ఆదికాండము 3
3
పాపం ప్రారంభం
1ఆ సమయంలో ఆ స్త్రీతో సర్పం మాట్లాడింది. యెహోవా దేవుడు సృష్టించిన అడవి జంతువులన్నిటిలో సర్పం చాలా తెలివైనది, కపటమైనది. ఆ సర్పం స్త్రీని మోసగించాలనుకొని, “ఏమమ్మా! ఈ తోటలోని ఏ చెట్టు ఫలమైనా తినవద్దని దేవుడు నిజంగా నీతో చెప్పాడా?” అంది.
2సర్పానికి ఆమె ఇలా జవాబిచ్చింది: “లేదు! దేవుడు అలాగు చెప్పలేదు. తోటలోని చెట్ల ఫలాలు మేము తినవచ్చు. 3అయితే ఒక చెట్టుంది, దాని ఫలము మేము తినకూడదు. ‘తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలం మీరు తినకూడదు. అసలు ఆ చెట్టును మీరు ముట్టుకోకూడదు. అలాచేస్తే మీరు చస్తారు’ అని దేవుడు మాతో చెప్పాడు.”
4అయితే సర్పం ఆ స్త్రీతో ఇలా అంది: “మీరు చావరు. 5ఆ చెట్టు ఫలం మీరు తింటే, మంచి చెడ్డలను గూర్చి మీరు తెలుసుకొంటారని దేవునికి తెలుసు. అప్పుడు మీరు దేవునివలె ఉంటారు!”
6ఆ చెట్టు చాలా అందంగా ఉన్నట్లు ఆ స్త్రీ చూసింది; ఆ ఫలం తినటానికి మంచిదిగా ఉన్నట్లు, ఆ చెట్టు తెలివినిస్తుందని ఆమె తెలుసుకొంది. కనుక ఆ స్త్రీ ఆ చెట్టు ఫలం తీసుకొని దానిని తిన్నది. ఆ పండులో కొంత ఆమె భర్తకు ఇచ్చింది, అతడు కూడా దాన్ని తిన్నాడు.
7అప్పుడు ఆ పురుషుడు, స్త్రీ ఇద్దరూ మారిపోయారు. వారి కళ్లు తెరవబడ్డట్లు వారికి అన్నీ వేరుగా కనబడ్డాయి. వారికి బట్టలు లేనట్లు, నగ్నంగా ఉన్నట్లు వాళ్లు చూశారు. కనుక వారు అంజూరపు ఆకులను కుట్టి వాటినే బట్టలుగా ధరించారు.
8సాయంకాలపు చల్లని వేళలో యెహోవా దేవుడు ఆ తోటలో నడుస్తుండగా ఆ పురుషుడు, స్త్రీ ఆ చప్పుడు విని, తోటలోని చెట్లమధ్య దాగుకొన్నారు. యెహోవా దేవుని నుండి దాగుకొనేందుకు వారు ప్రయత్నించారు. 9అయితే యెహోవా దేవుడు ఆ పురుషుని పిలిచాడు. “నీవు ఎక్కడున్నావు?” అన్నాడు యెహోవా.
10“నీవు తోటలో నడుస్తున్న చప్పుడు విన్నాను, నాకు భయం వేసింది. నేను నగ్నంగా ఉన్నాను, అందుకే దాగుకొన్నాను” అన్నాడు ఆ పురుషుడు.
11దేవుడు ఆ పురుషునితో ఇలా అన్నాడు. “నీవు నగ్నంగా ఉన్నావని నీతో ఎవరు చెప్పారు? నిన్ను సిగ్గుపడేటట్లు చేసింది ఏమిటి? నేను తినవద్దని చెప్పిన పండు నీవు తిన్నావా ఏమిటి? ఆ చెట్టు ఫలం తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించానుగదా!”
12అందుకు ఆ పురుషుడు, “నా కోసం నీవు చేసిన ఈమె ఆ చెట్టు ఫలాన్ని నాకిచ్చింది, అందుచేత నేను తిన్నాను” అన్నాడు.
13అప్పుడు యెహోవా దేవుడు, “ఏమిటి నీవు చేసింది?” అన్నాడు ఆ స్త్రీతో.
ఆ స్త్రీ, “సర్పం నన్ను మోసం చేసింది. నన్ను వెర్రిదాన్ని చేస్తే నేను ఆ పండు తినేశాను” అని చెప్పింది.
14అందుచేత యెహోవా దేవుడు సర్పంతో ఇలా అన్నాడు:
“ఈ మహా చెడ్డ పని నీవే చేశావు
కనుక నీవు శపించబడ్డావు.
జంతువులన్నిటి కంటే
నీ పరిస్థితి హీనంగా ఉంటుంది.
నీవు నీ పొట్టతో పాకడం తప్పనిసరౌతుంది.
నీవు జీవిత కాలమంతా మట్టి తింటావు.
15ఈ స్త్రీని, నిన్ను ఒకరికొకర్ని
విరోధుల్నిగా నేను చేస్తాను.
నీ సంతానము, ఆమె సంతానము
ఒకరికొకరు విరోధులవుతారు.
నీవు ఆమె శిశువు పాదం మీద కాటేస్తావు
ఈ శిశువు నీ తలను చితుక కొడతాడు.”
16అప్పుడు స్త్రీతో యెహోవా దేవుడు ఇలా అన్నాడు:
“నీవు గర్భవతిగా ఉన్నప్పుడు నేను
నీకు బహు ప్రయాస కలుగజేస్తాను.
నీవు పిల్లల్ని కనేటప్పుడు మహా
గొప్ప బాధ నీకు కలుగుతుంది.
నీవు నీ భర్తను వాంఛిస్తావు
కాని అతడే నిన్ను ఏలుతాడు.”
17అప్పుడు పురుషునితో దేవుడు ఈలాగు అన్నాడు:
“ప్రత్యేకమైన చెట్టుఫలాన్ని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించాను.
అయితే నీవు నీ భార్య చెప్పిన మాటలు విన్నావు. ఆ చెట్టు ఫలాన్ని తిన్నావు. కనుక
నీ మూలంగా భూమిని నేను శపిస్తాను.
భూమి ఇచ్చే ఆహారం కోసం నీవు నీ జీవితాంతం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.
18పొలంలో పండే మొక్కల్ని నీవు తినాలని అనుకొంటావు
కాని ముళ్లను, పొదలను నేల నీకోసం పండిస్తుంది.
19నీ భోజనం కోసం నీవు చాలా కష్టపడి పని చేస్తావు.
నీ ముఖం అంతా చెమటతో నిండి పోయేంతగా నీవు పని చేస్తావు.
నీవు చనిపోయే రోజు వరకు కష్టపడి పని చేస్తావు
మరణించాక నీవు మరలా మట్టి అయిపోతావు.
నేను నిన్ను చేసినప్పుడు మట్టిలో నుంచే నీవు తీయబడ్డావు
మళ్లీ నీవు చనిపోయినప్పుడు తిరిగి మట్టిలోనే కలిసిపోతావు.”
20ఆదాము#3:20 ఆదాము ఈ పేరుకు అర్థం “మానవుడు” లేక “మానవ జాతి.” తన భార్యకు హవ్వ#3:20 హవ్వ “జీవం” అని అర్థం వచ్చే హెబ్రీ పదం వంటిది ఈ పదం. అని పేరు పెట్టాడు. ఎన్నడైనా సరే, బ్రతికిన ప్రతి మనిషికి ఈమె తల్లి కనుక ఆయన ఆమెకు ఆ పేరు పెట్టాడు.
21యెహోవా దేవుడు జంతు చర్మాలతో ఆ పురుషునికి, అతని భార్యకు చొక్కాలు చేశాడు. ఆ తరువాత ఆ చొక్కాలను వారికి తొడిగించాడు.
22అప్పుడు యెహోవా దేవుడు అన్నాడు: “చూడండి, మనిషి మనలా తయారయ్యాడు. మంచి, చెడ్డలు మనిషికి తెలుసు. ఇప్పుడు ఆ మనిషి జీవ వృక్షంనుండి ఫలములు తీసుకొని తింటే అతడు శాశ్వతంగా జీవిస్తాడు.”
23కనుక ఏదెను తోటనుండి ఆ మనిషిని యెహోవా దేవుడు వెళ్లగొట్టాడు. ఆదాము బలవంతంగా వెళ్లగొట్టబడి ఏ నేల నుండి అతడు తీయబడ్డాడో ఆ నేలను సేద్యం చేయటం మొదలు పెట్టాడు. 24తరువాత ఆ తోటకు కాపలాగా దాని ద్వారం దగ్గర కెరూబులను#3:24 కెరూబులు దేవుని దగ్గర నుండి వచ్చిన ప్రత్యేక దేవదూతలు. దేవుడు ఉంచాడు. ఒక అగ్ని ఖడ్గాన్ని కూడా అక్కడ ఉంచాడు. జీవ వృక్షమునకు పోయే మార్గాన్ని కాపలా కాస్తూ ఆ ఖడ్గం చుట్టూరా తిరుగుతూవుంది.
Atualmente selecionado:
ఆదికాండము 3: TERV
Destaque
Partilhar
Copiar
Quer salvar os seus destaques em todos os seus dispositivos? Faça o seu registo ou inicie sessão
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International