సామెతలు 11
11
1మోసపు త్రాసులను యెహోవా అసహ్యించుకుంటారు,
న్యాయమైన తూకం అంటే ఆయనకు ఇష్టము.
2గర్వము వెంబడి అవమానం వస్తుంది,
కాని వినయం వెంట జ్ఞానం వస్తుంది.
3యథార్థవంతుల యథార్థత వారిని నడిపిస్తుంది,
కానీ నమ్మకద్రోహులు వారి వంచనతో నాశనమవుతారు.
4ఉగ్రత దినాన సంపద విలువలేనిది,
అయితే నీతి చావు నుండి విడిపిస్తుంది.
5నిందలేనివారి నీతి వారి మార్గాలను తిన్నవిగా చేస్తాయి,
కాని దుష్టులు తమ దుష్టత్వాన్ని బట్టి పడిపోతారు.
6యథార్థవంతుల నీతి వారిని విడిపిస్తుంది,
కాని నమ్మకద్రోహులు వారి చెడు కోరికల చేత పట్టబడతారు.
7దుష్టులైన మనుష్యుల ఆశ వారితోనే చస్తుంది;
వారు బలవంతులుగా ఉన్నప్పుడు చేసిన వాగ్దానాలన్ని శూన్యమవుతాయి.
8నీతిమంతులు బాధ నుండి తప్పించబడతారు
కాని దుష్టులు దానిలో పడతారు.
9దుష్టులువాడు తన నోటి మాట వలన తన పొరుగువానికి నాశనం కలుగుతుంది,
తెలివిచేత నీతిమంతులు తప్పించుకుంటారు.
10నీతిమంతులు అభివృద్ధి చెందుట పట్టణానికి సంతోషకరం;
దుష్టులు నశించినపుడు ఆనంద కేకలు వినబడతాయి.
11యథార్థవంతుని దీవెన వలన పట్టణం హెచ్చింపబడుతుంది,
కాని దుష్టుని నోటి వలన అది నాశనమవుతుంది.
12తన పొరుగువానిని గేలి చేసేవారు బుద్ధిహీనులు,
కాని వివేకులు తమ నాలుకను అదుపులో పెట్టుకుంటారు.
13పుకారు ఆత్మవిశ్వాసాన్ని మోసం చేస్తుంది,
కాని నమ్మదగినవారు రహస్యాలను దాస్తారు.
14ఎందుకంటే మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల దేశం పడిపోతుంది,
కాని అనేక సలహాదారుల ద్వారా విజయం కలుగుతుంది.
15ఎవరైతే అపరిచితునికి భద్రత కల్పిస్తారో వారు ఖచ్చితంగా నష్టపోతారు,
కాని ప్రతిజ్ఞలో చేతులు దులుపుకునేవాడు క్షేమంగా ఉంటాడు.
16దయ మర్యాద కలిగిన స్త్రీ గౌరవాన్ని సంపాదిస్తుంది,
క్రూరులు కేవలం ఐశ్వర్యాన్ని సంపాదిస్తారు.
17దయగలవారు తమకు తాము మేలు చేసుకుంటారు,
కాని క్రూరులు తమ మీదికి తామే శరీరమునకే పతనం తెచ్చుకుంటారు.
18దుష్టులు మోసపూరితమైన జీతం పొందుతారు,
కానీ నీతిగా జీవించేవారు నిజంగా ప్రతిఫలాన్ని పొందుతారు.
19నీతిమంతుడు నిజంగా జీవాన్ని పొందుతాడు,
చెడును వెంటాడేవాడు మరణాన్ని కనుగొంటాడు.
20వక్ర హృదయాలు గలవారిని యెహోవా అసహ్యించుకుంటారు,
అయితే నిందారహితమైన మార్గాలు గలవారిని బట్టి ఆయన సంతోషిస్తారు.
21ఇది ఖచ్చితం అని తెలుసుకోండి: దుష్టులు శిక్షించబడకుండా తప్పించుకోరు,
నీతిమంతులు విడిపించబడతారు.
22మంచిచెడులు తెలియని అందమైన స్త్రీ
పంది ముక్కున ఉన్న బంగారపు కమ్మివంటిది.
23నీతిమంతుల కోరిక ఉత్తమమైనది,
దుష్టుల కోరిక గర్వంతో నిండి ఉంటుంది.
24ధారాళంగా ఇచ్చి అభివృద్ధి పొందినవారు కలరు;
ఇవ్వాల్సిన దానికన్నా తక్కువ ఇస్తూ దరిద్రులైన వారు కలరు.
25దీవించే మనస్సు గలవారు వృద్ధిచెందుతారు,
నీళ్లు పోసేవారికి నీళ్లు పోయబడతాయి.
26ధాన్యాన్ని అమ్మకుండా దాచుకునేవాన్ని ప్రజలు శపిస్తారు,
వాటిని అమ్మే వాని తల మీదికి దీవెనలు వస్తాయి.
27మేలు చేయాలని కోరేవారు దయను పొందుతారు,
కీడు చేసేవారికి కీడే కలుగుతుంది.
28సంపదను నమ్ముకునేవారు పాడైపోతారు,
నీతిమంతులు చిగురాకువలే అభివృద్ధి పొందుతారు.
29తన ఇంటివారిని బాధపెట్టేవారు ఏమీ సంపాదించుకోలేరు,
మూర్ఖులు జ్ఞానంగలవారికి దాసులుగా ఉంటారు.
30నీతిమంతుల ఫలం జీవవృక్షంలా ఉంటుంది,
జ్ఞానంగలవారు జీవితాలను కాపాడతారు.
31నీతిమంతులు భూమి మీద తమ ప్రతిఫలం పొందితే,
భక్తిహీనులు, పాపాత్ముల గతి ఖచ్చితంగా అలాగే ఉంటుంది కదా!
Currently Selected:
సామెతలు 11: OTSA
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.