YouVersion Logo
Search Icon

యెషయా 47

47
బబులోను పతనము
1“కన్యయైన బబులోను కుమార్తె,
క్రిందికి దిగి ధూళిలో కూర్చో;
బబులోనీయుల#47:1 లేదా కల్దీయుల; 5 వచనంలో కూడా రాణి పట్టణమా, సింహాసనం లేకుండా
నేల మీద కూర్చో.
నీవు సున్నితమైన దానవని సుకుమారివని
ఇకపై పిలువబడవు.
2తిరగలి తీసుకుని పిండి విసురు;
నీ ముసుగు తీసివేయి.
లంగాలు పైకెత్తి
కాలిమీద బట్ట తీసి నదులు దాటు.
3నీ నగ్నత్వం బయటపడుతుంది
నీ సిగ్గు కనబడుతుంది.
నేను ప్రతీకారం తీసుకుంటాను;
నేను ఎవరిని క్షమించను.”
4మన విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు
ఆయన పేరు సైన్యాల యెహోవా.
5“బబులోనీయుల రాణి పట్టణమా,
మౌనంగా కూర్చో, చీకటిలోనికి వెళ్లిపో;
రాజ్యాలకు రాణివని
ఇకపై నీవు పిలువబడవు.
6నా ప్రజల మీద నేను కోప్పడి
నా స్వాస్థ్యాన్ని అపవిత్రపరిచాను;
నేను వారిని నీ చేతికి అప్పగించాను,
నీవు వారిమీద జాలి చూపలేదు.
వృద్ధుల మీద కూడా నీవు
చాలా బరువైన కాడిని ఉంచావు.
7నీవు ‘నేను ఎప్పటికీ
నిత్య రాణిగా ఉంటాను!’ అని అనుకున్నావు.
కాని వీటి గురించి ఆలోచించలేదు
ఏమి జరగబోతుందో తెలుసుకోలేదు.
8“నీవు సుఖాన్ని ప్రేమిస్తూ
క్షేమంగా జీవిస్తూ,
‘నేనే ఉన్నాను, నేను తప్ప వేరే ఎవరూ లేరు.
నేను ఎప్పటికీ విధవరాలిని కాను
బిడ్డల్ని పోగొట్టుకొని బాధపడను’ అని నీలో నీవు అనుకుంటున్నావు,
కాని ఇప్పుడు ఈ మాట విను.
9ఒక్క క్షణంలోనే ఒక్క రోజులోనే
ఈ రెండు నీకు సంభవిస్తాయి:
బిడ్డల్ని పోగొట్టుకుంటావు విధవరాలిగా మారతావు.
నీవు చాలా శకునాలు చూసినా,
అనేక కర్ణపిశాచ తంత్రాల మీద ఆధారపడినా
ఈ విషాదాలు నీ మీదికి పూర్తిగా వస్తాయి.
10నీ చెడుతనాన్ని నీవు నమ్ముకుని
‘ఎవరూ నన్ను చూడరు’ అని అనుకున్నావు.
‘నేనే, నేను తప్ప వేరే ఎవరూ లేరు’
అని నీకు నీవు అనుకున్నప్పుడు
నీ జ్ఞానం నీ తెలివి నిన్ను తప్పుదారి పట్టించాయి.
11విపత్తు నీ మీదికి వస్తుంది,
దానిని మాయాజాలంతో ఎలా పోగొట్టాలో నీవు తెలుసుకోలేవు.
ఒక కీడు నీ మీద పడుతుంది
దానిని నీవు డబ్బుతో నివారించలేవు;
నీకు తెలియని నాశనం
నీ మీదికి అకస్మాత్తుగా వస్తుంది.
12“నీ చిన్నప్పటి నుండి నీవు కష్టపడి నేర్చుకున్న
నీ కర్ణపిశాచ తంత్రాలను
నీ విస్తారమైన శకునాలను ప్రయోగించుకో
బహుశ నీవు విజయం సాధిస్తావేమో,
బహుశ నీవు భయం కలిగించగలవేమో.
13నీవు తీసుకున్న సలహాలన్నీ విని నీవు అలసిపోయావు.
నీ జ్యోతిష్యులు, నెలలవారీగా
రాశి ఫలాలను చెప్పేవారిని రమ్మను,
నీ మీదికి వచ్చే వాటినుండి నిన్ను వారు రక్షించాలి.
14నిజంగా వారు గడ్డిపరకలా అవుతారు;
అగ్ని వారిని కాల్చివేస్తుంది.
అగ్ని జ్వాలల నుండి వారు
తమను తాము కాపాడుకోలేరు.
అవి చలికాచుకోవడానికి వాడే నిప్పులు కాదు;
ఎదురుగా కూర్చుని కాచుకునే అగ్ని కూడా కాదు.
15నీ చిన్నప్పటి నుండి
నీవు ఎవరి కోసం శ్రమపడ్డావో
వారంతా నిన్ను నిరాశపరుస్తారు.
వారంతా తమ తప్పుదారిలో వెళ్లిపోతారు.
నిన్ను రక్షించగలిగే వారొక్కరూ ఉండడు.

Currently Selected:

యెషయా 47: OTSA

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for యెషయా 47