అపొస్తలుల కార్యములు 24
24
ఫెలిక్స్ ఎదుట పౌలు విచారణ
1అయిదు రోజుల తర్వాత ప్రధాన యాజకుడైన అననీయా కొందరు యూదా నాయకులు, తెర్తుల్లు అనే ఒక న్యాయవాదితో కలిసి కైసరయ పట్టణానికి వచ్చి పౌలుకు వ్యతిరేకంగా తమ ఫిర్యాదులను అధిపతికి తెలియజేశారు. 2పౌలును ఫెలిక్స్ ముందు నిలబెట్టిన తర్వాత, తెర్తుల్లు తన ఫిర్యాదులను అధిపతికి ఇలా తెలియజేశాడు: “ఘనత వహించిన ఫెలిక్స్ అధిపతి, మీ పాలనలో మీరు ముందు చూపుతో ఎన్నో సంస్కరణలు ఈ దేశానికి తెచ్చినందుకు మేము చాలా కాలం నుండి శాంతి కలిగి సంతోషంగా ఉన్నాము. 3ఈ విషయాన్ని ప్రతిచోట అన్ని విధాలుగా పూర్ణ కృతజ్ఞతతో మేము అంగీకరిస్తున్నాము. 4మిమ్మల్ని మరింత ఇబ్బందికి గురిచేయకుండా, మేము క్లుప్తంగా చెప్పేదానిని దయచేసి వినండని ప్రాధేయపడుతున్నాను.
5“ఇతడు లోకమంతట యూదులలో కలహాలను రేపుతూ ఇబ్బంది కలిగిస్తున్నాడు. నజరేయులు అనే మతశాఖకు ఇతడు నాయకుడు. 6ఇతడు దేవాలయాన్ని కూడా అపవిత్రం చేయాలని చూశాడు, కాబట్టి మేము ఇతన్ని పట్టుకున్నాము. 7మేము ఇతన్ని మా ధర్మశాస్త్రం ప్రకారం విచారణ చేస్తున్నాము. అయితే అధిపతి లూసియ వచ్చి ఇతన్ని మా దగ్గర నుండి బలవంతంగా తీసుకెళ్లి, ఇతనిపై ఫిర్యాదు చేసినవారు మీ ముందుకు రావాలి అని ఆదేశించాడు.#24:7 కొన్ని ప్రతులలో ఈ వచనాలు ఇక్కడ చేర్చబడలేదు 8మీరు ఇతన్ని విచారణ చేస్తే మేము ఇతనిపై చేసిన ఫిర్యాదులు సత్యమని మీరే తెలుసుకుంటారు” అని చెప్పాడు.
9అప్పుడు మిగిలిన యూదులు అతనితో ఏకీభవించి, ఆ ఫిర్యాదులు సత్యమే అని చెప్పారు.
10అధిపతి పౌలును మాట్లాడమని సైగ చేసినప్పుడు, అతడు ఈ విధంగా సమాధాన ఇచ్చాడు: “మీరు అనేక సంవత్సరాలుగా ఈ దేశానికి న్యాయాధికారిగా ఉన్నారని నాకు తెలుసు కాబట్టి నేను సంతోషంగా నా సమాధానాన్ని తెలియజేయగలను. 11నేను ఆరాధించడానికి యెరూషలేముకు వెళ్లి ఈ రోజుతో పన్నెండు రోజులే అవుతున్నాయని మీరు సులభంగా విచారించి తెలుసుకోగలరు. 12దేవాలయంలో కాని సమాజమందిరంలో కాని పట్టణంలో కాని మరెక్కడైనా నేను ఎవరితోనైనా వాదించడం లేదా ప్రజలమధ్య అల్లరి రేపడం కాని నా మీద ఫిర్యాదు చేసినవారు కనుగొనలేదు. 13వారు నాపై చేసిన ఫిర్యాదు నిజమని వారే నిరూపించలేరు. 14ఏది ఏమైనా, మతశాఖకు చెందినదని పిలువబడుతున్న ఈ మార్గాన్ని వెంబడించేవానిగా, నేను మన పూర్వికుల దేవునినే ఆరాధిస్తున్నానని ఒప్పుకుంటాను. నేను ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల గ్రంథాల్లో వ్రాసిన ప్రకారం అన్నిటిని నమ్ముతున్నాను. 15అలాగే నీతిమంతులకు దుర్మార్గులకు పునరుత్థానం ఉందని వీరికున్న నిరీక్షణనే నేను కూడా కలిగి ఉన్నాను. 16కాబట్టి నా మనస్సాక్షిని దేవుడు మనిషి ముందు స్పష్టంగా ఉంచడానికి నేనెల్లప్పుడు ప్రయాసపడుతున్నాను.
17“నేను అనేక సంవత్సరాల తర్వాత, నా ప్రజల్లోని పేదవారికి దానధర్మం చేసి దేవునికి అర్పణలను అర్పించడానికి యెరూషలేము పట్టణానికి వచ్చాను. 18నేను దేవాలయ ఆవరణంలో శుద్ధీకరణ సంస్కారాన్ని ముగిస్తున్నప్పుడు నా మీద నిందమోపుతున్న వారు నన్ను చూశారు అక్కడ నాతో ఏ గుంపు లేదు, నా వలన ఏ అల్లరి కూడా జరుగలేదు. 19అయితే ఆసియా ప్రాంతపు యూదులు కొందరు ఉన్నారు, వారికి నాపై ఏమైనా వ్యతిరేకత ఉంటే మీ దగ్గరకు వచ్చి నా మీద నేరం మోపి ఉండ వచ్చునేమో. 20లేదా ఇక్కడ ఉన్నవారు నేను న్యాయసభ ముందు నిలబడినప్పుడు నాలో ఏ నేరాన్ని కనుగొన్నారో వారే చెప్పాలి. 21అయితే ఆసియా ప్రాంతపు యూదుల మధ్యలో నేను ఉన్నప్పుడు, ‘నేడు మృతుల పునరుత్థానం గురించి మీ ముందు విమర్శకు గురవుతున్నాను’ అని బిగ్గరగా చెప్పినదాని బట్టి తప్ప మరి ఏ నేరమున్నదో వారే తెలియచేయాలి” అన్నాడు.
22అప్పుడు, ఫెలిక్స్ ఈ మార్గం గురించి బాగా తెలిసినవాడు కాబట్టి, “లూసియ అధిపతి వచ్చినప్పుడు నేను నీ సంగతిని విచారణ చేస్తాను” అని చెప్పి విచారణ వాయిదా వేశాడు. 23అతడు పౌలును కాపలాలో ఉంచి, అతని అవసరాలను తీర్చడానికి అతని స్నేహితుల్లో ఎవరిని ఆటంకపరచవద్దు అని శతాధిపతిని ఆదేశించాడు.
24కొన్ని రోజుల తర్వాత ఫెలిక్స్ యూదురాలైన తన భార్య ద్రుసిల్లతో కలసి వచ్చాడు. అతడు పౌలును పిలిపించి యేసు క్రీస్తులోని విశ్వాసాన్ని గురించి అతడు బోధించిన మాటలను విన్నాడు. 25పౌలు నీతి గురించి, మనస్సును అదుపులో ఉంచుకోవడం గురించి, రాబోయే తీర్పుల గురించి బోధించిన మాటలు విని ఫెలిక్స్ ఎంతో భయపడి, “ఇప్పటికి ఇది చాలు! నీవు వెళ్లు, మళ్ళీ నాకు అనుకూలంగా ఉన్నప్పుడు నిన్ను పిలిపిస్తాను” అని చెప్పాడు. 26పౌలు తనకు లంచం ఇస్తాడేమోనని ఆశించి, తరచుగా అతన్ని పిలిపిస్తూ అతనితో మాట్లాడేవాడు.
27రెండు సంవత్సరాల తర్వాత, ఫెలిక్స్ స్థానంలో పోర్కియస్ ఫేస్తు అధిపతిగా నియమించబడ్డాడు. అయితే ఫెలిక్స్ యూదులకు ఉపకారం చేయాలని పౌలును చెరసాలలోనే ఉంచాడు.
Currently Selected:
అపొస్తలుల కార్యములు 24: OTSA
Highlight
Share
Copy
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapistaging.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fen.png&w=128&q=75)
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.