YouVersion
Pictograma căutare

ఆది 3

3
పతనం
1యెహోవా దేవుడు చేసిన అడవి జంతువులన్నిటిలో సర్పం చాలా యుక్తి కలది. సర్పం స్త్రీతో, “దేవుడు, ‘తోటలో ఉన్న ఏ చెట్టు పండ్లు తినకూడదు’ అని నిజంగా చెప్పారా?” అని అడిగింది.
2అందుకు స్త్రీ, “తోటలోని చెట్ల పండ్లు మేము తినవచ్చు 3కాని, ‘తోట మధ్యలో చెట్టు పండు మాత్రం తినకూడదు, దానిని ముట్టుకోవద్దు, లేదంటే మీరు చస్తారు’ అని దేవుడు చెప్పారు” అని జవాబిచ్చింది.
4అప్పుడు సర్పం, “మీరు ఖచ్చితంగా చావరు. 5మీరు అది తింటే మీ కళ్లు తెరవబడతాయని, మీరు దేవునిలా అవుతారని, మంచిచెడులు తెలుసుకుంటారని దేవునికి తెలుసు” అని చెప్పింది.
6స్త్రీ ఆ చెట్టు పండు తినడానికి మంచిది, చూడటానికి బాగుంది, తింటే జ్ఞానం వస్తుందని తలంచి, దానిలో కొంచెం తిని, తన భర్తకు కూడా ఇచ్చింది, అతడు కూడా తిన్నాడు. 7అప్పుడు వారి ఇద్దరి కళ్లు తెరవబడి తాము నగ్నంగా ఉన్నారని గ్రహించి, తమ శరీరాలను కప్పుకోడానికి అంజూర ఆకులు అల్లుకొన్నారు.
8అప్పుడు ఆ రోజు చల్లని సమయంలో యెహోవా దేవుడు తోటలో నడుస్తున్న శబ్దం విని, ఆదాము అతని భార్య యెహోవా దేవునికి కనబడకూడదని తోట చెట్ల మధ్య దాక్కున్నారు. 9అప్పుడు యెహోవా దేవుడు ఆదామును పిలిచి, “నీవెక్కడున్నావు?” అని అడిగారు.
10అతడు, “తోటలో మీ శబ్దం విని, నేను దిగంబరిగా ఉన్నానని భయపడ్డాను; అందుకే నేను దాక్కున్నాను” అని జవాబిచ్చాడు.
11అప్పుడు దేవుడు, “నీవు నగ్నంగా ఉన్నావని నీకెవరు చెప్పారు? తినకూడదని నేను మీకు ఆజ్ఞాపించిన ఆ చెట్టు నుండి పండు తిన్నావా?” అని అడిగారు.
12అందుకు ఆదాము, “మీరు నాకిచ్చిన ఈ స్త్రీ ఆ చెట్టు పండును కొంచెం నాకిచ్చింది, నేను తిన్నాను” అని చెప్పాడు.
13అప్పుడు యెహోవా దేవుడు స్త్రీని, “నీవు చేసిన ఈ పనేంటి?” అని అడిగారు.
అందుకు ఆ స్త్రీ జవాబిస్తూ, “సర్పం మాటలకు మోసపోయి నేను తిన్నాను” అని చెప్పింది.
14అందుకు యెహోవా దేవుడు సర్పంతో, “నీవు ఇలా చేశావు కాబట్టి,
“అన్ని రకాల పశువుల్లోను,
అడవి జంతువులన్నిటిలోనూ నీవు శపించబడ్డావు!
నీవు బ్రతుకు దినాలన్ని
నీ పొట్టతో ప్రాకుతావు,
మన్ను తింటావు.
15నేను నీకు స్త్రీకి మధ్య,
నీ సంతానానికి#3:15 లేదా విత్తనం స్త్రీ సంతానానికి మధ్య
శత్రుత్వం కలుగజేస్తాను;
అతడు నీ తలను చితకగొడతాడు,#3:15 లేదా నలిపివేస్తాడు
నీవు అతని మడిమె మీద కాటేస్తావు”
అని అన్నారు.
16తర్వాత దేవుడు స్త్రీతో ఇలా అన్నారు,
“నీకు ప్రసవ వేదన అధికం చేస్తాను;
తీవ్రమైన ప్రసవ వేదనతో పిల్లలను కంటావు.
నీ వాంఛ నీ భర్త కోసం కలుగుతుంది,
అతడు నిన్ను ఏలుతాడు.”
17ఆదాముతో ఆయన ఇలా అన్నారు, “నీవు నీ భార్య మాట విని, ‘తినవద్దు’ అని నేను నీకు చెప్పిన ఆ చెట్టు పండును నీవు తిన్నావు కాబట్టి,
“నిన్ను బట్టి ఈ నేల శపించబడింది;
నీ జీవితకాలమంతా దాని పంట నుండి,
కష్టపడి పని చేసి తింటావు.
18భూమి నీకోసం ముళ్ళ కంపలను గచ్చపొదలను మొలిపిస్తుంది,
నీవు పొలం లోని పంటను తింటావు.
19నీవు మట్టి నుండి తీయబడ్డావు కాబట్టి
నీవు మట్టికి చేరేవరకు,
నీ నుదిటి మీద చెమట కార్చి
నీ ఆహారాన్ని తింటావు
నీవు మట్టివి కాబట్టి
తిరిగి మన్నై పోతావు.”
20ఆదాము#3:20 లేదా మనుష్యుడు తన భార్యకు హవ్వ#3:20 హవ్వ అంటే బహుశ జీవం అని పేరు పెట్టాడు, ఎందుకంటే ఆమె జీవంగల వారందరికి తల్లి.
21యెహోవా దేవుడు ఆదాముకు అతని భార్యకు జంతు చర్మంతో చేసిన వస్త్రాలను తొడిగించారు. 22అప్పుడు యెహోవా దేవుడు, “మనుష్యుడు ఇప్పుడు మంచి చెడ్డలు తెలుసుకోగలిగి మనలాంటి వాడయ్యాడు, కాబట్టి అతడు తన చేయి చాపి జీవవృక్ష ఫలం కూడా తెంపుకొని తిని ఎప్పటికీ బ్రతికే ఉంటాడేమో, అలా జరగనివ్వకూడదు” అని అనుకున్నారు. 23కాబట్టి యెహోవా దేవుడు అతన్ని ఏదెను తోట నుండి బయటకు వెళ్లగొట్టి అతడు ఏ మట్టి నుండి తీయబడ్డాడో, ఆ మట్టినే సాగు చేసుకునేలా చేశారు. 24దేవుడు ఆదామును బయటకు పంపివేసి జీవవృక్షం దగ్గరకు వెళ్లే మార్గాన్ని కాపాడడానికి ఏదెను తోటకు తూర్పున#3:24 లేదా ముందున కెరూబును#3:24 కెరూబును సాధారణంగా దేవదూతలతో సమానంగా పరిగణించబడతాయి, అయితే ఇవి రెక్కల ప్రాణులే కానీ ఏవి అనేది చెప్పడం కష్టము. వీటి శరీర ఆకారం నర రూపం లేదా జంతు రూపంలో ఉంటుందని భావిస్తారు. ఇటు అటు తిరుగుతున్న మండుతున్న ఖడ్గాన్ని కాపలా ఉంచారు.

Selectat acum:

ఆది 3: OTSA

Evidențiere

Împărtășește

Copiază

None

Dorești să ai evidențierile salvate pe toate dispozitivele? Înscrie-te sau conectează-te