YouVersion Logo
Search Icon

సామెతలు 4

4
ఎలాగైనా జ్ఞానం సంపాదించండి
1నా కుమారులారా, తండ్రి ఉపదేశాలను ఆలకించండి;
వాటిని శ్రద్ధగా ఆలకించండి వివేకం పొందండి.
2మీకు నేను మంచి ఉపదేశాలను ఇస్తాను,
కాబట్టి నా బోధను త్రోసివేయకండి.
3నేను కూడా నా తండ్రికి కుమారుడను,
నా తల్లికి నేను ఏకైక సుకుమారుడను.
4నా తండ్రి నాకు బోధించి, నాతో చెప్పిందేమిటంటే,
“నీ హృదయపూర్వకంగా నా మాటలను గట్టిగా పట్టుకో;
నా ఆజ్ఞలను పాటించు, నీవు బ్రతుకుతావు.
5జ్ఞానాన్ని సంపాదించుకో, వివేకాన్ని సంపాదించుకో;
నా మాటలు మరచిపోవద్దు, వాటినుండి తొలగిపోవద్దు.
6నీవు జ్ఞానాన్ని విడచిపెట్టకు, అది నిన్ను కాపాడుతుంది;
నీవు దానిని ప్రేమించు, ఆమె నీకు కావలిదానిగా ఉంటుంది.
7జ్ఞానానికి ఆరంభం ఇది: జ్ఞానం సర్వోన్నతమైనది, దానిని పొందుకో.
నీకున్నదంతా ఖర్చైనా సరే, వివేకాన్ని సంపాదించుకో.
8దానిని నీవు గారాబం చేస్తే, అది నిన్ను హెచ్చిస్తుంది;
దానిని నీవు హత్తుకుంటే అది నీకు ఘనత కలిగిస్తుంది.
9అది నీ తలపై అందమైన మాలను ఉంచుతుంది
అద్భుతమైన కిరీటాన్ని ఇస్తుంది.”
10నా కుమారుడా, ఆలకించు, నేను చెప్తుంది అంగీకరించు,
నీవు దీర్ఘకాలం జీవిస్తావు.
11నేను జ్ఞాన మార్గంలో నీకు బోధిస్తాను
తిన్నని మార్గాల్లో నిన్ను నడిపిస్తాను.
12నీవు నడుస్తున్నప్పుడు, నీ అడుగు ఇరుకున పడదు.
నీవు పరుగెత్తినప్పుడు, నీ పాదాలు తడబడవు.
13ఉపదేశాన్ని పట్టుకో, దానిని విడచిపెట్టకు;
అది నీకు జీవం కాబట్టి దానిని జాగ్రత్తగా ఉంచుకో.
14దుర్మార్గుల త్రోవలో నీ పాదం ఉంచవద్దు
కీడుచేసేవారి మార్గంలో నడవవద్దు.
15దాన్ని నివారించు, దానిపై ప్రయాణించవద్దు;
దాని నుండి తొలగిపోయి నీ మార్గంలో సాగిపో.
16కీడు చేయనిదే వారు నిద్రపోలేరు;
ఎదుటివారిని పడవేయనిదే వారికి నిద్రరాదు.
17వారు దుర్మార్గమనే ఆహారం తింటారు
హింస అనే ద్రాక్షరసాన్ని త్రాగుతారు.
18నీతిమంతుల మార్గం ఉదయించే సూర్యునిలా,
పూర్తి పగటి వెలుగు వచ్చేవరకు ప్రకాశిస్తుంది.
19కాని దుష్టుల మార్గం కటిక చీకటిమయం;
వారు దేని చేత తొట్రిల్లుతున్నారో వారికే తెలియదు.
20నా కుమారుడా! నా మాటలు ఆలకించు;
నా వాక్యాలకు నీ చెవియొగ్గు.
21నీ కళ్ళెదుట నుండి నా మాటలు తొలగిపోనివ్వకు,
నీ హృదయంలో నా మాటలు భద్రపరచుకో.
22వాటిని కనుగొన్నవారికి అవి జీవాన్ని,
వారి సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి.
23అన్నిటికి మించి, నీ హృదయాన్ని కాపాడుకో,
ఎందుకంటే నీ హృదయంలోనుండి జీవన వనరులు ప్రవహిస్తాయి.
24నీ నోటిని వక్రబుద్ధికి దూరంగా ఉంచుకో;
మోసపూరితమైన మాటలు నీ పెదాలకు దూరంగా ఉంచుకో.
25నీ కళ్లు నేరుగా చూచును గాక;
నీ చూపు నేరుగా నీ ముందు ఉండును గాక.
26నీ పాదాలకు తిన్నని మార్గాన్ని ఏర్పరచుకో
నీ మార్గాలన్ని స్థిరంగా ఉంటాయి.
27నీవు కుడివైపుకైనా, ఎడమవైపుకైనా తిరుగవద్దు.
నీ పాదాలను కీడుకు దూరంగా ఉంచాలి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in