లూకా 11
11
ప్రార్థన నమూనా
1ఆయన ఒకసారి ఒక చోట ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన ముగించిన తరువాత ఆయన శిష్యుల్లో ఒకడు, “ప్రభూ, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకు కూడా ప్రార్థన చేయడం నేర్పించు” అని ఆయనను అడిగాడు. 2అందుకు ఆయన, “మీరు ప్రార్థన చేసేటప్పుడు, ‘పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ నామం పవిత్రంగా ఎంచబడు గాక, నీ రాజ్యం వచ్చుగాక, 3మాకు కావలసిన అనుదిన ఆహారం ప్రతిరోజూ మాకు దయచెయ్యి, 4మాకు వ్యతిరేకంగా ఎవరైనా చేసిన అపరాధాలు మేము క్షమిస్తూ ఉన్నాం గనక మా పాపాలనూ క్షమించు. మమ్మల్ని పరీక్షలోకి తీసుకు వెళ్ళకు’ అని పలకండి” అని చెప్పాడు.
వదలకుండా అడిగిన మిత్రుడు
5తరువాత ఆయన వారితో ఇలా అన్నాడు. “మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉన్నాడనుకోండి. అర్థరాత్రి వేళ ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, ‘మిత్రమా, నాకు మూడు రొట్టెలు బదులివ్వు. 6నా స్నేహితుడు ప్రయాణం చేస్తూ దారిలో నా దగ్గరికి వచ్చాడు. అతనికి పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు’ అని చెప్పారనుకోండి. 7అతడు లోపలే ఉండి, ‘నన్ను తొందర పెట్టవద్దు. తలుపు వేసేశాను. చిన్న పిల్లలు నిద్ర పోతున్నారు. నేను లేచి ఇవ్వలేను’ అని చెబుతాడా?
8 మీరు తన స్నేహితుడని కాకపోయినా సిగ్గు విడిచి అదేపనిగా అడగడం వల్లనైనా లేచి కావలసినవన్నీ ఇస్తాడని మీకు చెబుతున్నాను. 9అలాగే మీరు కూడా దేవుణ్ణి అడగండి, ఆయన ఇస్తాడు. వెదకండి, మీకు దొరుకుతుంది. తలుపు తట్టండి. మీకు తెరుచుకుంటుంది. 10అడిగే ప్రతి వ్యక్తికీ లభిస్తుంది. వెదికే వాడికి దొరుకుతుంది. తట్టేవాడికి తలుపు తెరుచుకుంటుందని మీకు చెబుతున్నాను.
తండ్రి నైజం
11 “మీలో ఎవరైనా ఒక తండ్రి తన కొడుకు చేపకోసం అడిగితే చేపకు బదులుగా పామును ఇస్తాడా? 12గుడ్డు అడిగితే తేలునిస్తాడా? 13కాబట్టి మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకు మంచి విషయాలనే ఇవ్వాలని అనుకుంటుంటే పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగే వారికి పరిశుద్ధాత్మను కచ్చితంగా అనుగ్రహిస్తాడు కదా” అని చెప్పాడు.
దయ్యాల రాజు సాయంతో యేసు దయ్యాలు వెళ్ళగొడుతున్నాడని నీలాపనింద
మత్తయి 12:22-37
14ఒకసారి ఆయన ఒక మూగ దయ్యాన్ని వెళ్ళగొడుతూ ఉన్నాడు. ఆ దయ్యం వదలిపోయిన తరవాత ఆ మూగవాడు మాట్లాడాడు. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలంతా ఆశ్చర్యపోయారు. 15అయితే వారిలో కొందరు, “వీడు దయ్యాలకు నాయకుడైన బయెల్జెబూలు సహాయంతో దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు” అని చెప్పుకున్నారు.
16మరి కొందరు ఆయనను పరీక్షిస్తూ పరలోకం నుండి ఒక సూచన చూపించమని ఆయనను అడిగారు. 17ఆయనకు వారి ఆలోచనలన్నీ తెలుసు. ఆయన వారితో ఇలా అన్నాడు, “తనకు తానే వ్యతిరేకంగా వేరైపోయిన ఏ రాజ్యమైనా నశించి పోతుంది. తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోతుంది. 18సాతాను కూడా తనకు తానే వ్యతిరేకంగా వేరైపోతే వాడి రాజ్యం ఎలా నిలుస్తుంది? 19నేను బయెల్జెబూలు సహాయంతో దయ్యాలను వెళ్ళగొడుతున్నానని మీరు అంటున్నారే, మరి మీ అనుచరులు వాటిని ఎవరి సహాయంతో వెళ్ళగొడుతున్నారు? దీని వలన మీ సంతానమే మీకు తీర్పు తీరుస్తారు. 20అయితే నేను దేవుని వేలితో దయ్యాలను వెళ్ళగొడుతుంటే దాని అర్థం, దేవుని రాజ్యం కచ్చితంగా మీ దగ్గరికి వచ్చిందనే. 21బలవంతుడు ఆయుధాలు ధరించుకుని, తన ఆవరణలో కాపలా కాస్తే అతని సొత్తు భద్రంగా ఉంటుంది. 22అయితే అతని కంటే బలవంతుడైన వాడు అతణ్ణి ఎదిరించి ఓడించినప్పుడు అతడు నమ్ముకున్న ఆయుధాలన్నిటినీ బలవంతంగా తీసుకుని అతని ఆస్తినంతా దోచుకుంటాడు. 23నా వైపు ఉండని వాడు నాకు విరోధి. నాతో కలసి పోగుచెయ్యని వాడు చెదరగొట్టే వాడే.
తనను తాను సంస్కరించుకునే ప్రయత్నం
మత్తయి 12:43, 45
24 “అపవిత్రాత్మ ఒక వ్యక్తిని వదిలిపోయిన తరవాత విశ్రాంతి కోసం వెతుకుతూ నీరు లేని చోట్ల తిరుగుతూ ఉంటుంది. దానికెక్కడా విశ్రాంతి దొరకదు. అందుకని అది ‘నా పాత ఇంటికే మళ్ళీ వెళతాను’ అనుకుంటుంది. 25అది వచ్చి, ఆ ఇల్లు ఊడ్చి, అమర్చి ఉండడం చూసి 26తిరిగి వెళ్ళి, తన కంటే చెడ్డవైన మరో ఏడు అపవిత్రాత్మలను వెంటబెట్టుకువస్తుంది. అవి ఆ ఇంట్లో చొరబడి ఇక అక్కడే నివాసముంటాయి. కాబట్టి ఆ వ్యక్తి చివరి దశ మొదటి దశ కంటే అధ్వాన్నంగా ఉంటుంది” అని చెప్పాడు.
27ఆయన ఈ మాటలు చెబుతూ ఉండగా ఆ జన సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూసి బిగ్గరగా, “నిన్ను మోసిన గర్భం, నువ్వు పాలు తాగిన స్తనాలూ ధన్యం” అని కేకలు వేసి చెప్పింది. 28దానికి ఆయన, “అది నిజమే కానీ దేవుని మాట విని దాని ప్రకారం జీవించేవారు ఇంకా ధన్యులు” అని చెప్పాడు.
యోనా సూచన
మత్తయి 12:39-42
29ప్రజలంతా గుంపులుగా ఉన్నప్పుడు ఆయన వారికి ఇలా చెప్పాడు, “ఈ తరం చెడ్డది. వీరు సూచన అడుగుతున్నారు. అయితే యోనా సూచన తప్పించి మరి ఏ సూచనా వీరికి చూపడం జరగదు. 30యోనా నీనెవె పట్టణ వాసులకు ఎలా సూచనగా ఉన్నాడో ఆలాగే మనుష్య కుమారుడు ఈ తరానికి సూచనగా ఉంటాడు.
31 దక్షిణ దేశం రాణి తీర్పు రోజున ఈ తరం వారితో నిలబడి వీరి మీద నేరం మోపుతుంది. ఆమె సొలొమోను జ్ఞాన వాక్కులు వినడానికి సుదూర దేశం నుండి వచ్చింది. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
32 నీనెవె ప్రజలు తీర్పు రోజున ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరం మోపుతారు. ఎందుకంటే వారు యోనా బోధ విని మారుమనస్సు పొందారు. యోనా కంటే ఘనుడు ఇక్కడ ఉన్నాడు.
వెలిగించిన దీపం ఉపమానం
మత్తయి 5:15, 16; మార్కు 4:21, 22; లూకా 8:16
33 “ఎవరూ దీపాన్ని వెలిగించి చాటుగానో బుట్ట కిందనో పెట్టరు, లోపలికి వచ్చేవారికి వెలుగు కనబడాలని దీపస్తంభం పైనే పెడతారు. 34నీ దేహానికి దీపం నీ కన్నే. నీ కన్ను మంచిదైతే నీ శరీరమంతా వెలుగు ఉంటుంది. నీ కన్ను చెడిపోతే నీ దేహం చీకటి మయమై ఉంటుంది.
35 కాబట్టి నీలో ఉన్న వెలుగు చీకటి కాకుండా చూసుకో. 36నీ దేహంలో ఏ భాగమూ చీకటిలో లేకుండా నీ దేహం అంతా వెలుగే ఉన్నట్టయితే, దీపం కాంతి నీపై ప్రసరించినప్పుడు ఎలా ఉంటుందో అలాగే దేహం అంతా వెలుగుమయమై ఉంటుంది.”
37ఆయన మాట్లాడుతూ ఉండగా ఒక పరిసయ్యుడు తనతో కలసి భోజనం చేయమని ఆయనను ఆహ్వానించాడు. ఆయన అతనితో లోపలికి వెళ్ళి భోజనం వరసలో కూర్చున్నాడు. 38ఆయన భోజనానికి ముందు కాళ్ళు, చేతులు కడుక్కోకపోవడం చూసి ఆ పరిసయ్యుడు ఆశ్చర్యపోయాడు.
యేసు పరిసయ్యులను తీవ్రంగా విమర్శించడం
మత్తయి 23:13-35
39అది చూసి ప్రభువిలా అన్నాడు, “పరిసయ్యులైన మీరు పాత్రనూ పళ్ళేన్నీ బయట శుభ్రం చేస్తారు గానీ మీ అంతరంగం మాత్రం దోపిడీతో, చెడుతనంతో నిండి ఉంది.
40 అవివేకులారా, బయటి భాగాన్ని చేసినవాడే లోపలి భాగాన్ని కూడా చేశాడు కదా! 41మీకు ఉన్నవాటిని పేదలకు ధర్మం చేయండి. అప్పుడు మీకు అన్నీ శుభ్రంగా ఉంటాయి.
42 అయ్యో పరిసయ్యులారా, మీకు యాతన. మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి ఆకు కూరలోనూ పదోభాగం దేవునికి చెల్లిస్తారు గానీ దేవుని ప్రేమనూ, న్యాయాన్నీ వదిలేస్తున్నారు. మిగిలిన వాటిని చేస్తూనే న్యాయంగా నడుచుకోవాలి, దేవుణ్ణి ప్రేమించాలి.
43 అయ్యో పరిసయ్యులారా, మీకు యాతన, మీరు సమాజ మందిరాల్లో అగ్ర స్థానాలూ, వ్యాపార వీధుల్లో ప్రజల నుండి వందనాలూ కోరుకుంటారు. 44అయ్యో, మీరు కనిపించని సమాధుల్లా ఉన్నారు. అవి సమాధులని తెలియని మనుషులు వాటి మీదే నడుస్తారు.”
యేసు ధర్మశాస్త్రులను తీవ్రంగా విమర్శించడం
45అప్పుడు ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు, “బోధకుడా. ఇలా చెప్పి మమ్మల్ని కూడా నిందిస్తున్నావు” అని ఆయనతో అన్నాడు.
46అందుకు యేసు, “అయ్యో, ధర్మశాస్త్ర ఉపదేశకులారా, మీకు యాతన. మీరు మనుషులపై మోయలేని బరువులు మోపుతారు. మీరు మాత్రం ఒక వేలితో కూడా ఆ బరువులను తాకరు.
47 అయ్యో, మీకు యాతన, మీ పూర్వీకులు ప్రవక్తలను చంపారు. మీరు చనిపోయిన ప్రవక్తల సమాధులను కట్టిస్తున్నారు. 48దీన్నిబట్టి మీరు సాక్షులై మీ పూర్వీకులు చేసిన పనులకు సమ్మతి తెలుపుతున్నారు. వారు ప్రవక్తలను చంపారు. మీరు సమాధులు కడుతున్నారు. ఈ కారణం చేత దేవుని జ్ఞానం చెప్పేదేమిటంటే, ‘నేను వారి దగ్గరికి ప్రవక్తలనూ, అపొస్తలులనూ పంపుతాను. 49వారు కొంత మందిని చంపుతారు. కొంతమందిని హింసిస్తారు.’ 50-51కాబట్టి లోకారంభం నుండీ అంటే హేబెలు రక్తం నుండి బలిపీఠానికీ దేవాలయానికీ మధ్య హతమైన జెకర్యా రక్తం వరకూ చిందిన ప్రవక్తలందరి రక్తం కోసం ఈ తరం వారిపై విచారణ జరుగుతుందని మీకు కచ్చితంగా చెబుతున్నాను.
52 అయ్యో, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే మీరు జ్ఞానం తాళం చెవిని తీసుకు పోయారు. మీరు లోపల ప్రవేశించరు. ప్రవేశించే వారిని అడ్డుకుంటారు” అని చెప్పాడు.
53-54ఆయన అక్కడ నుండి వెళ్ళి పోయిన తరువాత ధర్మశాస్త్ర పండితులూ పరిసయ్యులూ ఆయన మీద పగ పట్టి ఆయన మీద నేరం మోపడానికై ఆయన మాటల్లో తప్పు పట్టుకోడానికి చూస్తూ ఆయనతో వాదిస్తూ వచ్చారు.
Селектирано:
లూకా 11: IRVTel
Нагласи
Сподели
Копирај

Дали сакаш да ги зачуваш Нагласувањата на сите твои уреди? Пријави се или најави се
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.