశిక్ష వేయడానికి లేదా చెరసాలలో ఖైదీగా బంధించడానికి తగిన నేరమేదీ అతనిలో లేదు. 30అతన్ని చంపాలని కుట్ర పన్నుతున్నారని నాకు తెలియగానే, ఇతన్ని మీ దగ్గరకు పంపాను అతని మీద నిందమోపే వారిని వారి ఫిర్యాదులను మీ ముందు చెప్పుకోవాలి అని ఆదేశించాను.
31కాబట్టి సైనికులు, తమకు ఇచ్చిన ఆ దేశం ప్రకారం, రాత్రివేళ బయలుదేరి తమతో పౌలును యెరూషలేము నుండి అంతిపత్రి ప్రాంతానికి తీసుకెళ్లారు. 32మరుసటిరోజు గుర్రాల దండును పౌలుతో పాటు పంపి, వారు సైనికుల కోటకు తిరిగి వచ్చారు. 33ఆ గుర్రాల దండు కైసరయకు చేరిన తర్వాత, వారు ఆ ఉత్తరంతో పాటు పౌలును అధిపతికి అప్పగించారు. 34ఆ అధిపతి ఆ ఉత్తరం చదివి, అతడు ఏ ప్రాంతానికి చెందిన వాడు అని అడిగాడు. అతడు కిలికియకు చెందినవాడని తెలుసుకొని, 35“నీ మీద నేరం మోపిన వారు కూడా ఇక్కడకు వచ్చినప్పుడు నీ విషయాన్ని నేను విచారిస్తాను” అని చెప్పి, అతన్ని హేరోదు రాజగృహంలో కాపలా మధ్యలో ఉంచాలని ఆదేశించాడు.
Currently Selected:
అపొస్తలుల కార్యములు 23: OTSA
Highlight
Share
Copy
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapistaging.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fen.png&w=128&q=75)
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.