నేను చూసినప్పుడు ఉత్తరం నుండి గాలి తుఫాను రావడం కనిపించింది; అది జ్వలించే అగ్నితో ప్రకాశవంతమైన కాంతితో నిండిన గొప్ప మేఘము. ఆ అగ్ని మధ్య భాగం కరిగిన ఇత్తడిలా కనిపించింది. దానిలో కరిగిన ఇత్తడిలా నాలుగు జీవుల్లాంటి ఒక రూపం కనిపించింది. వాటి రూపం మానవరూపంలా ఉంది. కాని ప్రతి జీవికి నాలుగు ముఖాలు, నాలుగు రెక్కలు ఉన్నాయి. వాటి కాళ్లు తిన్నగా ఉండి అరికాళ్లు దూడ కాళ్లలా ఉన్నాయి. అవి ఇత్తడిలా తళతళ మెరుస్తున్నాయి. వాటి రెక్కల క్రింద నాలుగు వైపులా మనుష్యుల చేతులు ఉన్నాయి. ఆ నాలుగింటికి ముఖాలు, రెక్కలు ఉన్నాయి. ఒకదాని రెక్కలు మరొకదాని రెక్కలకు తాకుతున్నాయి. అవి అటూ ఇటూ తిరగకుండా అన్నీ తిన్నగా ముందుకు వెళ్తున్నాయి.