YouVersion Logo
Search Icon

సామెతలు 6

6
మూర్ఖత్వానికి వ్యతిరేకంగా హెచ్చరికలు
1నా కుమారుడా, నీవు నీ పొరుగువాని రుణానికి భద్రత ఇచ్చివుంటే,
చేతిలో చేయి వేసి అపరిచితునికి హామీ ఇచ్చివుంటే,
2నీవు పలికిన దాని వలన చిక్కుబడి ఉన్నావు,
నీ నోటి మాట వలన పట్టుబడి ఉన్నావు.
3నా కుమారుడా, నీవు నీ పొరుగువారి చేతుల్లో పడ్డావు,
కాబట్టి నిన్ను నీవు విడిపించుకోడానికి ఇలా చేయాలి:
వెళ్లి అలసిపోయేవరకు,#6:3 లేదా నిన్ను నీవు తగ్గించుకొని
నీ పొరుగువారికి విశ్రాంతి ఇవ్వకు!
4నీ కళ్ళకు నిద్ర గాని,
నీ కనురెప్పలకు కునుకు గాని రానియ్యకు.
5వేటగాని చేతి నుండి జింక తప్పించుకున్నట్లుగా,
బోయవాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లుగా, నీవు తప్పించుకో.
6సోమరీ, చీమల దగ్గరకు వెళ్లు;
అవి నడిచే విధానం చూసి జ్ఞానం తెచ్చుకో.
7వాటికి అధిపతులు లేరు,
పర్యవేక్షించేవారు లేరు, పాలకులు లేరు,
8అయినా అవి వేసవికాలంలో ఆహారాన్ని సమకూర్చుకుంటాయి,
కోతకాలంలో ధాన్యాన్ని దాచుకుంటాయి.
9సోమరీ, ఎప్పటి వరకు నీవు పడుకుంటావు?
ఎప్పుడు నిద్ర లేస్తావు?
10ఇంకొంచెం నిద్ర, ఇంకొంచెం కునుకు,
ఇంకొంచెం సేపు విశ్రాంతి అంటూ చేతులు ముడుచుకుంటాను అంటావు.
11పేదరికం నీ మీదికి దొంగలా,
లేమి ఆయుధాలు ధరించినవానిలా నీ మీదికి వస్తుంది.
12వంకర మాటలు మాట్లాడుతూ తిరిగేవాడు,
పనికిరానివాడు దుష్టత్వం నిండిన మనుష్యుడు.
13వాడు ద్వేషపూరితంగా కన్నుగీటుతూ,
తన పాదాలతో సైగలు చేస్తూ
తన వ్రేళ్ళతో సంజ్ఞలు చేస్తాడు.
14అతడు తన హృదయంలో వికృత ఆలోచనలతో కీడును తలపెడతాడు,
అతడు అన్ని సమయాల్లో వివాదాన్ని వ్యాప్తి చేస్తాడు.
15కాబట్టి దుష్టుని మీదికి విపత్తు అకస్మాత్తుగా వస్తుంది;
వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందే కూలిపోతాడు.
16యెహోవాకు హేయమైనవి ఆరు,
ఆయనకు హేయమైనవి ఏడు కలవు.
17అవి ఏమనగా, అహంకారపు కళ్లు,
అబద్ధమాడే నాలుక,
నిర్దోషులను చంపే చేతులు.
18చెడ్డ పన్నాగాలు చేసే హృదయం,
కీడు చేయడానికి త్వరపడే పాదాలు,
19అబద్ధాలు చెప్పే అబద్ధసాక్షి,
సమాజంలో గొడవ రేపే వ్యక్తి.
వ్యభిచారానికి వ్యతిరేకంగా హెచ్చరిక
20నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞలు పాటించు
నీ తల్లి ఉపదేశాన్ని త్రోసివేయకు.
21వాటిని ఎప్పుడు నీ హృదయంలో పదిలంగా ఉంచుకో;
నీ మెడ చుట్టూ వాటిని కట్టుకో.
22నీవు త్రోవను నడిచేటప్పుడు అవి నిన్ను నడిపిస్తాయి;
నీవు నిద్రించేటప్పుడు అవి నిన్ను కాపాడతాయి.
నీవు మేలుకొనునప్పుడు అవి నీతో మాట్లాడతాయి.
23ఈ ఆజ్ఞ దీపంగా
ఈ బోధ వెలుగుగా
క్రమశిక్షణ కోసమైన దిద్దుబాట్లుగా
జీవమార్గాలుగా ఉండి,
24వ్యభిచార స్త్రీ దగ్గరకు వెళ్లకుండ
దారితప్పిన స్త్రీ పలికే మాటలకు లొంగిపోకుండ నిన్ను కాపాడతాయి.
25నీ హృదయంలో ఆమె అందాన్ని మోహించకు
తన కళ్లతో నిన్ను వశపరచుకోనియ్యకు.
26ఎందుకంటే ఒక వేశ్యను రొట్టె ముక్కకైనా పొందవచ్చు,
కానీ మరొకని భార్య నీ జీవితాన్నే వేటాడుతుంది.
27ఒక మనుష్యుడు తన బట్టలు కాలకుండ
తన ఒడిలో అగ్నిని ఉంచుకోగలడా?
28తన పాదాలు కాలకుండ
ఎవరైనా నిప్పుల మీద నడవగలరా?
29మరొకని భార్యతో పడుకునే వాడు కూడా అంతే;
ఆమెను తాకేవాడు శిక్షను తప్పించుకోలేడు.
30ఆకలితో అలమటిస్తూ ఉండి ఆకలి తీర్చుకోవడానికి
దొంగ దొంగతనం చేస్తే ప్రజలు వాన్ని చులకనగా చూడరు.
31అయినాసరే వాడు దొరికితే, వాడు ఏడంతలు చెల్లించాలి,
దానికి తన ఇంటి సంపదంతా ఖర్చైనా సరే.
32అయితే వ్యభిచారం చేసే ఒక మనిషికి బుద్ధిలేదు;
అలా ఎవరు చేసినా వారు తమను తామే నాశనం చేసుకుంటారు.
33దెబ్బలు, అవమానం వాని భాగం,
వానికి కలిగే అపకీర్తి ఎన్నటికి తొలిగిపోదు.
34ఎందుకంటే అనుమానం భర్తకు రోషాన్ని పుట్టిస్తుంది,
ప్రతీకారం తీర్చుకునేటప్పుడు అతడు కనికరం చూపించడు.
35అతడు ఏ పరిహారాన్ని అంగీకరించడు;
ఎంత ఎక్కువైనా సరే, అతడు లంచాన్ని తిరస్కరిస్తాడు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in