Logótipo YouVersion
Ícone de pesquisa

ఆదికాండము 16

16
పనిపిల్ల హాగరు
1అబ్రాము భార్య శారయి. ఆమెకు, అబ్రాముకు పిల్లలు లేరు. శారయికి ఈజిప్టుకు చెందిన పని పిల్ల ఉంది. ఆమె పేరు హాగరు. 2శారయి అబ్రాముతో యిలా చెప్పింది: “చూడండి, నాకు పిల్లలు పుట్టకుండా చేశాడు యెహోవా. కనుక మీరు నా పనిమనిషితో పొండి. ఆమె ద్వారా పుట్టే శిశువును నా స్వంత శిశువుగా నేను స్వీకరిస్తాను.” తన భార్య శారయి మాట అబ్రాము విన్నాడు.
3కనాను దేశంలో అబ్రాము పది సంవత్సరాలు జీవించిన తర్వాత ఇది జరిగింది. హాగరును తన భర్త అబ్రాముకు శారయి యిచ్చింది. (హాగరు ఈజిప్టు నుండి వచ్చిన దాసి).
4అబ్రాము వల్ల హాగరు గర్భవతి అయింది. హాగరు ఇది గమనించినప్పుడు. ఆమె చాలా గర్వపడి, తన యజమానురాలైన శారయికంటే తాను గొప్పదాన్ని అని తలంచడం మొదలు పెట్టింది. 5అయితే శారయి అబ్రాముతో, “నా పనిమనిషి ఇప్పుడు నన్నే అసహ్యించుకొంటుంది. దీనికి నేను నిన్నే నిందిస్తాను. ఆమెను నేను నీకు ఇచ్చాను. ఆమె గర్భవతి అయింది. అయితే ఆమె నాకంటే గొప్పదని భావిస్తుంది. మనలో ఎవరు సరియైనవాళ్లో యెహోవాయే నిర్ణయించాలని నేను కోరుతున్నాను” అని అనింది.
6కాని అబ్రాము శారయితో, “హాగరుకు నీవు యజమానురాలివి, నీ యిష్టం వచ్చినట్లు నీవు ఆమెకు చేయవచ్చు” అన్నాడు. అందుచేత శారయి తన పనిమనిషిని చాలా చులకనగా చూసింది. ఆ పనిమనిషి పారిపోయింది.
హాగరు కొడుకు ఇష్మాయేలు
7ఎడారిలో నీటి ఊట దగ్గర యెహోవా దూతకు ఆ పనిమనిషి కనబడింది. షూరు మార్గంలో ఆ ఊట ఉంది. 8“హాగరూ, నీవు శారయి పనిమనిషివి గదూ! ఇక్కడెందుకు ఉన్నావు? నీవు ఎక్కడికి వెళ్తున్నావు?” అని ఆ దూత అడుగగా,
“నా యజమానురాలు శారయి నుండి పారిపోతున్నాను” అని చెప్పింది హాగరు.
9“నీ యజమానురాలి దగ్గరకు నీవు తిరిగి వెళ్లు, ఆమెకు లోబడి నడుచుకో” అని యెహోవా దూత ఆమెతో చెప్పడం జరిగింది. 10“నీలో నుండి అనేక జనములు వస్తారు. వారు చాలామంది ఉంటారు గనుక వాళ్లను లెక్కపెట్టడం కూడ కుదరదు” అని కూడ యెహోవా దూత చెప్పడం జరిగింది.
11ఇంకా యెహోవా దూత,
“ఇప్పుడు నీవు గర్భవతివి,
మరి నీకు ఒక కుమారుడు పుడ్తాడు.
అతనికి ఇష్మాయేలు#16:11 ఇష్మాయేలు “దేవుడు వినును” అని దీని అర్థం. అని పేరు పెడతావు.
ఎందుచేతనంటే, నీ కష్టాల్ని గూర్చి యెహోవా విన్నాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు.
12ఇష్మాయేలు అడవి గాడిదలా
అదుపులేక, స్వేచ్ఛగా ఉంటాడు
అతడు అందరికి వ్యతిరేకమే
ప్రతి ఒక్కరూ అతనికి వ్యతిరేకమే
తన సోదరులకు దగ్గరగా అతడు నివసిస్తాడు
కాని అతడు వారికి వ్యతిరేకంగా ఉంటాడు.”
అని చెప్పాడు.
13ఆ పనిమనిషితో యెహోవా మాట్లాడాడు. దేవునికి ఆమె ఒక క్రొత్త పేరు ప్రయోగించింది. “నన్ను చూసే దేవుడవు నీవు” అని ఆయనతో చెప్పింది. “ఈ స్థలంలో కూడా దేవుడు నన్ను చూస్తున్నాడు, రక్షిస్తున్నాడు” అని అనుకొన్నందువల్ల ఆమె ఇలా చెప్పింది. 14కనుక ఆ బావి బెయేర్ లహాయిరోయి#16:14 బెయేర్ లహాయిరోయి “నన్ను చూచుచున్న సజీవుని బావి” అని దీని అర్థం. అని పిలువబడింది. కాదేషుకు బెరెదుకు మధ్య ఉంది ఆ బావి.
15హాగరు ఒక కుమారునికి జన్మనిచ్చింది. ఆ కుమారునికి ఇష్మాయేలు అని అబ్రాము పేరు పెట్టాడు. 16హాగరుకు ఇష్మాయేలు పుట్టినప్పుడు అబ్రాము వయస్సు 86 సంవత్సరాలు.

Destaque

Partilhar

Copiar

None

Quer salvar os seus destaques em todos os seus dispositivos? Faça o seu registo ou inicie sessão