యోహాను 15
15
1నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవ సాయకుడు. 2నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును; ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును. 3నేను మీతో చెప్పిన మాటనుబట్టి మీరిప్పుడు పవిత్రులై యున్నారు. 4నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి యుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నాయందు నిలిచియుంటేనేకాని మీరును ఫలిం పరు. 5ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు. 6ఎవడైనను నాయందు నిలిచియుండని యెడల వాడు తీగెవలె బయట పారవేయబడి యెండిపోవును; మనుష్యులు అట్టివాటిని పోగుచేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. 7నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. 8మీరు బహుగా ఫలించుటవలన నా తండ్రి మహిమపరచబడును; ఇందువలన మీరు నా శిష్యులగుదురు. 9తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును ఆలాగు ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచి యుండుడి. 10నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనినయెడల నా ప్రేమయందు నిలిచి యుందురు. 11మీయందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు, ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. 12నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీ రొకని నొకడు ప్రేమించ వలెననుటయే నా ఆజ్ఞ 13తన స్నేహితులకొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు. 14నేను మీ కాజ్ఞాపించువాటినిచేసినయెడల, మీరు నా స్నేహితులైయుందురు. 15దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రివలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసితిని. 16మీరు నన్ను ఏర్పరచుకొనలేదు; మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకనుగ్రహించునట్లు మీరు వెళ్లి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. 17మీరు ఒకనినొకడు ప్రేమింపవలెనని యీ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. 18లోకము మిమ్మును ద్వేషించినయెడల మీకంటె ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు. 19మీరు లోక సంబంధులైనయెడల లోకము తన వారిని స్నేహించును; అయితే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములోనుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. 20– దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడని నేను మీతో చెప్పినమాట జ్ఞాపకము చేసికొనుడి. లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు; నా మాట గైకొనినయెడల, మీ మాట కూడ గైకొందురు. 21అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటినన్నిటిని మీకు చేయుదురు. 22నేను వచ్చి వారికి బోధింపకుండినయెడల, వారికి పాపము లేకపోవును; ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు. 23నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడ ద్వేషించుచున్నాడు. 24ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండినయెడల వారికి పాపము లేకపోవును; ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించియున్నారు. 25అయితే
–నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి
అని వారి ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాక్యము నెర వేరునట్లు ఈలాగు జరిగెను. 26తండ్రియొద్దనుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త,#15:26 లేక, ఉత్తరవాది. అనగా తండ్రి యొద్దనుండి బయలుదేరు సత్యస్వరూపియైన ఆత్మ వచ్చి నప్పుడు ఆయన నన్నుగూర్చి సాక్ష్యమిచ్చును. 27మీరు మొదటనుండి నాయొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు.
Terpilih Sekarang Ini:
యోహాను 15: TELUBSI
Highlight
Kongsi
Salin
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapistaging.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fms.png&w=128&q=75)
Ingin menyimpan sorotan merentas semua peranti anda? Mendaftar atau log masuk
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.