ఆదికాండము 6

6
1నరులు భూమిమీద విస్తరింప నారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు 2దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సువచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి. 3అప్పుడు యెహోవా–నా ఆత్మ నరులతో ఎల్లప్పుడును వాదించదు; వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై#6:3 శారీరులు. యున్నారు; అయినను వారి దినములు నూట ఇరువది యేండ్లగుననెను. 4ఆ దినములలో నెఫీలులను#6:4 బలాత్కారులు. వారు భూమి మీదనుండిరి; తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వ కాలమందు పేరు పొందిన శూరులు వీరే. 5నరుల చెడు తనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయముయొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి 6తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. 7అప్పుడు యెహోవా–నేను సృజించిన నరులును నరులతోకూడ జంతువులును పురుగులును ఆకాశ పక్ష్యాదులును భూమిమీద నుండకుండ తుడిచివేయుదును; ఏలయనగా నేను వారిని సృష్టించినం దుకు సంతాపము నొందియున్నాననెను. 8అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను.
9నోవహు వంశావళి యిదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితోకూడ నడచినవాడు. 10షేము, హాము, యాపెతను ముగ్గురు కుమారులను నోవహు కనెను. 11భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను; భూలోకము బలాత్కారముతో నిండియుండెను. 12దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి యుండెను; భూమిమీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని యుండిరి.
13దేవుడు నోవహుతో–సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది; ఇదిగో వారిని భూమితోకూడ నాశనము చేయుదును. 14చితిసారకపు మ్రానుతో నీకొరకు ఓడను చేసికొనుము. అరలుపెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. 15నీవు దాని చేయవలసిన విధమిది; ఆ ఓడ మూడువందల మూరల పొడుగును ఏబది మూరల వెడల్పును ముప్పది మూరల యెత్తును గలదై యుండవలెను. 16ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాని ముగించవలెను; ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను; క్రింది అంతస్థు రెండవ అంతస్థు మూడవ అంతస్థు గలదిగా దాని చేయవలెను. 17ఇదిగో నేనే జీవ వాయువుగల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండ నాశము చేయుటకు భూమిమీదికి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చని పోవును; 18అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును; నీవును నీతోకూడ నీ కుమారులును నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. 19మరియు నీతోకూడ వాటిని బ్రదికించి యుంచుకొనుటకు సమస్త జీవులలో, అనగా సమస్త శరీరులయొక్క ప్రతి జాతిలో నివి రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలెను; వాటిలో మగదియు ఆడుదియు నుండవలెను. 20నీవు వాటిని బ్రదికించి యుంచుకొనుటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోను, ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. 21మరియు తినుటకు నానావిధములైన ఆహారపదార్థములను కూర్చుకొని నీదగ్గర ఉంచుకొనుము; అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను. 22నోవహు అట్లు చేసెను; దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను.

Highlight

Kongsi

Salin

None

Ingin menyimpan sorotan merentas semua peranti anda? Mendaftar atau log masuk