YouVersion Logo
Search Icon

యెషయా 48

48
మొండిగా ఉన్న ఇశ్రాయేలు
1“యాకోబు వారసులారా,
ఇశ్రాయేలు అనే పేరుతో పిలువబడి
యూదా కుటుంబం నుండి వచ్చే వారలారా వినండి,
యెహోవా పేరిట ప్రమాణం చేస్తూ
ఇశ్రాయేలు దేవుని వేడుకుంటూ
సత్యాన్ని గాని నీతి గాని అనుసరించని వారలారా వినండి.
2మీ గురించి మీరు పరిశుద్ధ పట్టణస్థులమని చెప్పుకుంటూ
ఇశ్రాయేలు దేవుని మీద ఆధారపడుతున్నామని చెప్పుకుంటున్న మీరు వినండి,
ఆయన పేరు సైన్యాల యెహోవా:
3గతంలో జరిగిన వాటి గురించి నేను చాలా కాలం క్రితమే చెప్పాను.
నా నోరు వాటిని ప్రకటించింది నేను వాటిని తెలియజేశాను;
తర్వాత నేను అకస్మాత్తుగా వాటిని చేయగా అవి జరిగాయి.
4ఎందుకంటే మీరు ఎంత మొండివారో నాకు తెలుసు;
నీ మెడ నరాలు ఇనుపవని,
నీ నుదురు ఇత్తడిదని నాకు తెలుసు.
5కాబట్టి వీటి గురించి నేను చాలా కాలం క్రితం చెప్పాను;
‘నా విగ్రహం ఈ పనులను జరిగించింది
నేను చెక్కిన ప్రతిమ, నేను పోతపోసిన విగ్రహం వాటిని నియమించాయి’ అని
నీవు ఎప్పుడూ చెప్పకుండా ఉండేలా
అవి జరగకముందే నీకు వాటిని ప్రకటించాను.
6నీవు ఈ సంగతులను విన్నావు; వాటన్నిటిని చూడు.
అవి నిజమని నీవు ఒప్పుకోవా?
“నీకు తెలియకుండా దాచబడిన
క్రొత్త విషయాలను ఇకపై నేను నీకు చెప్తాను.
7అవి ఇప్పుడే సృజించినవి, ఎప్పుడో చేసినవి కావు;
ఈ రోజుకు ముందు నీవు వాటి గురించి వినలేదు.
అప్పుడు, ‘అవును, వాటి గురించి నాకు తెలుసు’
అని నీవు చెప్పలేవు.
8నీవు వాటి గురించి వినలేదు, అవి నీకు తెలియదు;
పూర్వం నుండి నీ చెవులు తెరవబడలేదు.
నీవు ఎంత ద్రోహివో నాకు తెలుసు;
నీ పుట్టుక నుండి తిరుగుబాటుదారుడవు.
9నేను నిన్ను పూర్తిగా నాశనం చేయకుండా
నా నామాన్ని బట్టి నా కోపాన్ని ఆపుకున్నాను;
నా కీర్తి కోసం నీ నుండి దానిని నేను నిగ్రహించుకున్నాను.
10చూడు, నేను నిన్ను శుద్ధి చేశాను, కాని వెండిని చేసినట్లు కాదు;
బాధల కొలిమిలో నిన్ను పరీక్షించాను.
11నా కోసం, నా కొరకే, నేను ఇలా చేస్తాను.
నా పేరును ఎలా అపవిత్రం చేయనిస్తాను?
నేను నా మహిమను మరొకరికి ఇవ్వను.
ఇశ్రాయేలు విడిపించబడుట
12“యాకోబూ, నేను పిలిచిన ఇశ్రాయేలూ,
నా మాట విను.
నేనే ఆయనను;
నేనే మొదటివాడను నేను చివరివాడను.
13నా సొంత చేయి భూమికి పునాదులను వేసింది,
నా కుడిచేయి ఆకాశాలను విశాలపరిచింది;
నేను వాటిని పిలిచినప్పుడు
అవన్నీ కలసి నిలబడతాయి.
14“మీరందరూ కలసి వచ్చి వినండి:
విగ్రహాలలో ఏది ఈ విషయాలను ముందే చెప్పింది?
యెహోవా స్నేహితునిగా ఎంచుకున్నవాడు
ఆయన ఉద్దేశాన్ని బబులోనుకు చేస్తాడు
ఆయన చేయి బబులోనీయులకు#48:14 లేదా కల్దీయులకు 20 వచనంలో కూడా ఉంది వ్యతిరేకంగా ఉంటుంది.
15నేను, నేనే చెప్పాను;
అవును, నేనే అతన్ని పిలిచాను.
నేను అతన్ని రప్పిస్తాను
అతడు తన పనిలో విజయం సాధిస్తాడు.
16“నా దగ్గరకు వచ్చి ఈ మాట విను:
“మొదటి ప్రకటన నుండి నేను రహస్యంగా మాట్లాడలేదు;
అది జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను.”
ఇప్పుడు ప్రభువైన యెహోవా
తన ఆత్మతో నన్ను పంపారు.
17నీ విమోచకుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన
యెహోవా చెప్పే మాట ఇదే:
నీ దేవుడనైన యెహోవాను నేనే,
నీకు ఏది మంచిదో అది నీకు బోధిస్తాను
నీవు వెళ్లవలసిన మార్గాన్ని నీకు చూపిస్తాను.
18నీవు నా ఆజ్ఞల పట్ల శ్రద్ధ చూపించి ఉంటే
నీ సమాధానం నదిలా
నీ నీతి సముద్రపు అలలుగా ఉండేవి.
19నీ వారసులు ఇసుకలా,
నీ పిల్లలు లెక్కించలేని రేణువుల్లా ఉండేవారు.
వారి పేరు ఎప్పటికీ కొట్టివేయబడదు
ఎప్పుడూ నా ఎదుట నుండి నిర్మూలం కావు.
20బబులోనును విడిచిపెట్టండి.
బబులోనీయుల నుండి పారిపోండి!
“యెహోవా తన సేవకుడైన యాకోబును విడిపించారు” అని
ఆనంద కేకలతో తెలియజేయండి.
దానిని ప్రకటించండి.
భూమి అంచుల వరకు దానిని తెలియజేయండి.
21ఎడారుల గుండా ఆయన వారిని నడిపించినా వారికి దాహం వేయలేదు;
ఆయన వారి కోసం బండ నుండి నీళ్లు ప్రవహించేలా చేశారు.
ఆయన బండను చీల్చారు,
నీళ్లు ఉప్పొంగుతూ బయటకు వచ్చాయి.
22“దుర్మార్గులకు నెమ్మది ఉండదు” అని యెహోవా చెప్తున్నారు.

Currently Selected:

యెషయా 48: OTSA

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for యెషయా 48