విలాప 5
5
1యెహోవా, మాకు ఏమి జరిగిందో జ్ఞాపకముంచుకోండి;
మా వైపు తిరిగి, మాకు కలిగిన అవమానాన్ని చూడండి.
2మా వారసత్వం అపరిచితులకు,
మా ఇళ్ళను విదేశీయులకు అప్పగించారు.
3మేము తండ్రిలేని వారమయ్యాము,
మా తల్లులు విధవరాండ్రు.
4మేము త్రాగే నీటిని మేము కొనుక్కోవలసి వస్తుంది;
మేము కట్టెలు ఎక్కువ వెలపెట్టి కొనుక్కోవలసి వస్తుంది.
5మమ్మల్ని వెంటాడేవారు మా వెనుకే ఉన్నారు;
మేము అలసిపోయాము, కాని విశ్రాంతి దొరకడం లేదు.
6తగినంత ఆహారం పొందేందుకు మేము ఈజిప్టు, అష్షూరు వారివైపు
మేము మా చేతులు చాపాము.
7మా పూర్వికులు పాపం చేశారు, వారు చనిపోయారు,
వారి శిక్షను మేము భరిస్తున్నాము.
8బానిసలు మమ్మల్ని పరిపాలిస్తున్నారు,
వారి చేతుల్లో నుండి మమ్మల్ని విడిపించేవారు ఎవరూ లేరు.
9ఎడారిలో ఖడ్గం కారణంగా,
ప్రాణాలను పణంగా పెట్టి ఆహారం తెచ్చుకుంటున్నాము.
10ఆకలికి జ్వరంగా ఉండి,
మా చర్మం పొయ్యిలా వేడిగా అయ్యింది.
11సీయోనులో స్త్రీలు,
యూదా పట్టణాల్లో కన్యలు హింసించబడ్డారు.
12అధిపతుల చేతులు కట్టబడి, వ్రేలాడదీయబడ్డారు;
పెద్దలకు గౌరవం లేదు.
13యువకులు తిరుగటిరాళ్ల దగ్గర కష్టపడుతున్నారు;
బాలురు కట్టెల బరువు మోయలేక తూలుతున్నారు.
14పెద్దలు నగర ద్వారం నుండి వెళ్లిపోయారు,
యువకులు తమ సంగీతాన్ని ఆపివేశారు.
15మా హృదయాల్లో నుండి ఆనందం వెళ్లిపోయింది,
మా నాట్యం దుఃఖంగా మారింది.
16మా తల మీది నుండి కిరీటం పడిపోయింది,
పాపం చేశాము, మాకు శ్రమ.
17మా హృదయాలు ధైర్యం కోల్పోయాయి,
వీటిని బట్టి మా కళ్లు క్షీణిస్తున్నాయి
18సీయోను పర్వతం నిర్జనంగా పడి ఉంది,
నక్కలు దాని మీద విహరిస్తున్నాయి.
19యెహోవా, ఎప్పటికీ పాలించండి;
మీ సింహాసనం తరతరాలుగా ఉంటుంది.
20మీరు మమ్మల్ని ఎందుకు మరచిపోతారు?
ఇంతకాలం వరకు మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టారు?
21యెహోవా, మేము తిరిగి వచ్చేలా, మమ్మల్ని మీ దగ్గరకు రప్పించుకోండి;
మీరు మమ్మల్ని పూర్తిగా తిరస్కరించి,
22మామీద చెప్పలేనంత కోపాన్ని పెంచుకుంటే తప్ప,
మా రోజులను పాత రోజుల్లా నూతనపర్చండి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
విలాప 5: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.