YouVersion Logo
Search Icon

సామెతలు 12

12
1శిక్షను ప్రేమించేవాడు జ్ఞానాన్ని ప్రేమించేవాడు,
కానీ దిద్దుబాటును అసహ్యించేవాడు మూర్ఖుడు.
2మంచివారు యెహోవా దయ పొందుతారు,
చెడు ఆలోచనలు చేసేవారికి శిక్ష విధిస్తారు.
3చెడుతనం ద్వారా మనుష్యులు స్ధిరపరచబడరు,
అయితే నీతిమంతులు ఎప్పటికిని పెరికివేయబడరు.
4మంచి భార్య తన భర్తకు కిరీటం వంటిది
కానీ అపకీర్తిగల భార్య వాని యెముకల్లో కుళ్ళువంటిది.
5నీతిమంతుల ఆలోచనలు న్యాయమైనవి
దుష్టుల సలహాలు మోసకరమైనవి.
6దుష్టుల మాటలు ఒక హత్యకు పొంచి ఉన్న వారి లాంటివి,
యథార్థవంతుల మాటలు వారిని విడిపిస్తాయి.
7దుష్టులు చనిపోయి కనుమరుగవుతారు,
అయితే నీతిమంతుల ఇల్లు స్థిరంగా నిలుస్తుంది.
8మనుష్యులు తన వివేకాన్ని బట్టి పొగడబడతాడు,
అలాగే వికృతమైన మనస్సు కలవారు తిరస్కరించబడతారు.
9ఏమీ కాకపోయినా ఏదో గొప్పవానిగా నటిస్తూ ఆహారం కూడా లేని వానికంటె
ఏమీ కాని వాడైనా ఒక సేవకుని కలిగి ఉన్నవాడు మేలు.
10నీతిమంతులు తన పశువులను జాగ్రత్తగా చూసుకుంటారు,
కానీ దుష్టులు చేసే అత్యంత జాలిగల పనులు కౄరంగా ఉంటాయి.
11తమ భూమిలో పని చేసేవారికి ఆహారం సమృద్ధిగా ఉంటుంది,
కానీ పగటి కలల వెంటపడేవారికి బుద్ధి ఉండదు.
12దుష్టులు కీడుచేసేవారి బలమైన కోటను కోరుకుంటారు,
అయితే నీతిమంతుల వేరు చిగురిస్తుంది.
13కీడుచేసేవారు వారి పాపిష్ఠి మాటచేత చిక్కుకుంటారు,
నిర్దోషులు ఆపద నుండి తప్పించుకుంటారు.
14ప్రజలు తాము చెప్పే మాటల వలన మేలు పొందుతారు,
ఎవరు చేసిన పనికి వారికే ప్రతిఫలం కలుగుతుంది.
15మూర్ఖుల దారి వారి దృష్టికి సరియైనదిగా కనబడుతుంది,
కాని జ్ఞానులు సలహాలు వింటారు.
16మూర్ఖులు తమ కోపాన్ని వెంటనే చూపిస్తారు,
కాని వివేకంగలవారు తమకు కలిగిన అవమానాన్ని మౌనంగా భరిస్తారు.
17నమ్మకమైన సాక్షులు న్యాయం మాట్లాడతారు,
కాని అబద్ధ సాక్షులు అబద్ధాలు మాట్లాడతారు.
18నిర్లక్ష్యపు మాటలు ఖడ్గాల్లా గుచ్చుతాయి,
కాని జ్ఞానుల నాలుకలు స్వస్థత కలిగిస్తాయి.
19నిజాయితీగల పెదవులు శాశ్వతంగా ఉంటాయి,
అబద్ధాలు మాట్లాడే నాలుక క్షణికమే ఉంటుంది.
20కీడును కలిగించువారి హృదయంలో మోసము కలదు
సమాధానపరచడానికి ఆలోచన చెప్పువారు సంతోషముగా ఉందురు.
21నీతిమంతులకు ఏ ఆపద రాదు
దుష్టులువాని ఇల్లు కీడుతో నిండి ఉంటుంది.
22అబద్ధాలు మాట్లాడేవారు యెహోవాకు అసహ్యం
నమ్మదగినవారు ఆయనకు ఇష్టులు.
23వివేకంగల మనుష్యులు తమ తెలివిని దాచిపెడతారు
కానీ మూర్ఖులు తమ మూర్ఖత్వాన్ని ప్రచారం చేసుకుంటారు.
24శ్రద్ధగా పని చేసేవారు అధికారులవుతారు
కానీ సోమరులు బానిసలవుతారు.
25ఒకని హృదయంలో దిగులు వానిని క్రుంగిపోయేలా చేస్తుంది,
దయ గల మాటలు వానిని సంతోషపెడతాయి.
26నీతిమంతులు తమ పొరుగువారికి దారి చూపుతారు,
కానీ దుష్టుని ప్రవర్తన వానిని దారి తప్పిస్తుంది.
27సోమరి మనుష్యులు తాము వేటాడిన మాంసాన్ని కాల్చరు,
కానీ శ్రద్ధగల వారు తమకు దొరికిన ప్రతీదానిని ఉపయోగిస్తారు.
28నీతిమంతుల మార్గంలో జీవం ఉంటుంది;
ఆ మార్గం మరణానికి దారితీయదు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in