యోహాను సువార్త 15
15
యేసు నిజమైన ద్రాక్షావల్లి
1“నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. 2నాలో ఫలించని ప్రతి తీగెను ఆయన కత్తిరించి పారవేస్తారు. ఫలించే ప్రతితీగె అధికంగా ఫలించడానికి ఆయన దానిని కత్తిరించి సరిచేస్తారు. 3నేను మీతో చెప్పిన మాటల వలన మీరు ఇప్పటికే శుద్ధులు. 4నేను మీలో నిలిచేలా మీరు నాలో నిలిచి ఉండండి. ఒక ద్రాక్ష తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే తప్ప తనంతట తాను ఫలించలేదు; అలాగే మీరు కూడా నాలో నిలిచి ఉంటేనే తప్ప ఫలించలేరు.
5“నేను ద్రాక్షావల్లిని మీరు తీగెలు. మీరు నాలో ఉండి, నేను మీలో ఉన్నప్పుడు మీరు ఎక్కువగా ఫలిస్తారు. నా నుండి మీరు వేరుగా ఉండి ఏమి చేయలేరు. 6మీరు నాలో ఉండకపోతే, బయట పారవేయబడిన కొమ్మలా ఎండిపోతారు; అలాంటి కొమ్మలను పోగు చేసి అగ్నిలో వేసి కాల్చివేస్తారు. 7మీరు నాలో నిలిచి నా మాటలు మీలో నిలిచి ఉంటే, మీకు ఇష్టమైన దానిని అడగండి, అది మీకు జరుతుంది. 8మీరు నా శిష్యులుగా ఉండి ఎక్కువగా ఫలిస్తే నా తండ్రికి మహిమ కలుగుతుంది.
9“తండ్రి నన్ను ప్రేమించినట్లే, నేను మిమ్మల్ని ప్రేమించాను. కాబట్టి మీరు నా ప్రేమలో నిలిచి ఉండండి. 10నేను నా తండ్రి ఆజ్ఞలను పాటిస్తూ ఆయన ప్రేమలో నిలిచి ఉన్నట్లే, మీరు నా ఆజ్ఞలను పాటిస్తే, నా ప్రేమలో నిలిచి ఉంటారు. 11అప్పుడు నా సంతోషం మీలో ఉండి, మీ సంతోషం పరిపూర్ణం కావాలని, నేను ఈ సంగతులను మీతో చెప్పాను. 12నేను ఇచ్చే ఆజ్ఞ ఇదే: నేను మిమ్మల్ని ప్రేమించినట్లే, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోండి. 13ఒకడు తన స్నేహితుని కోసం ప్రాణం పెట్టే ప్రేమకంటే గొప్ప ప్రేమ లేదు. 14నా ఆజ్ఞల ప్రకారం మీరు చేస్తే మీరు నా స్నేహితులు అవుతారు. 15నేను మిమ్మల్ని సేవకులని ఇక పిలువను. ఎందుకంటే ఏ సేవకునికైనా తన యజమానుడు చేసే పనులు తెలియవు. నేనైతే మిమ్మల్ని స్నేహితులనే పిలుస్తున్నాను. ఎందుకంటే నేను నా తండ్రి నుండి విన్న విషయాలన్నిటిని మీకు తెలియజేశాను. 16మీరు నన్ను ఎంచుకోలేదు, కాని నేనే మిమ్మల్ని ఎంచుకుని మీరు వెళ్లి ఫలించాలని మీ ఫలం నిలిచి ఉండాలని మిమ్మల్ని నియమించాను. కాబట్టి మీరు నా పేరట తండ్రిని ఏమి అడిగినా అది మీకు ఇవ్వాలని ఇలా చేశాను. 17నా ఆజ్ఞ ఇదే: ఒకరిని ఒకరు ప్రేమించండి.
లోకం శిష్యులను ద్వేషిస్తుంది
18“ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే అది మీకంటె ముందుగా నన్ను ద్వేషించిందని మీరు గ్రహించాలి. 19మీరు ఈ లోకానికి చెందినవారైతే అది మిమ్మల్ని సొంత వారిలా ప్రేమించేది. కానీ మీరు ఈ లోకానికి చెందినవారు కారు, నేను మిమ్మల్ని ఈ లోకం నుండి ప్రత్యేకించాను; అందుకే ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. 20నేను మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి: ‘ఏ సేవకుడు తన యజమాని కన్నా గొప్పవాడు కాడు.’#15:20 యోహాను 13:16 వారు నన్ను హింసిస్తే, మిమ్మల్ని కూడా హింసిస్తారు. వారు నా బోధకు లోబడి ఉంటే, వారు మీ బోధకు కూడా లోబడుతారు. 21నా నామాన్ని బట్టి వారు మీ పట్ల ఇలా ప్రవర్తిస్తారు, ఎందుకంటే వారికి నన్ను పంపినవారెవరో తెలియదు అందుకే ఇలా చేస్తారు. 22నేను వచ్చి వారితో ఈ విషయాలను మాట్లాడి ఉండకపోతే, వారికి పాపం ఉండేది కాదు; కాని ఇప్పుడు వారు పాపం చేయలేదని తప్పించుకునే అవకాశం లేదు. 23నన్ను ద్వేషించేవారు నా తండ్రిని కూడా ద్వేషిస్తున్నారు. 24ఎవరూ చేయని ఈ అద్భుత కార్యాలను నేను వారి మధ్యలో చేసి ఉండకపోతే వారికి పాపం ఉండేది కాదు. అయితే ఇప్పుడు వారు వాటిని చూసి కూడా నన్ను, నా తండ్రిని ద్వేషిస్తున్నారు. 25‘కారణం లేకుండా వారు నన్ను ద్వేషించారు’#15:25 కీర్తన 35:19; 69:4 అని ధర్మశాస్త్రంలో వ్రాయబడినది నెరవేరడానికి ఇది జరిగింది.
పరిశుద్ధాత్మ కార్యాలు
26“తండ్రి నుండి నేను పంపబోయే ఆదరణకర్త అనగా సత్యమైన ఆత్మ తండ్రి దగ్గరి నుండి వచ్చినప్పుడు నా గురించి ఆయన సాక్ష్యం ఇస్తారు. 27మీరు మొదటి నుండి నాతో ఉన్నవారే, కాబట్టి మీరు కూడ తప్పక నా గురించి సాక్ష్యం ఇవ్వాలి.
Выбрано:
యోహాను సువార్త 15: TSA
Выделить
Поделиться
Копировать
Хотите, чтобы то, что вы выделили, сохранялось на всех ваших устройствах? Зарегистрируйтесь или авторизуйтесь
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.