1 కొరింథీయులకు 3
3
1సహోదరులారా, ఆత్మసంబంధులైన మనుష్యులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేక పోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు, మీతో మాటలాడవలసివచ్చెను. 2అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితినిగాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీ రింకను శరీరసంబంధులై యుండుటవలన ఇప్పుడును మీరు బలహీనులై యున్నారు కారా? 3మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనువారు కారా? 4ఒకడు–నేను పౌలు వాడను, మరియొకడు–నేను అపొల్లోవాడను, అని చెప్పు నప్పుడు మీరు ప్రకృతిసంబంధులైన మనుష్యులు కారా? 5అపొల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే గదా. ఒక్కొ క్కరికి ప్రభువనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి 6నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసినవాడు దేవుడే 7కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు. 8నాటువాడును నీళ్లుపోయువాడును ఒక్కటే. ప్రతి వాడు తాను చేసిన కష్టముకొలది జీతము పుచ్చుకొనును. 9మేము దేవుని జతపనివారమై యున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై యున్నారు.
10దేవుడు నాకనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పరి యైన శిల్పకారునివలె పునాదివేసితిని, మరియొకడు దాని మీద కట్టుచున్నాడు; ప్రతివాడు దానిమీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. 11వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసుక్రీస్తే. 12-13ఎవడైనను ఈ పునాదిమీద బంగారము, వెండి, వెలగల రాళ్లు, కఱ్ఱ, గడ్డి, కొయ్య కాలు మొదలైనవాటితో కట్టినయెడల, వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలు పరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. 14పునాదిమీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చు కొనును. 15ఒకని పని కాల్చివేయబడినయెడల వానికి నష్టము కలుగును; అతడు తనమట్టుకు రక్షింపబడును గాని అగ్నిలోనుండి తప్పించుకొన్నట్టు రక్షింపబడును.
16మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? 17ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై యున్నది; మీరు ఆ ఆలయమై యున్నారు. #3:17 లేక, మీరును పరిశుద్ధులై యున్నారు.
18ఎవడును తన్నుతాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనినయెడల, జ్ఞాని అగునట్టు వెఱ్ఱివాడు కావలెను. 19ఈ లోక జ్ఞానము దేవునిదృష్టికి వెఱ్ఱితనమే.
20–జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును;
మరియు
–జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియును
అని వ్రాయబడియున్నది. 21కాబట్టి యెవడును మనుష్యులయందు అతిశయింపకూడదు; సమస్తమును మీవి. 22పౌలైనను అపొల్లోయైనను, కేఫాయైనను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవియైనను రాబోవునవియైనను సమస్తమును మీవే. 23మీరు క్రీస్తు వారు; క్రీస్తు దేవునివాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 కొరింథీయులకు 3: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.