లూకా సువార్త 18
18
పట్టు విడువని విధవరాలి ఉపమానం
1ఒక రోజు యేసు విసుగక ప్రార్థన చేస్తూ ఉండాలి అనే విషయాన్ని ఉపమానరీతిగా చెప్పారు: 2“ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతనికి దేవుని భయం లేదు, మనుష్యులను లెక్క చేసేవాడు కాడు. 3ఆ పట్టణంలో ఒక విధవరాలు అతని దగ్గరకు తరచుగా వస్తూ, ‘నా విరోధి విషయంలో నాకు న్యాయం తీర్చండి’ అని అడుగుతూ ఉండేది.
4“అతడు కొంతకాలం వరకు ఆమె మాటలను తిరస్కరించాడు కానీ, అతడు తనలో తాను, ‘నేను దేవునికి భయపడకపోయినా లేదా మనుష్యులను లక్ష్యపెట్టక పోయినా, 5ఈ విధవరాలు, “నాకు న్యాయం చేయండి” అని నన్ను తరచుగా తొందర పెడుతుంది, కాబట్టి ఆమె మాటిమాటికి వచ్చి నన్ను విసిగించకుండా, నేను ఆమెకు న్యాయం చేస్తాను’ అని అనుకున్నాడు.”
6కాబట్టి ప్రభువు దాని గురించి, “అన్యాయస్థుడైన న్యాయాధిపతి ఏమన్నాడో వినండి. 7దేవుడు తాను ఏర్పరచుకున్నవారు, దివారాత్రులు తనకు మొరపెడుతున్న వారికి న్యాయం చేయరా? వారికి న్యాయం చేయడంలో ఆలస్యం చేస్తారా? 8నేను చెప్పేది ఏంటంటే, ఆయన వారికి న్యాయం జరిగేలా చేస్తారు, అది కూడా అతిత్వరలో చేస్తారు. అయినా మనుష్యకుమారుడు వచ్చినప్పుడు, ఆయనకు భూమి మీద వారిలో విశ్వాసం కనిపిస్తుందా?” అని అడిగారు.
పన్ను వసూలు చేసేవాడు పరిసయ్యుని ఉపమానం
9తమ స్వనీతిని ఆధారం చేసుకుని ఇతరులను చిన్న చూపు చూసేవారితో యేసు ఈ ఉపమానం చెప్పారు: 10“ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్లారు. వారిలో ఒకడు పరిసయ్యుడు మరొకడు పన్నులు వసూలు చేసేవాడు. 11పరిసయ్యుడు నిలబడి తన గురించి ఇలా ప్రార్థించాడు: ‘దేవా, నేను దొంగలు, అన్యాయస్థులు వ్యభిచారుల వంటి ఇతరుల్లా కాని, ఈ పన్నులు వసూలు చేసేవాని వలె కాని లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. 12నేను వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటాను, నా సంపాదనలో పదవ భాగం ఇస్తాను.’
13“అయితే పన్నులు వసూలు చేసేవాడు దూరంగా నిలబడి, తలను పైకెత్తి చూడడానికి కూడా ధైర్యం చాలక, రొమ్ము కొట్టుకొంటూ, ‘దేవా, నేను పాపిని, నన్ను కరుణించు’ అని వేడుకొన్నాడు.
14“నేను మీతో చెప్పేది ఏంటంటే, పరిసయ్యుని కంటే పన్నులు వసూలు చేసేవాడే దేవుని ఎదుట నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్లాడు. ఎందుకంటే తమను తాము హెచ్చించుకొనేవారు తగ్గించబడతారు. తమను తాము తగ్గించుకునేవారు హెచ్చింపబడతారు.”
యేసు చిన్న పిల్లలు
15కొందరు తల్లితండ్రులు తమ పసిపిల్లలపై యేసు తన చేతులుంచి వారిని ఆశీర్వదించాలని ఆయన దగ్గరకు తీసుకుని వస్తున్నారు. అయితే ఆయన శిష్యులు అది చూసి వారిని గద్దించారు. 16కానీ యేసు పిల్లలను తన దగ్గరకు పిలిచి తన శిష్యులతో, “చిన్న పిల్లలను నా దగ్గరకు రానివ్వండి, వారిని ఆటంకపరచకండి, ఎందుకంటే దేవుని రాజ్యం ఇలాంటి వారిదే” అని చెప్పారు. 17“ఎవరైనా చిన్నపిల్లల్లా దేవుని రాజ్యాన్ని స్వీకరించకపోతే, ఎన్నటికి దానిలో ప్రవేశించరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అని అన్నారు.
ధనం దేవుని రాజ్యం
18ఒక అధికారి యేసుతో, “మంచి బోధకుడా, నిత్యజీవం పొందుకోవాలంటే నేనేమి చేయాలి?” అని అడిగాడు.
19అందుకు యేసు, “నీవు నన్ను ఎందుకు మంచివాడనని పిలుస్తున్నావు? దేవుడు తప్ప మంచివారు ఎవ్వరూ లేరు. 20మీకు ఆజ్ఞలు తెలుసు: ‘వ్యభిచారం చేయకూడదు, హత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధసాక్ష్యం చెప్పకూడదు, మీ తండ్రిని తల్లిని గౌరవించాలి’ ”#18:20 నిర్గమ 20:12-16; ద్వితీ 5:16-20 అని అన్నారు.
21అందుకు ఆ అధికారి, “చిన్నప్పటి నుండి నేను వీటిని పాటిస్తూనే ఉన్నాను” అన్నాడు.
22యేసు అతడు చెప్పింది విని వానితో, “అయినా నీలో ఒక కొరత ఉంది. నీకున్న ఆస్తి అంతా అమ్మి పేదవారికి పంచిపెట్టు, అప్పుడు పరలోకంలో నీవు ధనం కలిగి ఉంటావు. తర్వాత వచ్చి, నన్ను వెంబడించు” అని చెప్పారు.
23అయితే ఆ మాట విని, విచారంగా వెళ్లిపోయాడు, ఎందుకంటే అతడు గొప్ప ఆస్తిగలవాడు. 24-25యేసు అతన్ని చూసి అతనితో, “ఒక ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది రంధ్రం గుండా దూరడం సులభం” అని చెప్పారు.
26ఇది విన్న వారు, “అయితే మరి ఎవరు రక్షణ పొందగలరు?” అని అడిగారు.
27అందుకు యేసు, “మనుష్యులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యం” అని జవాబిచ్చాడు.
28పేతురు ఆయనతో, “మేము మాకు కలిగిన వాటన్నిటిని విడిచి నిన్ను వెంబడించాము” అన్నాడు.
29-30అందుకు యేసు వారితో, “నేను మీతో నిజంగా చెప్తున్నాను, దేవుని రాజ్యం కోసం తన ఇంటిని, భార్యను, సహోదరులను, సహోదరీలను, తల్లిదండ్రులను, పిల్లలను విడిచిపెట్టిన వారు ఈ యుగంలో చాలారెట్లు పొందుకోవడమే కాక, రానున్న యుగంలో నిత్యజీవాన్ని కూడా తప్పక పొందుకొంటాడు” అని వారితో అన్నారు.
మూడవసారి తన మరణాన్ని గురించి ముందే చెప్తున్న యేసు
31యేసు తన పన్నెండుమంది శిష్యులను ప్రక్కకు తీసుకెళ్లి, “రండి, మనం యెరూషలేముకు వెళ్తున్నాం, మనుష్యకుమారుని గురించి ప్రవక్తలు వ్రాసిన మాటలన్నీ నెరవేరుతాయి. 32వారు ఆయనను యూదేతరుల చేతికి అప్పగిస్తారు. వారు ఆయనను అపహసించి, ఆయన మీద ఉమ్మివేసి ఆయనను అవమానపరుస్తారు. 33వారు ఆయనను కొరడాలతో కొట్టి చంపేస్తారు. కానీ మూడవ రోజున ఆయన తిరిగి లేస్తాడు” అని చెప్పారు.
34ఆయన చెప్పిన ఈ మాటల్లో శిష్యులు ఏది గ్రహించలేదు. దాని అర్థం వారికి మరుగు చేయబడింది కాబట్టి ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడో వారికి తెలియలేదు.
గ్రుడ్డి భిక్షగానికి చూపునిచ్చిన యేసు
35యేసు యెరికో పట్టణ సమీపంలో ఉన్నపుడు, ఒక గ్రుడ్డివాడు దారి ప్రక్కన కూర్చుని భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. 36జనసమూహం వెళ్తుందని వాడు విని, “ఆ సందడేంటి?” అని అడిగాడు. 37“నజరేతువాడైన యేసు ఈ దారిలో వెళ్తున్నాడు” అని వారు జవాబిచ్చారు.
38అందుకతడు బిగ్గరగా, “యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించు!” అని కేకలు వేశాడు.
39ఆ దారిలో వెళ్లేవారు వాన్ని గద్దించారు, నిశ్శబ్దంగా ఉండమని వానికి చెప్పారు. కాని వాడు, “దావీదు కుమారుడా, నన్ను కరుణించు!” అని ఇంకా బిగ్గరగా కేకలు వేశాడు.
40తర్వాత యేసు నిలబడి, వానిని తన దగ్గరకు తీసుకుని రమ్మన్నాడు. వాడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు యేసు వానితో, 41“నేను నీకు ఏమి చేయాలని కోరుతున్నావు?” అని అడిగారు.
“ప్రభువా, నాకు చూపు కావాలి!” అని వాడు అన్నాడు.
42యేసు వానితో, “నీవు చూపును పొందుకో; నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది!” అన్నారు. 43వెంటనే వాడు చూపు పొందుకొని, దేవుని స్తుతిస్తూ యేసును వెంబడించాడు. ప్రజలందరు ఇది చూసి, వారు కూడా దేవునిని స్తుతించారు.
Trenutno odabrano:
లూకా సువార్త 18: TSA
Istaknuto
Podijeli
Kopiraj
Želiš li svoje istaknute stihove spremiti na sve svoje uređaje? Prijavi se ili registriraj
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.