Logo YouVersion
Eicon Chwilio

మత్తయి సువార్త 8

8
యేసు కుష్ఠురోగిని స్వస్థపరచుట
1యేసు కొండమీద నుండి దిగి వచ్చినప్పుడు గొప్ప జనసమూహాలు ఆయనను వెంబడించాయి. 2కుష్ఠురోగి ఒకడు వచ్చి ఆయన ముందు మోకరించి ఆయనతో, “ప్రభువా, నీకిష్టమైతే, నన్ను బాగు చేయి” అన్నాడు.
3యేసు చేయి చాపి వాన్ని ముట్టి వానితో, “నాకు ఇష్టమే, నీవు బాగవు” అన్నారు. వెంటనే వాని కుష్ఠురోగం వాన్ని విడిచి వాడు బాగయ్యాడు. 4అప్పుడు యేసు వానితో, “నీవు ఈ విషయం ఎవరికి చెప్పకు. నీవు వెళ్లి యాజకునికి చూపించుకుని వారికి సాక్ష్యంగా ఉండేలా మోషే నియమించిన కానుకను అర్పించు” అని చెప్పారు.
శతాధిపతి విశ్వాసం
5యేసు కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చి, 6“ప్రభువా, నా పనివాడు పక్షవాతంతో ఇంట్లో చాలా బాధపడుతున్నాడు” అని చెప్పాడు.
7అప్పుడు యేసు అతనితో, “నేను వచ్చి అతన్ని బాగుచేయనా?” అని అన్నారు.
8అందుకు శతాధిపతి, “ప్రభువా, నిన్ను నా ఇంటికి రప్పించుకునేంత యోగ్యత నాకు లేదు. కానీ నీవు ఒక మాట చెప్తే చాలు నా పనివాడు బాగవుతాడు. 9ఎందుకంటే, నేను కూడా అధికారం క్రింద ఉన్నవాడినే. నా మాటకు ఉండే అధికారం నాకు తెలుసు. నా అధికారం క్రింద సైనికులున్నారు. నేను ‘వెళ్లండి’ అంటే వెళ్తారు, ‘రండి’ అంటే వస్తారు. నా పనివాన్ని ‘ఇది చేయి’ అంటే చేస్తాడు” అని అన్నాడు.
10యేసు ఈ మాటలు విని ఆశ్చర్యపడి తన వెంట వస్తున్నవారితో, “ఇశ్రాయేలీయులలో ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను ఎవ్వరిలో చూడలేదని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. 11అనేకులు తూర్పు పడమర నుండి వచ్చి పరలోకరాజ్యంలో జరిగే విందులో అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో పాటు తమ తమ స్థానాల్లో కూర్చుంటారు. 12కానీ రాజ్యసంబంధులు బయట చీకటిలోకి త్రోసివేయబడతారు. అక్కడ ఏడ్వడం పండ్లు కొరకడం ఉంటాయి.”
13అప్పుడు యేసు శతాధిపతితో, “వెళ్లు. నీవు నమ్మినట్లే నీకు జరుగును గాక” అని చెప్పారు. ఆ క్షణమే అతని పనివాడు బాగయ్యాడు.
యేసు అనేకులను స్వస్థపరచుట
14తర్వాత యేసు పేతురు ఇంటికి వచ్చినప్పుడు జ్వరంతో పడుకుని ఉన్న పేతురు అత్తను చూసి, 15ఆయన ఆమె చేయిని ముట్టగానే జ్వరం ఆమెను వదిలిపోయి, ఆమె లేచి ఆయనకు సేవలు చేయడం మొదలుపెట్టింది.
16సాయంకాలమైనప్పుడు, దయ్యాలు పట్టిన చాలామందిని ఆయన దగ్గరకు తీసుకువచ్చారు. ఆయన ఒక్కమాటతో ఆ దయ్యాలను వెళ్లగొట్టి, రోగులందరిని బాగుచేశారు. 17యెషయా ప్రవక్త ద్వారా పలికిన:
“ఆయన మన బలహీనతలను తన మీద వేసుకుని,
మన రోగాలను భరించారు”#8:17 యెషయా 53:4
అనే మాటలు నెరవేరేలా ఇలా జరిగింది.
యేసును వెంబడించడానికి మూల్యం
18యేసు తన చుట్టూ ఉన్న జనసమూహాన్ని చూసి గలిలయ సరస్సు అవతలికి వెళ్దామని ఆదేశించారు. 19అప్పుడు ఒక ధర్మశాస్త్ర బోధకుడు ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో, “బోధకుడా, నీవు ఎక్కడికి వెళ్లినా నేను నిన్ను వెంబడిస్తాను” అన్నాడు.
20అందుకు యేసు, “నక్కలకు గుంటలు, ఆకాశపక్షులకు గూళ్లు ఉన్నాయి గాని మనుష్యకుమారునికి కనీసం తలవాల్చుకోడానికి స్ధలం లేదు” అని అతనికి జవాబిచ్చారు.
21ఆయన శిష్యులలో ఒకడు, “ప్రభువా, మొదట నేను వెళ్లి నా తండ్రిని పాతిపెట్టడానికి నన్ను వెళ్లనివ్వు” అని అన్నాడు.
22అందుకు యేసు అతనితో, “చనిపోయినవారు తమ చనిపోయినవారిని పాతిపెట్టుకుంటారు; నీవైతే నన్ను వెంబడించు” అన్నారు.
యేసు తుఫానును నిమ్మళింపజేయుట
23ఆ తర్వాత యేసు పడవ ఎక్కగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించారు. 24అప్పుడు అకస్మాత్తుగా సముద్రం మీద తీవ్రంగా తుఫాను రేగి సరస్సు మీదికి వచ్చి అలలు ఆ పడవను తాకాయి. అయితే యేసు నిద్రపోతున్నారు. 25శిష్యులు ఆయన దగ్గరకు వెళ్లి, “ప్రభువా, మేము మునిగిపోతున్నాం మమ్మల్ని కాపాడు” అంటూ ఆయనను లేపారు.
26అందుకు ఆయన, “అల్పవిశ్వాసులారా, మీరు ఎందుకంతగా భయపడుతున్నారు?” అని కోప్పడి లేచి గాలులను అలలను గద్దించారు. అప్పుడు అంతా ప్రశాంతంగా మారిపోయింది.
27వారందరు ఆశ్చర్యపడి, “ఈయన ఎలాంటి వాడు! గాలి అలలు కూడా ఈయనకు లోబడుతున్నాయి” అని చెప్పుకున్నారు.
దయ్యాలు పట్టిన ఇద్దరు పురుషులను యేసు స్వస్థపరచుట
28ఆయన గలిలయ అవతలి ఒడ్డున ఉన్న గదరేనీ ప్రాంతం చేరుకున్నప్పుడు దయ్యాలు పట్టిన ఇద్దరు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడ్డారు. వారు చాలా క్రూరంగా ప్రవర్తిస్తుండడంతో ఎవరూ ఆ దారిన వెళ్లలేకపోయారు. 29అవి ఆయనను చూసిన వెంటనే, “దేవుని కుమారుడా! మాతో నీకేమి? కాలం రాకముందే మమ్మల్ని వేధించడానికి వచ్చావా?” అని కేకలు వేశాయి.
30వారికి కొంత దూరంలో ఒక పెద్ద పందుల మంద మేస్తూ ఉంది. 31ఆ దయ్యాలు యేసును, “నీవు మమ్మల్ని బయటకు వెళ్లగొట్టాలనుకుంటే ఆ పందుల మందలోకి మమ్మల్ని పంపు” అని బ్రతిమాలాయి.
32ఆయన ఆ దయ్యాలతో, “వెళ్లండి!” అన్నారు. కాబట్టి అవి బయటకు వచ్చి ఆ పందులలోనికి చొరబడగా ఆ పందుల మంద మొత్తం ఎత్తైన ప్రదేశం నుండి వేగంగా సరస్సులోనికి పరుగెత్తుకుని వెళ్లి ఆ నీటిలో పడి చచ్చాయి. 33ఆ పందులను కాస్తున్నవారు పట్టణంలోకి పరుగెత్తుకుని వెళ్లి జరిగిందంతా అంటే దయ్యాలు పట్టిన వారికి జరిగిన దానితో సహా అన్ని విషయాలు చెప్పారు. 34అప్పుడు ఆ పట్టణమంతా యేసును చూడడానికి వెళ్లారు. వారు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు తమ ప్రాంతాన్ని విడిచిపొమ్మని ఆయనను బ్రతిమాలారు.

Uwcholeuo

Rhanna

Copi

None

Eisiau i'th uchafbwyntiau gael eu cadw ar draws dy holl ddyfeisiau? Cofrestra neu mewngofnoda