యెహెజ్కేలు 1
1
యెహెజ్కేలు మొదటి దర్శనం
1నా ముప్పయవ సంవత్సరం, నాల్గవ నెల, అయిదవ రోజున నేను కెబారు నది దగ్గర బందీల మధ్య ఉన్నప్పుడు ఆకాశం తెరువబడింది, నేను దేవుని దర్శనాలను చూశాను.
2రాజైన యెహోయాకీను బందీగా ఉన్న అయిదవ సంవత్సరం నాల్గవ నెల అయిదవ రోజున ఇది జరిగింది. 3బబులోనీయుల#1:3 లేదా కల్దీయుల దేశంలో కెబారు నది దగ్గర బూజీ కుమారుడు యాజకుడైన యెహెజ్కేలుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమయ్యింది. అక్కడ యెహోవా హస్తం అతని మీదికి వచ్చింది.
4నేను చూసినప్పుడు ఉత్తరం నుండి గాలి తుఫాను రావడం కనిపించింది; అది జ్వలించే అగ్నితో ప్రకాశవంతమైన కాంతితో నిండిన గొప్ప మేఘము. ఆ అగ్ని మధ్య భాగం కరిగిన ఇత్తడిలా కనిపించింది. 5దానిలో కరిగిన ఇత్తడిలా నాలుగు జీవుల్లాంటి ఒక రూపం కనిపించింది. వాటి రూపం మానవరూపంలా ఉంది. 6కాని ప్రతి జీవికి నాలుగు ముఖాలు, నాలుగు రెక్కలు ఉన్నాయి. 7వాటి కాళ్లు తిన్నగా ఉండి అరికాళ్లు దూడ కాళ్లలా ఉన్నాయి. అవి ఇత్తడిలా తళతళ మెరుస్తున్నాయి. 8వాటి రెక్కల క్రింద నాలుగు వైపులా మనుష్యుల చేతులు ఉన్నాయి. ఆ నాలుగింటికి ముఖాలు, రెక్కలు ఉన్నాయి. 9ఒకదాని రెక్కలు మరొకదాని రెక్కలకు తాకుతున్నాయి. అవి అటూ ఇటూ తిరగకుండా అన్నీ తిన్నగా ముందుకు వెళ్తున్నాయి.
10ఆ నాలుగింటికి మానవ ముఖంలాంటి ముఖాలు ఉన్నాయి, కుడి వైపున సింహపు ముఖం, ఎడమవైపున ఎద్దు ముఖం ఉన్నాయి. ప్రతి దానికి గ్రద్ద ముఖం ఉంది. 11వాటి ముఖాలు అలా ఉన్నాయి. ప్రతి దానికి పైకి చాచి ఉన్న రెండు రెక్కలు వాటి ప్రక్కన ఉన్నవాటి రెక్కలను తాకుతూ ఉన్నాయి. మరో రెండు రెక్కలు వాటి శరీరాలను కప్పాయి. 12ప్రతిదీ తిన్నగా ముందు వెళ్తూ ఉంది. అవి అటూ ఇటూ తిరగకుండా ఆత్మ ఏ వైపుకు వెళ్తే అవి ఆ వైపుకే వెళ్తున్నాయి. 13ఆ జీవుల రూపం మండుతున్న నిప్పులా దివిటీలా ఉంది. అగ్ని ఆ జీవుల మధ్య ముందుకి వెనుకకు కదులుతూ ఉంది. ఆ అగ్ని చాలా ప్రకాశవంతంగా ఉండి దానిలో నుండి మెరుపులు వస్తున్నాయి. 14మెరుపు తీగెల్లా ఆ జీవులు అటూ ఇటూ తిరుగుతున్నాయి.
15నేను ఆ జీవులను చూసినప్పుడు, ప్రతి జీవి నాలుగు ముఖాల్లో ప్రతీదాని ప్రక్కన నేలమీద ఒక్కొక్క చక్రం కనిపించింది. 16చక్రాల రూపం, నిర్మాణం ఇలా ఉంది: అవి గోమేధికంలా మెరుస్తూ, నాలుగు ఒకేలా ఉన్నాయి. ప్రతిదీ ఒక చక్రంలో మరో చక్రం ఇమిడి ఉండేలా తయారుచేయబడినట్లు కనిపించింది. 17అవి కదిలినప్పుడు ఆ జీవుల ముఖాలు ఉన్న నాలుగు దిశలలో కదులుతున్నాయి; ఆ జీవులు వెళ్లినప్పుడు ఆ చక్రాలు దిశను మార్చలేదు. 18వాటి అంచులు ఎత్తుగా భయంకరంగా ఉన్నాయి. నాలుగు అంచుల చుట్టూ కళ్లతో నిండి ఉన్నాయి.
19జీవులు కదిలినప్పుడు, వాటి ప్రక్కన ఉన్న చక్రాలు కదిలాయి; జీవులు నేల నుండి లేచినప్పుడు, చక్రాలు కూడా లేచాయి. 20ఆత్మ ఎక్కడికి వెళ్తుందో, అక్కడికి అవి వెళ్తున్నాయి, వాటితో పాటు చక్రాలు కూడా లేస్తున్నాయి, ఎందుకంటే జీవుల ఆత్మ చక్రాలలో ఉంది. 21జీవులు కదిలినప్పుడు, అవి కూడా కదిలాయి; జీవులు నిశ్చలంగా ఉన్నప్పుడు, అవి కూడా నిలిచి ఉన్నాయి; జీవులు నేల నుండి లేచినప్పుడు, చక్రాలు వాటితో పాటు లేచాయి, ఎందుకంటే జీవుల ఆత్మ చక్రాలలో ఉంది.
22జీవుల తలల పైన విశాలమైనది ఒకటి కనిపించింది. అది స్ఫటికంలా మెరుస్తూ, అద్భుతంగా ఉంది. 23ఆ విశాలం క్రింద వాటి రెక్కలు ఒకదాని వైపు ఒకటి తిన్నగా చాపి ఉన్నాయి, ప్రతి దాని శరీరాన్ని రెండు రెక్కలు కప్పి ఉంచాయి. 24ఆ జీవులు కదిలినప్పుడు నేను వాటి రెక్కల శబ్దం విన్నాను. అది జలప్రవాహాల ఘోషలా, సర్వశక్తిమంతుని స్వరంలా, సైన్యం నుండి వచ్చే కోలాహలంలా ఉంది. అవి నిలబడినప్పుడు వాటి రెక్కలు క్రిందికి వాల్చాయి.
25అవి రెక్కలు వాల్చి నిలబడినప్పుడు వాటి తలపైన ఉన్న విశాలం పైనుండి ఒక స్వరం వచ్చింది. 26వాటి తలపైన ఉన్న విశాలంపైన నీలమణి వంటి ప్రశస్తమైన రాళ్లతో చేసిన ఒక సింహాసనం వంటిది కనిపించింది. దాని మీద మానవరూపంలో ఉన్న ఒకడు కూర్చున్నాడు. 27అతని నడుము నుండి పైభాగం చుట్టూరా అగ్నిలో కరుగుతున్న ఇత్తడిలా, క్రింది భాగం అగ్నిలా నాకు కనిపించింది. అతని చుట్టూ ప్రకాశవంతమైన కాంతి ఉంది. 28వర్షం కురుస్తున్న రోజు మేఘాలలో వానవిల్లు కనిపించినట్లు, అతని చుట్టూ ఉన్న తేజస్సు కూడా అలాగే ఉంది.
ఇది యెహోవా మహిమ రూపము. నేను దానిని చూసినప్పుడు, నేను నేల మీద పడిపోయాను, ఒక స్వరం నాకు వినిపించింది.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెహెజ్కేలు 1: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.