1 రాజులు 13

13
1అంతట దైవజనుడైన యొకడు యెహోవాచేత సెలవు నొంది యూదాదేశమునుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యరొబాము ఆ బలిపీఠమునొద్ద నిలిచి యుండగా 2ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞచేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటనచేసెను–బలిపీఠమా బలి పీఠమా, యెహోవా సెలవిచ్చునదేమనగా–దావీదు సంత తిలో యోషీయా అను నొక శిశువు పుట్టును; నీమీద ధూపము వేసిన ఉన్నతస్థలముయొక్క యాజకులను అతడు నీమీద అర్పించును; అతడు మనుష్య శల్యములను నీమీద దహనము చేయును. 3ఈ బలిపీఠము బద్దలైపోయి దానిమీదనున్న బుగ్గి ఒలికి పోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన యొకటి యిచ్చెను. 4బేతేలునందున్న బలిపీఠమునుగూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరొబాము విని, బలిపీఠముమీదనుండి తన చెయ్యి చాపి, వానిని పట్టుకొనుమని చెప్పగా అతడు చాపిన చెయ్యి యెండి పోయెను; దానిని వెనుకకు తీసికొనుటకు అతనికి శక్తిలేక పోయెను. 5మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచనచొప్పున బలిపీఠము బద్దలుకాగా బుగ్గి దానిమీదనుండి ఒలికిపోయెను. 6అప్పుడు రాజు– నా చెయ్యిమునుపటివలె బాగగునట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నాకొరకు వేడుకొనుమని ఆ దైవజనుని బతిమాలుకొనగా, దైవజనుడు యెహోవాను బతిమాలుకొనెను గనుక రాజు చెయ్యి మరల బాగైమునుపటివలె ఆయెను. 7అప్పుడు రాజు–నీవు నా యింటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చెదనని ఆ దైవజనునితో చెప్పగా 8దైవజనుడు రాజుతో ఇట్లనెను–నీ యింటిలో సగము నీవు నాకిచ్చినను నీతోకూడ నేను లోపలికి రాను; ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను; 9–అన్నపానములు పుచ్చుకొన వద్దనియు, నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కుచేత నాకు సెలవాయెనని రాజుతో అనెను. 10అంతట అతడు తాను బేతేలునకు వచ్చిన మార్గమున వెళ్లక మరియొక మార్గమున తిరిగిపోయెను.
11బేతేలులో ప్రవక్తయగు ఒక ముసలివాడు కాపురముండెను. ఇతని కుమారులలో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటిని, అతడు రాజుతో పలికిన మాటలన్నిటిని తమ తండ్రితో తెలియ జెప్పగా 12వారి తండ్రి–అతడు ఏ మార్గమున వెళ్లిపోయె నని వారినడిగెను; అంతట అతని కుమారులు యూదాదేశములోనుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గమున వెళ్లిపోయి నది తెలిపిరి. 13పిమ్మట అతడు తన కుమారులను పిలిచి–నాకొరకు గాడిదకు గంతకట్టుడని చెప్పగా వారు అతని కొరకు గాడిదకు గంతకట్టిరి. అతడు దానిమీద ఎక్కి దైవజనుని కనుగొనవలెనని పోయి 14మస్తకివృక్షము క్రింద అతడు కూర్చుండగా చూచి–యూదాదేశములోనుండి వచ్చిన దైవజనుడవు నీవేనా? అని అడుగగా అతడు–నేనే అనెను. 15అప్పుడు అతడు–నా యింటికి వచ్చి భోజనము చేయుమనగా 16అతడు–నేను నీతోకూడ మరలి రాజాలను, నీ యింట ప్రవేశింపను, మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను 17–నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు, నీవు వచ్చిన మార్గమున పోవుటకు తిరుగవద్దనియు యెహోవా వాక్కుచేత నాకు సెలవాయెనని చెప్పెను. 18అందుకతడు–నేనును నీవంటి ప్రవక్తనే; మరియు దేవదూత యొకడు–యెహోవా చేత సెలవుపొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతని నీ యింటికి తోడుకొని రమ్మని నాతో చెప్పెనని అతనితో అబద్ధమాడగా 19అతడు తిరిగి అతనితోకూడ మరలిపోయి అతని యింట అన్నపానములు పుచ్చుకొనెను. 20వారు భోజనముచేయుచుండగా అతనిని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్ష మాయెను. 21అంతట అతడు యూదాదేశములోనుండి వచ్చిన దైవజనుని పిలిచి–యెహోవా ఈలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు–నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినదానిని గైకొనక 22ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగబడి నీవు వెనుకకు వచ్చి, నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనముచేసియున్నావు గనుక, నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని యెలుగెత్తి చెప్పెను. 23అంతట వారు అన్నపానములు పుచ్చుకొనిన తరువాత అచ్చటి ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిదమీద గంత కట్టించెను. 24అతడు బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతని చంపెను. అతని కళేబరము మార్గమందు పడియుండగా గాడిద దాని దగ్గర నిలిచి యుండెను, సింహమును శవముదగ్గర నిలిచి యుండెను. 25కొందరు మనుష్యులు ఆ చోటికి వచ్చి శవము మార్గమందు పడియుండుటయు, సింహము శవముదగ్గర నిలిచియుండుటయు చూచి, ఆ ముసలిప్రవక్త కాపురమున్న పట్టణమునకు వచ్చి ఆ వర్తమానము తెలియజేసిరి. 26మార్గములోనుండి అతని తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానము వినినప్పుడు– యెహోవా మాటను ఆలకింపక తిరుగబడిన దైవజనుడు ఇతడే; యెహోవా సింహమునకు అతని అప్పగించియున్నాడు; యెహోవా సెలవిచ్చిన ప్రకారము అది అతని చీల్చి చంపెను అని పలికి 27తన కుమారులను పిలిచి –గాడిదకు నాకొరకు గంత కట్టుడని చెప్పెను. వారు అతనికొరకు గంత కట్టినప్పుడు 28అతడు పోయి అతని శవము మార్గమందు పడియుండుటయు, గాడిదయు సింహమును శవముదగ్గర నిలిచి యుండుటయు, సింహము గాడిదను చీల్చివేయక శవమును తినక యుండుటయు చూచి 29దైవజనుని శవము ఎత్తి గాడిదమీద వేసికొని తిరిగి వచ్చెను. ఈ ప్రకారము ఆ ముసలి ప్రవక్త అంగలార్చుటకును సమాధిలో శవమును పెట్టుటకును పట్టణమునకు వచ్చెను. 30అతడు తన సమాధిలో ఆ శవమును పెట్టగా జనులు–కటకటా నా సహోదరుడా అని యేడ్చిరి. 31మరియు ఇతడు సమాధిలో శవమును పెట్టి–నేను మరణమైనప్పుడు దైవజనుడైన యితడు పెట్టబడిన సమాధిలో నన్ను పాతిపెట్టుడి; నా శల్యములను అతని శల్యముదగ్గర ఉంచుడి, 32యెహోవా మాటనుబట్టి బేతేలులోనున్న బలిపీఠమునకు విరోధముగాను, షోమ్రోను పట్టణములోనున్న ఉన్నతస్థలములలోని మందిరములన్నిటికి విరోధము గాను, అతడు ప్రకటించినది అవశ్యముగా సంభవించునని తన కుమారులతో చెప్పెను.
33ఈ సంగతియైన తరువాత యరొబాము తన దుర్మార్గమును విడిచిపెట్టక, సామాన్యజనులలో కొందరిని ఉన్నతస్థలములకు యాజకులుగా నియమించెను. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నతస్థలములకు యాజకులుగా నియమించెను. 34యరొబాము సంతతివారిని నిర్మూలము చేసి భూమిమీద ఉండకుండ నశింపజేయునట్లుగా ఇది వారికి పాపకారణమాయెను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 రాజులు 13: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి