Logo YouVersion
Eicon Chwilio

జెకర్యా 11

11
1లెబానోనూ! అగ్ని వచ్చి నీ దేవదారు చెట్లను కాల్చివేయునట్లు,
నీ తలుపులు తీయి.
2సరళ వృక్షాల్లారా, రోదించండి! దేవదారు చెట్లు కూలిపోయాయి;
మహా వృక్షాలు నాశనమైపోయాయి!
బాషాను యొక్క సింధూర వృక్షాల్లారా, రోదించండి:
దట్టమైన అడవి నరకబడింది.
3గొర్రెల కాపరుల ఏడ్పు వినండి;
వారి శ్రేష్ఠమైన పచ్చికబయళ్లు నాశనమైపోయాయి!
సింహాల గర్జన వినండి;
యొర్దాను లోయలోని దట్టమైన అడవులు పాడైపోయాయి!
ఇద్దరు గొర్రెల కాపరులు
4నా దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: “వధకు సిద్ధంగా ఉన్న గొర్రెల మందకు కాపరిగా ఉండు. 5వాటిని కొనేవారు వాటిని వధించి శిక్ష పొందకుండా ఉన్నారు. వాటిని అమ్మేవారు, ‘యెహోవాకు స్తోత్రం, మాకు డబ్బు వచ్చింది!’ అని అంటారు. వాటి సొంత కాపరులే వాటి మీద జాలిపడరు. 6ఇకనుండి నేను ఈ దేశ ప్రజలపై కనికరం చూపించను. వారందరిని వారి పొరుగువారి చేతికి, వారి రాజు చేతికి నేను అప్పగిస్తాను. వారు దేశాన్ని పాడుచేస్తారు, నేను వారి చేతుల్లో నుండి ఎవరినీ విడిపించను” అని యెహోవా అంటున్నారు.
7కాబట్టి వధకు సిద్ధంగా ఉన్న గొర్రెల మందకు, ముఖ్యంగా మందలో బాధించబడిన వాటికి నేను కాపరిగా ఉన్నాను. రెండు కర్రలు పట్టుకుని కాపరిగా కాచాను. ఒక కర్రకు దయ అని, రెండవ కర్రకు బంధం అని పేరు పెట్టాను. 8ఒకే నెలలో నేను ముగ్గురు కాపరులను తీసివేశాను.
మంద నన్ను అసహ్యించుకుంది; నేను వారిని చూసి విసిగిపోయి, 9“నేను మీ కాపరిగా ఉండను. చచ్చేవారు చావవచ్చు, నశించేవారు నశించవచ్చు. మిగిలి ఉన్నవారు ఒకరి మాంసాన్ని ఒకరు తింటే తినవచ్చు” అన్నాను.
10తర్వాత నేను దేశాలన్నిటినితో చేసిన నిబంధనను రద్దు చేయడానికి దయ అనే కర్రను తీసుకుని దానిని విరిచాను. 11ఆ రోజు ఆ నిబంధన రద్దయింది కాబట్టి నేను చెప్పింది యెహోవా వాక్కు అని మందలోని అణచివేతకు గురై నా వైపు చూస్తున్నవారు తెలుసుకున్నారు.
12నేను వారితో, “మీకు మంచిదనిపిస్తే నా జీతం ఇవ్వండి; లేదంటే మానేయండి” అన్నాను. కాబట్టి వారు నాకు ముప్పై వెండి నాణేలు చెల్లించారు.
13అప్పుడు వారు నాకు చెల్లించిన దానిని కుమ్మరి దగ్గర పారవేయమని యెహోవా నాకు ఆజ్ఞాపించారు కాబట్టి నేను ఆ ముప్పై వెండి నాణేలు తీసుకుని యెహోవా మందిరంలో కుమ్మరికి పారవేశాను.
14తర్వాత యూదా వారికి, ఇశ్రాయేలు వారికి మధ్య ఉన్న సహోదర బంధాన్ని తెంచడానికి బంధమనే నా రెండవ కర్రను విరిచాను.
15అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నారు, “బుద్ధిలేని గొర్రెల కాపరి సామాగ్రిని మరల తీసుకో. 16ఎందుకంటే ఈ దేశంలో నేను నియమించబోయే కాపరి తప్పిపోయిన వాటిని పట్టించుకోడు, పిల్లలను వెదకడు, గాయపడ్డ వాటిని బాగు చేయడు, ఆరోగ్యకరమైన వాటిని పోషించడు, కాని క్రొవ్విన వాటి డెక్కలు చీల్చి వాటి మాంసాన్ని తింటాడు.
17“మందను విడిచిపెట్టిన
పనికిమాలిన కాపరికి శ్రమ!
ఖడ్గం అతని చేయి, కుడికన్నును నరుకుతుంది గాక!
అతని చేయి పూర్తిగా ఎండిపోవాలి,
అతని కుడికన్ను పూర్తిగా గ్రుడ్డిదవ్వాలి.”

Uwcholeuo

Rhanna

Copi

None

Eisiau i'th uchafbwyntiau gael eu cadw ar draws dy holl ddyfeisiau? Cofrestra neu mewngofnoda