యోహాను సువార్త 1
1
శరీరధారియైన వాక్యం
1ఆదిలో వాక్యం ఉన్నది. ఆ వాక్యం దేవునితో ఉన్నది, ఆ వాక్యమే దేవుడు. 2ఆయన ఆదిలో దేవునితో ఉన్నారు. 3సృష్టిలో ఉన్నవన్నీ ఆయన ద్వారానే కలిగాయి, కలిగింది ఏదీ ఆయన లేకుండా కలుగలేదు. 4ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవం మానవులందరికి వెలుగుగా ఉన్నది. 5ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కాని, చీకటి ఆ వెలుగును గ్రహించలేకపోతుంది.
6యోహాను అనే పేరుగల ఒక వ్యక్తి దేవుని దగ్గర నుండి పంపబడ్డాడు. 7ప్రజలందరు తన ద్వారా ఆ వెలుగును నమ్మాలని ఆ వెలుగుకు సాక్షిగా అతడు వచ్చాడు. 8అయితే అతడు ఆ వెలుగు కాదు కాని, ఆ వెలుగు గురించి సాక్ష్యం చెప్పడానికి మాత్రమే వచ్చాడు.
9ప్రతి వ్యక్తికి వెలుగునిచ్చే నిజమైన వెలుగు ఈ లోకంలోనికి వస్తూ ఉండేది. 10ఆయన వలననే లోకం కలిగింది కాని, ఆయన లోకంలో ఉన్నపుడు లోకం ఆయనను గుర్తించలేదు. 11ఆయన తన సొంత ప్రజల దగ్గరకు వచ్చారు, కాని వారు ఆయనను అంగీకరించలేదు. 12అయినా ఆయనను ఎందరు అంగీకరించారో వారందరికి, అనగా తన పేరును నమ్మిన వారికందరికి దేవుని పిల్లలుగా అయ్యే అధికారాన్ని ఆయన ఇచ్చారు. 13ఈ పిల్లలు శరీర కోరికల వలన, మానవుల నిర్ణయాల వలన, భర్త కోరిక వలన పుట్టలేదు కాని దేవుని మూలంగా పుట్టారు.
14ఆ వాక్యం శరీరాన్ని ధరించుకొని మన మధ్య నివసించింది. మనం ఆయన మహిమను చూశాం, కృపాసత్య సంపూర్ణుడై, తండ్రి దగ్గర నుండి వచ్చిన, ఏకైక కుమారుని మహిమను చూశాము.
15యోహాను ఆయన గురించి సాక్ష్యం చెప్తూ, “నేను చెప్పిన వాడు ఈయనే, ‘నా తర్వాత వచ్చేవాడు నాకన్నా గొప్పవాడు ఎందుకంటే ఆయన నాకన్నా ముందు నుండి ఉన్నవాడు’ ” అని బిగ్గరగా కేక వేసి చెప్పాడు. 16ఆయన సంపూర్ణతలో నుండి మనం అందరం కృప వెంబడి కృపను పొందాము. 17ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడింది కాని కృప, సత్యం యేసు క్రీస్తు ద్వారా వచ్చాయి. 18ఎవ్వరూ ఎన్నడును దేవుని చూడలేదు, కానీ తానే దేవుడై ఉండి, తండ్రితో అత్యంత సమీప సంబంధం కలిగి ఉన్న ఏకైక కుమారుడే ఆయనను మనకు తెలియపరిచారు.
బాప్తిస్మమిచ్చే యోహాను సాక్ష్యం
19యెరూషలేములోని యూదా అధికారులు అతడు ఎవరో తెలుసుకోవడానికి యాజకులను, లేవీయులను యోహాను దగ్గరకు పంపినప్పుడు అతడు వారికి ఇచ్చిన సాక్ష్యం ఇదే. 20అతడు నాకు తెలియదు అని చెప్పకుండా “నేను క్రీస్తును కాను” అని ధైర్యంగా ఒప్పుకున్నాడు.
21అప్పుడు వారు, “అయితే నీవెవరవు? నీవు ఏలీయావా?” అని అడిగారు.
అతడు, “కాదు” అని చెప్పాడు.
అయితే, “నీవు ప్రవక్తవా?” అని అడిగారు.
అతడు, “కాదు” అని జవాబిచ్చాడు.
22చివరికి వారు, “నీవెవరవు? మమ్మల్ని పంపినవారికి మేము సమాధానం చెప్పడానికి నీ గురించి నీవు ఏమి చెప్తావు?” అని అడిగారు.
23అందుకు యోహాను, యెషయా ప్రవక్త చెప్పిన మాటలతో జవాబిచ్చాడు, “ ‘ప్రభువు కోసం మార్గాన్ని సరాళం చేయండి అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్తున్న స్వరం నేనే’ ”#1:23 యెషయా 40:3 అన్నాడు.
24అప్పుడు పంపబడిన పరిసయ్యులు, 25“నీవు క్రీస్తువు కాదు, ఏలీయావు కాదు, ప్రవక్తవు కాదు, అలాంటప్పుడు ఎందుకు బాప్తిస్మం ఇస్తున్నావు?” అని అతన్ని ప్రశ్నించారు.
26అందుకు యోహాను, “నేను నీటితో బాప్తిస్మమిస్తున్నాను, కాని మీ మధ్య నిలబడి ఉన్న వ్యక్తిని మీరు ఎరుగరు. 27నా తర్వాత రానున్నవాడు ఆయనే. ఆయన చెప్పుల వారును విప్పడానికి కూడ నేను యోగ్యున్ని కాదు” అని సమాధానం చెప్పాడు.
28ఇదంతా యొర్దాను నదికి అవతల ఉన్న బేతనియ అనే ఊరిలో యోహాను బాప్తిస్మం ఇస్తున్న చోట జరిగింది.
యేసు గురించి యోహాను ఇచ్చిన సాక్ష్యం
29మరుసటిరోజు యోహాను యేసు తన దగ్గరకు రావడం చూసి, “చూడండి, లోక పాపాన్ని మోసుకొనిపోయే దేవుని గొర్రెపిల్ల! 30‘నా తర్వాత వచ్చేవాడు నాకన్నా గొప్పవాడు ఎందుకంటే ఆయన నాకన్నా ముందు నుండి ఉన్నవాడు’ అని నేను చెప్పింది ఈయన గురించే. 31ఆయన ఎవరో నాకే తెలియదు, కాని ఆయనను ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేయడానికి నేను నీళ్లతో బాప్తిస్మం ఇస్తున్నాను” అన్నాడు.
32అప్పుడు యోహాను ఇలా సాక్ష్యం ఇచ్చాడు: “పరలోకం నుండి ఆత్మ పావురంలా దిగి వచ్చి ఆయనపై నిలిచి ఉండడం నేను చూశాను. 33అయితే నాకే ఆయన తెలియలేదు కానీ, ‘నీవు ఎవరి మీదకి ఆత్మ దిగి వచ్చి ఆయనపై నిలిచి ఉండడం చూస్తావో, ఆయనే పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇచ్చేవాడు’ అని నీళ్లతో బాప్తిస్మం ఇవ్వడానికి నన్ను పంపినవాడు నాతో చెప్పారు. 34నేను చూశాను కాబట్టి ఈయనే దేవుని కుమారుడని సాక్ష్యం ఇస్తున్నాను.”#1:34 యెషయా 42:1
యేసును వెంబడించిన యోహాను శిష్యులు
35మరుసటిరోజు యోహాను తన ఇద్దరి శిష్యులతో ఉన్నాడు. 36అతడు నడచి వెళ్తున్న యేసు చూసి, “చూడండి, దేవుని గొర్రెపిల్ల!” అని చెప్పాడు.
37అతడు చెప్పిన మాటలు విన్న ఆ ఇద్దరు శిష్యులు యేసును వెంబడించారు. 38యేసు వెనుకకు తిరిగి, తనను వెంబడిస్తున్న వారిని చూసి, “మీకు ఏమి కావాలి?” అని అడిగారు.
అందుకు వారు, “రబ్బీ, నీవు ఎక్కడ నివసిస్తున్నావు?” అని అడిగారు. రబ్బీ అనగా బోధకుడు అని అర్థము.
39ఆయన, “వచ్చి చూడండి” అని చెప్పారు.
కాబట్టి వారు వెళ్లి ఆయన ఉన్నచోటును చూసి, ఆ రోజంతా ఆయనతో గడిపారు. అప్పటికి సాయంకాలం సుమారు నాలుగు గంటలైంది.
40యోహాను మాటలు విని యేసును వెంబడించిన ఇద్దరిలో ఒకడు అంద్రెయ అతడు సీమోను పేతురుకు సోదరుడు. 41అంద్రెయ మొదట తన సహోదరుడైన సీమోనును కలిసి, “మేము క్రీస్తును#1:41 క్రీస్తును అంటే మెస్సీయా కనుగొన్నాం” అని చెప్పి, 42అతన్ని యేసు దగ్గరకు తీసుకువచ్చాడు.
యేసు అతన్ని చూసి, “నీవు యోహాను కుమారుడవైన సీమోనువు. నీవు కేఫా#1:42 కేఫా అంటే రాయి అని పిలువబడతావు” అని చెప్పారు.
ఫిలిప్పును నతనయేలును పిలిచిన యేసు
43మరుసటిరోజు యేసు గలిలయకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఫిలిప్పును చూసి, “నన్ను వెంబడించు” అని చెప్పారు.
44ఫిలిప్పు కూడా పేతురు, అంద్రెయల పట్టణమైన బేత్సయిదాకు చెందిన వాడు. 45ఫిలిప్పు నతనయేలును చూసి అతనితో, “ధర్మశాస్త్రంలో మోషే, ప్రవక్తలు ఎవరి గురించి వ్రాసారో ఆయనను మేము కనుగొన్నాము. ఆయనే యోసేపు కుమారుడైన, నజరేయుడైన యేసు” అని చెప్పాడు.
46“నజరేతా! ఆ ఊరి నుండి మంచిది ఏదైనా రాగలదా?” అని నతనయేలు అడిగాడు.
అందుకు ఫిలిప్పు, “వచ్చి చూడు” అన్నాడు.
47నతనయేలు తన దగ్గరకు రావడం చూసిన యేసు, “ఇతడు ఏ కపటం లేని నిజమైన ఇశ్రాయేలీయుడు” అన్నారు.
48అందుకు నతనయేలు, “నేను నీకెలా తెలుసు?” అని అడిగాడు.
అందుకు యేసు, “ఫిలిప్పు నిన్ను పిలువకముందే నీవు ఆ అంజూర చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను” అని చెప్పారు.
49అప్పుడు నతనయేలు, “రబ్బీ, నీవు దేవుని కుమారుడవు; నీవు ఇశ్రాయేలుకు రాజువు” అని సమాధానం ఇచ్చాడు.
50అందుకు యేసు, “నీవు ఆ అంజూర చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను చూసానని చెప్పినందుకు నీవు నమ్మావు. దీని కంటే గొప్ప కార్యాలను నీవు చూస్తావు” అని అతనితో చెప్పారు. 51తర్వాత యేసు, “ఆకాశం తెరువబడి, దేవదూతలు మనుష్యకుమారుని పైగా ఎక్కడం, దిగడం మీరు చూస్తారని నేను మీతో చెప్పేది నిజం”#1:51 ఆది 28:12 అన్నారు.
Atualmente selecionado:
యోహాను సువార్త 1: TSA
Destaque
Partilhar
Copiar
Quer salvar os seus destaques em todos os seus dispositivos? Faça o seu registo ou inicie sessão
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.