యోహాను 6

6
1అటుతరువాత యేసు తిబెరియ సముద్రము, అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్లెను. 2రోగుల యెడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. 3యేసు కొండయెక్కి అక్కడ తన శిష్యులతోకూడ కూర్చుండెను. 4అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను. 5కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తనయొద్దకు వచ్చుట చూచి–వీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలుకొని తెప్పింతుమని ఫిలిప్పు నడిగెను గాని 6యేమి చేయనై యుండెనో తానే యెరిగియుండి అతనిని పరీక్షించుటకు ఆలాగడిగెను. 7అందుకు ఫిలిప్పు–వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను రెండువందల దేనారముల#6:7 ఒక దేనారము ఇంచుమించు అర్ధరూపాయి కావచ్చును. రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. 8ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ 9–ఇక్కడ ఉన్న యొక చిన్నవానియొద్ద అయిదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని, యింత మందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా 10యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాల పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు అయిదువేలమంది పురుషులు కూర్చుండిరి. 11యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్నవారికి వడ్డించెను. ఆలాగున చేపలు కూడ వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను; 12వారు తృప్తిగా తినిన తరువాత ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయుడని తన శిష్యులతో చెప్పెను. 13కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన అయిదు యవలరొట్టెల ముక్కలు పోగుచేసి పండ్రెండు గంపలు నింపిరి. 14ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచి–నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి.
15రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు ఎరిగి, మరల కొండకు ఒంటరిగా వెళ్లెను.
16సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రము నొద్దకు వెళ్లి దోనె యెక్కి సముద్రపుటద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండిరి. 17అంతలో చీకటాయెను గాని యేసు వారియొద్దకు ఇంకను రాలేదు. 18అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. 19వారు ఇంచుమించు రెండు కోసుల దూరము దోనెను నడిపించిన తరువాత, యేసు సముద్రముమీద నడుచుచు తమ దోనెదగ్గరకు వచ్చుట చూచి భయపడిరి; 20అయితే ఆయన నేనే, భయపడకుడని వారితో చెప్పెను. 21కనుక ఆయనను దోనెమీద ఎక్కించుకొనుటకు వారిష్టపడిరి. వెంటనే ఆ దోనె వారు వెళ్లుచున్న ప్రదేశమునకు చేరెను.
22మరునాడు సముద్రపుటద్దరిని నిలిచియున్న జనసమూహము వచ్చి చూడగా, ఒక చిన్న దోనె తప్ప అక్కడ మరియొకటి లేదనియు, యేసు తన శిష్యులతోకూడ దోనె ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్లిరనియు తెలిసికొనిరి. 23అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబెరియనుండి వేరే చిన్న దోనెలు వచ్చెను. 24కాబట్టి యేసును ఆయన శిష్యులును అక్కడ లేకపోవుట జనసమూహము చూచి నప్పుడు వారా చిన్న దోనెలెక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చిరి. 25సముద్రపుటద్దరిని ఆయనను కనుగొని–బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా 26యేసు –మీరు సూచనలను చూచుటవలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుటవలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 27క్షయమైన ఆహారముకొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారముకొరకే కష్టపడుడి; మనుష్యకుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రియైన దేవుడు ఆయనకు ముద్రవేసియున్నాడని చెప్పెను. 28వారు–మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయనను అడుగగా 29యేసు–ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను. 30వారు–అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు? ఏమి జరిగించుచున్నావు? 31భుజించుటకు పరలోకమునుండి ఆయన ఆహారము వారికి అను గ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. 32కాబట్టి యేసు–పరలోకమునుండి వచ్చు ఆహారము మోషే మీకియ్యలేదు, నా తండ్రియే పరలోకమునుండి వచ్చు నిజమైన ఆహారము మీకనుగ్రహించుచున్నాడు. 33పరలోకమునుండి దిగి వచ్చి, లోకమునకు జీవము నిచ్చునది దేవుడనుగ్రహించు ఆహారమై యున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. 34కావునవారు–ప్రభువా, యీ ఆహారము ఎల్లప్పుడును మాకు అనుగ్రహించుమనిరి. 35అందుకు యేసు వారితో ఇట్లనెను–జీవాహారము నేనే; నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నాయందు విశ్వాసముంచు వాడు ఎప్పుడును దప్పిగొనడు. 36మీరు నన్ను చూచి యుండియు విశ్వసింపక యున్నారని మీతో చెప్పితిని. 37తండ్రి నాకు అనుగ్రహించువారందరును నాయొద్దకు వత్తురు; నాయొద్దకు వచ్చువానిని నేనెంతమాత్రమును బయటికి త్రోసివేయను. 38నా యిష్టమును నెరవేర్చు కొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని. 39ఆయన నాకు అనుగ్రహించిన దాని యంతటిలో నేనేమియు పోగొట్టుకొనక, అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమైయున్నది. 40కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును.
41కాబట్టి నేను పరలోకమునుండి దిగి వచ్చిన ఆహార మని ఆయన చెప్పినందున యూదులు ఆయననుగూర్చి సణుగుకొనుచు–ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? 42ఈయన తలిదండ్రులను మన మెరుగుదుము గదా? –నేను పరలోకమునుండి దిగి వచ్చియున్నానని ఈయన ఏలాగు చెప్పుచున్నాడనిరి. 43అందుకు యేసు–మీలో మీరు సణుగుకొనకుడి; 44నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు; అంత్యదినమున నేను వానిని లేపుదును. 45–వారందరును దేవునిచేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడియున్నది గనుక తండ్రివలన విని నేర్చుకొనిన ప్రతివాడును నాయొద్దకు వచ్చును. 46దేవుని యొద్దనుండి వచ్చినవాడు తప్ప మరి యెవడును తండ్రిని చూచియుండలేదు; ఈయనే తండ్రిని చూచియున్నవాడు. 47-49విశ్వసించువాడే నిత్యజీవముగలవాడు. జీవాహారము నేనే. మీపితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. 50దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకమునుండి దిగివచ్చిన ఆహారమిదే. 51పరలోకమునుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును; మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవముకొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
52యూదులు–ఈయన తన శరీరమును ఏలాగు తిన నియ్యగలడని యొకనితో ఒకడు వాదించిరి. 53కావున యేసు ఇట్లనెను–మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవముగలవారు కారు. 54నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడే నిత్యజీవముగలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును. 55నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై యున్నది. 56నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము. 57జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. 58ఇదే పర లోకమునుండి దిగివచ్చిన ఆహారము; పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు; ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడును జీవించునని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాననెను 59ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజమందిరములో ఈ మాటలు చెప్పెను.
60ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని–యిది కఠినమైన మాట, యిది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. 61యేసు తన శిష్యులు దీనినిగూర్చి సణుగుకొనుచున్నారని తనకుతానే యెరిగి వారితో ఇట్లనెను–దీనివలన మీరు అభ్యంతరపడుచున్నారా? 62ఆలాగైతే మనుష్యకుమారుడుమునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచినయెడల ఏమందురు? 63ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్‌ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునైయున్నవి గాని 64మీలో విశ్వసించనివారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వసించనివారెవరో, తన్ను ప్పగింపబోవువాడెవడో, మొదటినుండి యేసునకు తెలియును. 65మరియు ఆయన –తండ్రిచేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నాయొద్దకు రాలేడని యీ హేతువునుబట్టి మీతో చెప్పితిననెను.
66అప్పటినుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకతీసి, మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు. 67కాబట్టి యేసు–మీరు కూడ వెళ్లిపోవలెనని యున్నారా? అని పండ్రెండుమందిని అడుగగా 68సీమోను పేతురు– ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు; 69నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి యెరిగియున్నామని ఆయనతో చెప్పెను. 70అందుకు యేసు–నేను మిమ్మును పండ్రెండుగురిని ఏర్పరచు కొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. 71సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా పండ్రెండు మందిలో ఒకడైయుండి ఆయన నప్పగింపబోవు చుండెను గనుక వానిగూర్చియే ఆయన ఈ మాట చెప్పెను.

Pati Souliye

Pataje

Kopye

None

Ou vle gen souliye ou yo sere sou tout aparèy ou yo? Enskri oswa konekte

YouVersion sèvi ak cookies pou pèsonalize eksperyans ou. Lè w sèvi ak sit entènèt nou an, ou aksepte itilizasyon cookies yo jan sa dekri nan Règleman sou enfòmasyon privenou an