అపొస్తలుల కార్యములు 8
8
1సౌలు స్తెఫెను చావును సమ్మతించాడు.
సంఘం హింసించబడుట చెదరిపోవుట
ఆ రోజు నుండి యెరూషలేములోని సంఘానికి విరోధంగా తీవ్రమైన హింస చెలరేగింది, కాబట్టి అపొస్తలులు తప్ప మిగిలిన సంఘమంతా యూదయ, సమరయ ప్రాంతాలకు చెదరిపోయింది. 2దైవభయం గల విశ్వాసులు స్తెఫెనును సమాధి చేసి అతని కోసం ఎంతో రోదించారు. 3అయితే సౌలు ఇంటింటికి వెళ్లి, పురుషులను స్త్రీలను బయటకు ఈడ్చుకెళ్లి వారిని చెరసాలలో వేయిస్తూ, సంఘాన్ని నాశనం చేయడం మొదలుపెట్టాడు.
సమరయలో ఫిలిప్పు
4చెదరిపోయినవారు తాము వెళ్లిన ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని బోధించారు. 5ఫిలిప్పు సమరయలోని ఒక పట్టణానికి వెళ్లి అక్కడ క్రీస్తు గురించి ప్రకటించాడు. 6జనసమూహాలు ఫిలిప్పు చేసిన సూచకక్రియలను చూసి, అతడు చెప్పిన మాటల మీద శ్రద్ధ పెట్టసాగారు. 7చాలామందిలో నుండి దురాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాయి, చాలామంది పక్షవాతం కలవారు, కుంటివారు స్వస్థత పొందుకున్నారు. 8కాబట్టి ఆ పట్టణంలో గొప్ప ఆనందం కలిగింది.
మంత్రవిద్యను ప్రదర్శించు సీమోను
9కొంతకాలం నుండి ఆ పట్టణంలో మంత్రవిద్యను ప్రదర్శిస్తూ తానొక గొప్పవాడినని చెప్పుకుంటూ సమరయ ప్రజలందరినీ ఆశ్చర్యపరచే, సీమోను అనే పేరు కలవాడు ఉన్నాడు. 10అల్పులు మొదలుకొని గొప్పవారి వరకు ప్రజలందరు, “దేవుని శక్తి అంటే ఇతడే” అని చెప్తూ అతని మాటలపై శ్రద్ధచూపారు. 11అతడు తన మంత్రవిద్యతో వారిని చాలా కాలం నుండి ఆశ్చర్యపరుస్తున్నాడు కాబట్టి వారు అతన్ని వెంబడించేవారు. 12అయితే ఫిలిప్పు దేవుని రాజ్యసువార్తను, యేసు క్రీస్తు నామాన్ని ప్రకటించినప్పుడు వారు నమ్మారు, అలా నమ్మిన స్త్రీలు పురుషులు బాప్తిస్మం పొందుకున్నారు. 13సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొందుకొన్నాడు. అతడు ఫిలిప్పు వెళ్లిన ప్రతి చోటికి వెంబడిస్తూ, తాను చూసిన గొప్ప సూచకక్రియలు అద్భుతాలను బట్టి ఆశ్చర్యపడ్డాడు.
14సమరయ ప్రజలు దేవుని వాక్యాన్ని స్వీకరించారని విన్న యెరూషలేములోని అపొస్తలులు, పేతురు యోహానులను సమరయ ప్రాంతానికి పంపించారు. 15వారు అక్కడికి చేరుకొని, నూతన విశ్వాసులు పరిశుద్ధాత్మను పొందుకోవాలని ప్రార్థించారు, 16ఎందుకంటే వారిలో ఎవ్వరూ పరిశుద్ధాత్మను ఇంకా పొందుకోలేదు; వారు కేవలం ప్రభువైన యేసు పేరట బాప్తిస్మం మాత్రమే పొందుకున్నారు. 17పేతురు యోహానులు తమ చేతులను వారి మీద ఉంచగానే వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు.
18అపొస్తలులు చేతులు ఉంచగానే పరిశుద్ధాత్మను పొందుకోవడం చూసిన సీమోను, వారికి డబ్బు ఇస్తూ, 19“నేను చేతులుంచిన ప్రతివారు పరిశుద్ధాత్మను పొందుకొనేలా ఈ అధికారం నాకు కూడా ఇవ్వండి” అని అడిగాడు.
20అందుకు పేతురు, “నీవు దేవుని వరాన్ని డబ్బుతో కొనగలనని అనుకున్నావు కాబట్టి నీ డబ్బు నీతో నశించును గాక! 21నీ హృదయం దేవుని ఎదుట సరియైనదిగా లేదు, కాబట్టి ఈ పరిచర్యలో నీకు భాగం లేదు. 22నీ హృదయంలో అలాంటి ఆలోచన కలిగినందుకు క్షమిస్తాడనే నిరీక్షణతో నీ దుష్టత్వాన్ని బట్టి పశ్చాత్తాపంతో ప్రభువును వేడుకో. 23ఎందుకంటే నీవు ఘోర దుష్టత్వంతో నిండి పాపంలో బంధించబడి ఉన్నావని నాకు కనిపిస్తోంది” అన్నాడు.
24అందుకు సీమోను, “మీరు నాతో చెప్పినవి ఏవి నాకు జరుగకుండా నా కోసం మీరే ప్రభువుకు ప్రార్థన చేయండి” అని వేడుకున్నాడు.
25వారు దేవుని వాక్యాన్ని ప్రకటించి యేసు గురించి సాక్ష్యం ఇచ్చిన తర్వాత, పేతురు యోహానులు సమరయలోని అనేక గ్రామాల్లో సువార్తను ప్రకటిస్తూ యెరూషలేముకు తిరిగి వెళ్లారు.
ఫిలిప్పు ఇతియొపీయుడు
26ఒక దేవదూత ఫిలిప్పుతో, “నీవు దక్షిణ దిశలో యెరూషలేము పట్టణం నుండి గాజాకు వెళ్లే ఎడారి మార్గంలో వెళ్లు” అని చెప్పాడు. 27అతడు బయలుదేరి వెళ్తునప్పుడు, ఆ మార్గంలో ఇతియొపీయుల రాణియైన కందాకే యొక్క ధనాగారం అంతటికి ముఖ్య అధికారిగా ఉన్న ఇతియొపీయుడైన నపుంసకుని కలుసుకున్నాడు. ఇతడు ఆరాధించడానికి యెరూషలేముకు వెళ్లాడు, 28అతడు తన ఇంటికి తిరిగి వెళ్తూ తన రథంలో కూర్చుని యెషయా ప్రవక్త వ్రాసిన గ్రంథాన్ని చదువుతున్నాడు. 29అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, “ఆ రథానికి దగ్గరగా వెళ్లు” అని చెప్పాడు.
30అప్పుడు ఫిలిప్పు పరుగెత్తి రథం దగ్గరకు వెళ్లినప్పుడు అతడు యెషయా ప్రవక్త వ్రాసిన గ్రంథాన్ని చదువుతుంటే విని, “నీవు చదివేది నీకు అర్థమవుతుందా?” అని ఫిలిప్పు అడిగాడు.
31అతడు, “ఎవరు వివరించకపోతే నాకు ఎలా అర్థమవుతుంది?” అని చెప్పి, ఫిలిప్పును తన రథమెక్కి తనతో కూర్చోమని వేడుకున్నాడు.
32ఆ నపుంసకుడు చదువుతున్న లేఖనభాగం ఇది:
“ఆయన వధించబడడానికి తేబడిన గొర్రెవలె
బొచ్చు కత్తిరించే వాని దగ్గర గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు
ఆయన తన నోరు తెరవలేదు.
33తన దీనత్వాన్ని బట్టి ఆయన న్యాయాన్ని కోల్పోయాడు.
ఆయన సంతానం గురించి మాట్లాడేవారు ఎవరు?
ఎందుకంటే భూమి మీద నుండి ఆయన ప్రాణం తీసివేయబడింది.”#8:33 యెషయా 53:7,8
34ఆ నపుంసకుడు ఫిలిప్పును, “ప్రవక్త ఎవరి గురించి చెప్తున్నాడు, తన గురించా లేదా ఇంకొకరి గురించా? దయచేసి, నాకు చెప్పండి” అని అడిగాడు. 35అప్పుడు ఫిలిప్పు ఆ లేఖనంతో ప్రారంభించి, యేసును గురించిన సువార్తను అతనికి చెప్పాడు.
36వారు దారిలో వెళ్తునప్పుడు, నీళ్లు ఉన్న చోటికి వారు వచ్చారు, అప్పుడు ఆ నపుంసకుడు, “చూడండి, ఇక్కడ నీళ్లున్నాయి కదా, నేను బాప్తిస్మం పొందడానికి ఏమైన ఆటంకం ఉందా?” అని అడిగాడు.
37అందుకు ఫిలిప్పు, “నీ పూర్ణహృదయంతో నమ్మితే, పొందుకోవచ్చు” అని చెప్పాడు.
అప్పుడు ఆ నపుంసకుడు, “యేసు క్రీస్తు దేవుని కుమారుడు అని నేను నమ్ముతున్నాను” అన్నాడు.#8:37 కొన్ని ప్రతులలో ఈ వచనాలు ఇక్కడ చేర్చబడలేదు 38అతడు రథాన్ని ఆపమని ఆదేశించాడు. వారు ఇద్దరు నీళ్లలోనికి దిగిన తర్వాత ఫిలిప్పు అతనికి బాప్తిస్మమిచ్చాడు. 39వారు నీళ్లలో నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రభువు ఆత్మ అకస్మాత్తుగా ఫిలిప్పును తీసుకెళ్లాడు. తర్వాత ఆ నపుంసకుడు అతన్ని ఇంకా ఎప్పుడు చూడలేదు, కాని అతడు సంతోషంగా తన దారిన వెళ్లిపోయాడు. 40అయితే, ఫిలిప్పు ఆజోతు పట్టణంలో కనబడిన తర్వాత, అక్కడినుండి కైసరయ పట్టణానికి వెళ్లేవరకు అతడు అన్ని పట్టణాల్లో సువార్త ప్రకటిస్తూ వెళ్లాడు.
தற்சமயம் தேர்ந்தெடுக்கப்பட்டது:
అపొస్తలుల కార్యములు 8: TSA
சிறப்புக்கூறு
பகிர்
நகல்
உங்கள் எல்லா சாதனங்களிலும் உங்கள் சிறப்பம்சங்கள் சேமிக்கப்பட வேண்டுமா? பதிவு செய்யவும் அல்லது உள்நுழையவும்
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.