యోహాను సువార్త 11
11
లాజరు చనిపోవుట
1బేతనియ గ్రామానికి చెందిన మరియ, మార్తల సహోదరుడైన లాజరు అనారోగ్యంతో ఉన్నాడు. 2అనారోగ్యంతో ఉన్న లాజరు సహోదరియైన మరియ ఈమెనే ప్రభువు పాదాల మీద పరిమళద్రవ్యాన్ని పోసి తన తలవెంట్రుకలతో తుడిచింది. 3కాబట్టి అతని సహోదరీలు, “ప్రభువా, నీవు ప్రేమించినవాడు అనారోగ్యంగా ఉన్నాడు” అని కబురు పంపించారు.
4యేసు అది విని, “ఈ అనారోగ్యం చావు కోసం వచ్చింది కాదు. దేవుని కుమారునికి మహిమ కలిగేలా దేవుని మహిమ పరచడానికే వచ్చింది” అని అన్నారు. 5యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించారు. 6లాజరు అనారోగ్యంతో ఉన్నాడని యేసు విని కూడా తాను ఉన్న చోటే మరో రెండు రోజులు ఉన్నారు. 7ఆ తర్వాత ఆయన తన శిష్యులతో, “యూదయ ప్రాంతానికి వెళ్దాం రండి” అని అన్నారు.
8అందుకు శిష్యులు, “రబ్బీ, ఇంతకుముందే యూదులు నిన్ను రాళ్లతో కొట్టడానికి ప్రయత్నించారు కదా, అయినా నీవు అక్కడికి మళ్ళీ వెళ్తావా?” అని అడిగారు.
9అందుకు యేసు, “పగలుకు పన్నెండు గంటలు ఉన్నాయి కదా? పగలు నడిచేవాడు తడబడకుండా నడుస్తాడు ఎందుకంటే అతడు లోకపు వెలుగులో చూడగలడు. 10అతడు రాత్రివేళ నడిస్తే వెలుగు ఉండదు కాబట్టి అతడు తడబడతాడు” అని చెప్పారు.
11యేసు ఈ సంగతులు వారితో చెప్పిన తర్వాత ఆయన ఇంకా వారితో, “మన స్నేహితుడు లాజరు నిద్రపోతున్నాడు. కాబట్టి నేను అతన్ని లేపడానికి వెళ్తున్నాను” అని అన్నారు.
12అందుకు ఆయన శిష్యులు ఆయనతో, “ప్రభువా, అతడు నిద్రపోతే బాగవుతాడు” అన్నారు. 13యేసు అతని చావు గురించి మాట్లాడారు. కాని వారు సాధారణమైన నిద్ర గురించి అనుకున్నారు.
14కాబట్టి యేసు వారితో స్పష్టంగా, “లాజరు చనిపోయాడు. 15అప్పుడు నేను అక్కడ లేనందుకు మీ గురించి సంతోషిస్తున్నాను. దీన్ని బట్టి మీరు నమ్ముతారు. పదండి అతని దగ్గరకు వెళ్దాం” అన్నారు.
16అప్పుడు దిదుమ అని పిలువబడే తోమా, “ఆయనతో పాటు చనిపోవడానికి ‘మనం కూడ వెళ్దాం రండి’ ” అని తోటి శిష్యులతో అన్నాడు.
యేసే పునరుత్ధానం జీవం
17యేసు అక్కడికి చేరుకుని, లాజరు శవాన్ని సమాధిలో ఉంచి అప్పటికే నాలుగు రోజులు గడిచాయని తెలుసుకున్నారు. 18యెరూషలేము నుండి బేతనియకు మూడు కిలోమీటర్ల#11:18 లేదా సుమారు రెండు మైళ్ళు దూరం ఉంటుంది. 19చాలామంది యూదులు మార్తను మరియను వారి సహోదరుని గురించి ఓదార్చడానికి వచ్చారు. 20మార్త యేసు వస్తున్నారని విని ఆమె ఆయనను ఎదుర్కోడానికి బయటకు వెళ్లింది కాని మరియ ఇంట్లోనే ఉండిపోయింది.
21మార్త యేసుతో, “ప్రభువా, నీవిక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. 22ఇప్పుడైనా నీవు దేవుని ఏమి అడిగినా అది నీకు ఇస్తాడని నాకు తెలుసు” అన్నది.
23యేసు ఆమెతో, “నీ సహోదరుడు మరల లేస్తాడు” అని చెప్పారు.
24అందుకు మార్త, “చివరి రోజున పునరుత్ధానంలో అతడు తిరిగి లేస్తాడని నాకు తెలుసు” అన్నది.
25యేసు, “పునరుత్థానం, జీవం నేనే. నన్ను నమ్మినవారు చనిపోయినా మళ్ళీ బ్రతుకుతారు. 26బ్రతికి ఉండి నన్ను నమ్మినవారు ఎప్పుడూ చనిపోరు. నీవు ఇది నమ్ముతున్నావా?” అని ఆమెను అడిగారు.
27ఆమె, “అవును ప్రభువా, నీవు ఈ లోకానికి రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముతున్నాను” అని ఆయనతో చెప్పింది.
28ఆమె ఈ మాట చెప్పిన తర్వాత, ఆమె వెనుకకు తిరిగివెళ్లి ఎవరికి తెలియకుండా తన సహోదరియైన మరియను ప్రక్కకు పిలిచి, “బోధకుడు ఇక్కడే ఉన్నాడు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు” అని చెప్పింది. 29మరియ అది విని వెంటనే లేచి ఆయన దగ్గరకు వెళ్లింది. 30అప్పటికి ఇంకా యేసు గ్రామం లోపలికి ప్రవేశించలేదు, మార్త తనను కలుసుకొన్న చోటే ఉన్నారు. 31మరియను ఓదారుస్తూ ఇంట్లో ఉన్న యూదులు ఆమె త్వరగా లేచి బయటకు వెళ్లడం చూసి ఆమె ఏడ్వడానికి సమాధి దగ్గరకు వెళ్తుందని భావించి ఆమె వెంట వెళ్లారు.
32మరియ యేసు ఉన్న చోటికి వెళ్లి యేసును చూసి ఆయన పాదాల మీద పడి, “ప్రభువా, నీవు ఇక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు” అన్నది.
33ఆమె ఏడ్వడం, ఆమెతో వచ్చిన యూదులు కూడా ఏడుస్తూ ఉండడం యేసు చూసి, తన ఆత్మలో ఎంతో బాధతో మూలుగుతూ, 34“మీరు అతన్ని ఎక్కడ పెట్టారు?” అని వారిని అడిగారు.
అప్పుడు వారు, “ప్రభువా, వచ్చి చూడండి” అని అన్నారు.
35యేసు ఏడ్చారు.
36అప్పుడు యూదులు, “చూడండి ఆయన అతన్ని ఎంత ప్రేమించాడో!” అని అన్నారు.
37అయితే వారిలో కొందరు, “గ్రుడ్డివాడి కళ్లను తెరిచిన ఈయన, ఇతనికి చావు రాకుండా చేయలేదా పోయాడా?” అన్నారు.
చనిపోయిన లాజరును యేసు జీవంతో లేపుట
38యేసు తనలో తాను మరొకసారి మూలుగుతూ సమాధి దగ్గరకు వచ్చారు. ఆ సమాధి ముందు ఒక రాయి అడ్డుగా పెట్టబడి ఉంది. 39యేసు, “ఈ రాయిని తీసి వేయండి” అన్నారు.
చనిపోయిన లాజరు సహోదరియైన మార్త, “ప్రభువా, అతన్ని అందులో పెట్టి నాలుగు రోజులైంది, ఈపాటికి దుర్వాసన వస్తూ ఉంటుంది” అన్నది.
40అప్పుడు యేసు, “నీవు నమ్మితే, దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా?” అన్నారు.
41కాబట్టి వారు రాయిని ప్రక్కకు తొలగించారు. అప్పుడు యేసు తల పైకెత్తి చూస్తూ, “తండ్రీ, నీవు నా విన్నపాలను విన్నందుకు నీకు కృతఙ్ఞతలు చెల్లిస్తున్నాను. 42నీవు ఎల్లప్పుడు నా విన్నపాలను వింటావని నాకు తెలుసు. అయితే ఇక్కడ నిలబడిన ప్రజలు నీవు నన్ను పంపించావని నమ్మాలని ఈ మాటను పలికాను” అన్నారు.
43యేసు ఈ మాట చెప్పిన తర్వాత బిగ్గరగా, “లాజరూ, బయటకు రా!” అని పిలిచారు. 44చనిపోయిన లాజరు బయటకు వచ్చినప్పుడు, అతని కాళ్లు చేతులు నారవస్త్రంతో కట్టి ఉన్నాయి, అతని ముఖం ఒక గుడ్డతో చుట్టబడి ఉంది.
అప్పుడు యేసు వారితో, “సమాధి బట్టలను తీసివేసి అతన్ని వెళ్లనివ్వండి” అన్నారు.
యేసును చంపటానికి ప్రయత్నాలు
45మరియను చూడటానికి వచ్చిన యూదులలో చాలామంది యేసు చేసిన కార్యాలను చూసి ఆయనను నమ్మారు. 46అయితే వారిలో కొందరు పరిసయ్యుల దగ్గరకు వెళ్లి వారికి యేసు చేసిన కార్యాలను చెప్పారు. 47అప్పుడు ముఖ్య యాజకులు పరిసయ్యులు న్యాయసభను ఏర్పాటు చేశారు.
“మనం ఏమి చేద్దాం? ఈయన అనేక అద్భుత కార్యాలను చేస్తున్నాడు. 48మనం ఆయనను ఇలాగే వదిలేస్తే, ప్రతి ఒక్కరు ఆయనను నమ్ముతారు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలాన్ని, మన దేశ ప్రజలను తీసుకుపోతారు” అన్నారు.
49అప్పుడు వారిలో ఆ సంవత్సరపు ప్రధాన యాజకుడైన కయప మాట్లాడుతూ, “మీకు ఏమి తెలియదు! 50ప్రజలందరు నశించిపోకుండా వారి కోసం ఒక మనుష్యుడు చనిపోవడం మంచిదని మీరు గ్రహించడంలేదు” అన్నాడు.
51అతడు తనంతట తానే ఈ విధంగా చెప్పలేదు కాని, ఆ సంవత్సరపు ప్రధాన యాజకునిగా అతడు యేసు యూదా దేశమంతటి కోసం చనిపోతాడని, 52ఆ దేశం కోసం మాత్రమే కాకుండా చెదిరిపోయిన దేవుని పిల్లలందరిని ఒక్క చోటికి చేర్చి వారందరిని ఒకటిగా సమకూర్చుతాడని ప్రవచించాడు. 53కాబట్టి ఆ రోజు నుండి వారు యేసును చంపడానికి ఆలోచన చేస్తున్నారు.
54కాబట్టి యేసు అప్పటినుండి యూదుల మధ్య బహిరంగంగా తిరగలేదు. కానీ అక్కడి అరణ్య ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఎఫ్రాయిం అనే గ్రామంలో తన శిష్యులతో ఉన్నారు.
55యూదుల పస్కా పండుగ దగ్గర పడుతుందని, చాలామంది తమ శుద్ధీకరణ ఆచార ప్రకారం పస్కాకు ముందుగానే గ్రామాల నుండి బయలుదేరి యెరూషలేముకు వెళ్లారు. 56వారు యేసు కోసం వెదకుతూ దేవాలయ ఆవరణంలో నిలబడి ఒకరితో ఒకరు, “మీరేమంటారు? ఆయన పండుగకు రావట్లేదేమో!” అని చెప్పుకుంటున్నారు. 57యేసు ఎక్కడ ఉన్నాడనే సంగతి ఎవరికైనా తెలిస్తే, వారు ఆయనను పట్టుకోవడానికి తమకు తెలియచేయాలని ముఖ్య యాజకులు పరిసయ్యులు ప్రజలకు ఆదేశించారు.
Selectat acum:
యోహాను సువార్త 11: TSA
Evidențiere
Partajează
Copiază
Dorești să ai evidențierile salvate pe toate dispozitivele? Înscrie-te sau conectează-te
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.