ప్రవక్త గానీ కలలు కనేవాడు గానీ మీ ఎదుట సూచక క్రియను లేక మహత్కార్యాన్ని చూపించి, మీరు ఎరుగని “ఇతర దేవుళ్ళను అనుసరించి పూజిద్దాం రండి” అని చెబుతాడేమో. అలా చెప్పినప్పుడు అతడు మీతో చెప్పిన సూచక క్రియ లేక మహత్కార్యం జరిగినా సరే, ఆ ప్రవక్త, లేక కలలు కనేవాడి మాటలు వినవద్దు. ఎందుకంటే మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోడానికి మీ దేవుడు యెహోవా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు.