యోహాను సువార్త 17

17
మహిమపరచబడుటకు యేసు ప్రార్థించుట
1యేసు ఈ మాటలు చెప్పిన తర్వాత ఆకాశం వైపు చూస్తూ ఇలా ప్రార్థించారు:
“తండ్రీ, సమయం వచ్చింది. నీ కుమారుడు నిన్ను మహిమపరిచేలా నీ కుమారుని మహిమపరచు. 2నీవు నీ కుమారునికి అప్పగించిన వారందరికి నిత్యజీవం అనుగ్రహించడానికి ప్రజలందరి మీద ఆయనకు అధికారం ఇచ్చావు. 3నీవు మాత్రమే నిజ దేవుడవని, యేసు క్రీస్తు నీవు పంపినవాడని వారు తెలుసుకోవడమే నిత్యజీవం. 4నీవు నాకు ఇచ్చిన పనిని పూర్తి చేసి భూమి మీద నిన్ను మహిమపరిచాను. 5తండ్రీ, ఈ లోక ఆరంభానికి ముందు నీతో నాకు ఉండిన మహిమతో ఇప్పుడు నన్ను నీ సన్నిధిలో మహిమపరచు.
యేసు తన శిష్యుల కోసం ప్రార్థించుట
6“ఈ లోకంలో నుండి నీవు నాకు ఇచ్చిన వారికి నేను నిన్ను#17:6 గ్రీకులో నీ పేరును తెలియపరిచాను. వారు నీవారు; నీవు వారిని నాకు ఇచ్చావు వారు నీ వాక్యాన్ని పాటించారు. 7ఇప్పుడు వారు నీవు నాకు ఇచ్చినవన్ని నీ దగ్గర నుండే వచ్చాయని తెలుసుకున్నారు. 8ఎందుకంటే నీవు నాకు ఇచ్చిన మాటలను నేను వారికి ఇచ్చాను. వారు వాటిని అంగీకరించి నిజంగా నేను నీ దగ్గర నుండి వచ్చానని వారు తెలుసుకుని నీవు నన్ను పంపావని నమ్మారు. 9నేను వారి కోసం ప్రార్థిస్తున్నాను. నేను లోకం కోసం ప్రార్థన చేయడం లేదు, కాని నీవు నాకు ఇచ్చినవారు నీవారు కాబట్టి వారి కోసం ప్రార్థిస్తున్నాను. 10నాకు ఉన్నవన్నీ నీవి, నీకు ఉన్నవన్నీ నావి. వారి ద్వారా నాకు మహిమ కలిగింది. 11నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నాను, కాబట్టి లోకంలో ఇక ఉండను. కాని వారైతే ఇంకా లోకంలోనే ఉన్నారు. పరిశుద్ధ తండ్రీ, నీ పేరిట అనగా నీవు నాకిచ్చిన పేరిట వారిని కాపాడు. అప్పుడు మనం ఏకమై ఉన్నట్లు వారు ఏకమై ఉంటారు. 12నేను వారితో ఉన్నప్పుడు నీవు నాకు ఇచ్చిన పేరిట వారిని రక్షించి భద్రంగా ఉంచాను. లేఖనాలు నెరవేరేలా నాశనానికి దిగజారిన ఒక్కడు తప్ప మరి ఎవరు తప్పిపోలేదు.
13“ఇప్పుడు నేను నీ దగ్గరకు వస్తున్నాను. అయినా నా ఆనందం వారిలో పరిపూర్ణం కావాలని నేను ఇంకా ఈ లోకంలో ఉన్నప్పుడే ఈ విషయాలను చెప్తున్నాను. 14నేను నీ వాక్యాన్ని వారికి ఇచ్చాను. వారు కూడా నాలాగే ఈ లోకానికి చెందినవారు కారు కాబట్టి లోకం వారిని ద్వేషించింది. 15ఈ లోకం నుండి నీవు వారిని తీసుకో అని నేను ప్రార్థన చేయడం లేదు కాని, దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను. 16నేను ఈ లోకానికి చెందనట్లే, వారు కూడ ఈ లోకానికి చెందినవారు కారు. 17సత్యంతో వారిని పవిత్రపరచు; నీ వాక్యమే సత్యము. 18నీవు నన్ను ఈ లోకానికి పంపించినట్లే, నేను వారిని ఈ లోకానికి పంపించాను. 19వారు కూడా సత్యంలో ప్రతిష్ఠ చేయబడాలని, వారి కోసం నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను.
యేసు విశ్వాసుల కోసం ప్రార్థించుట
20“నేను వారి కోసం మాత్రమే కాదు కాని, వారి మాటల ద్వారా నిన్ను నమ్మబోయే వారందరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. 21నీవు నన్ను పంపించావని లోకం నమ్మేలా తండ్రీ, నీవు నాలో, నేను నీలో ఏకమై ఉన్నట్లు వారు కూడా ఒకటిగా ఉండాలి. నీవు నన్ను పంపించావని లోకం నమ్మేలా వారు మనలో కూడా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. 22మనం ఏకంగా ఉన్నట్లు వారు కూడ ఏకంగా ఉండాలని నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి ఇచ్చాను. 23అప్పుడు నీవే నన్ను పంపావని, నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించావని లోకం తెలుసుకుంటుంది.
24“తండ్రీ, నీవు నన్ను సృష్టికి పునాది వేయబడక ముందే ప్రేమించి నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారు చూడడానికి నేను ఎక్కడ ఉంటానో అక్కడ, నీవు నాకు ఇచ్చిన వారందరు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను.
25“నీతిగల తండ్రీ, ఈ లోకానికి నీవు తెలియకపోయినా, నాకు నీవు తెలుసు. నీవే నన్ను పంపావని వీరికి తెలుసు. 26నా పట్ల నీకున్న ప్రేమ వీరిలో ఉండాలని, నేను వారిలో ఉండాలని నేను నీ నామాన్ని వీరికి తెలియజేశాను. ఇంకా తెలియజేస్తూనే ఉంటాను.”

Выделить

Поделиться

Копировать

None

Хотите, чтобы то, что вы выделили, сохранялось на всех ваших устройствах? Зарегистрируйтесь или авторизуйтесь