1 సమూయేలు 18
18
1దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు. యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను; యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను. 2ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్లనియ్యక సౌలు అతనిని చేర్చుకొనెను. 3దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధనచేసికొనెను. 4మరియు యోనాతాను తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడి కట్టును తీసి దావీదున కిచ్చెను. 5దావీదు సౌలు తనను పంపిన చోట్లకెల్లను పోయి, సుబుద్ధిగలిగి పని చేసికొని వచ్చెను గనుక సౌలు యోధులమీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై యుండెను.
6దావీదు ఫిలిష్తీయుని హతముచేసితిరిగి వచ్చినప్పుడు, స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్లన్నిటిలోనుండి తంబురలతోను సంభ్రమముతోను వాద్యములతోను పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి 7ఆ స్ర్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు–
సౌలు వేలకొలదియు, దావీదు పదివేలకొలదియు
(శత్రువులను) హతము చేసిరనిరి.
8ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని–వారు దావీదునకు పదివేలకొలది అనియు, నాకు వేలకొలది అనియు స్తుతులు పాడిరే; రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసికొనగలడు అను కొనెను. 9కాబట్టి నాటనుండి సౌలు దావీదుమీద విషపు చూపు నిలిపెను.
10మరునాడు దేవునియొద్దనుండి దురాత్మ సౌలుమీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించు చుండగా#18:10 వెఱ్ఱిమాటలాడుచుండగా. దావీదుమునుపటిలాగున వీణచేతపట్టుకొని వాయించెను. 11ఒకప్పుడు సౌలు చేతిలో నొక యీటె యుండగా–దావీదును పొడిచి గోడకు బిగించుదుననుకొని సౌలు ఆ యీటెను విసిరెను. అయితే అది తగలకుండ దావీదు రెండు మారులు తప్పించుకొనెను. 12యెహోవా తనను విడిచి దావీదునకు తోడైయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. 13కాబట్టి సౌలు అతని తనయొద్ద నుండనియ్యక సహస్రాధిపతిగా చేసెను; అతడు జనులకు ముందువచ్చుచు పోవుచు నుండెను. 14మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధిగలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. 15దావీదు మిగుల సుబుద్ధిగలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి యధికముగా అతనికి భయపడెను. 16ఇశ్రాయేలు వారితోను యూదావారితోను దావీదు జనులకు ముందువచ్చుచు, పోవుచునుండుటచేత వారు అతనిని ప్రేమింపగా 17సౌలు –నా చెయ్యి వానిమీద పడకూడదు, ఫిలిష్తీయుల చెయ్యి వానిమీద పడును గాక అనుకొని–దావీదూ, నా పెద్దకుమార్తెయైన మేరబును నీకిత్తును; నీవు నా పట్ల యుద్ధ శాలివై యుండి యెహోవా యుద్ధములను జరిగింపవలెననెను. 18అందుకు దావీదు–రాజునకు అల్లుడనగుటకు నేనెంతటివాడను? నా స్థితియైనను ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబమైనను ఏపాటివని సౌలుతో అనెను. 19అయితే సౌలు కుమార్తెయైన మేరబును దావీదునకు ఇయ్య వలసి యుండగా సౌలు ఆమెను మెహోలతీయుడైన అద్రీయేలుకిచ్చి పెండ్లి చేసెను. 20అయితే తన కుమార్తెయైన మీకాలు దావీదు మీద ప్రేమ గలిగియుండగా సౌలు విని సంతోషించి, 21ఆమె అతనికి ఉరిగానుండు నట్లును ఫిలిష్తీయుల చెయ్యి అతనిమీద నుండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తుననుకొని–ఇప్పుడు నీవు మరి యొకదానిచేత నాకు అల్లుడవగుదువని దావీదుతో చెప్పి 22తన సేవకులను పిలిపించి–మీరు దావీదుతో రహస్యముగా మాటలాడి–రాజు నీయందు ఇష్టము గలిగియున్నాడు, అతని సేవకులందరును నీయెడల స్నేహముగా నున్నారు, కాబట్టి నీవు రాజునకు అల్లుడవు కావలెనని చెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను. 23సౌలు సేవకులు ఆ మాటలనుబట్టి దావీ దుతో సంభాషింపగా దావీదు–నేను దరిద్రుడనై యెన్నిక లేని వాడనై యుండగా రాజునకు అల్లుడనగుట స్వల్ప విషయమని మీకు తోచునా? అని వారితో అనగా 24సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియ జేసిరి. 25అందుకు సౌలు ఫిలిష్తీయులచేత దావీదును పడ గొట్టవలెనన్న తాత్పర్యముగలవాడై–రాజు ఓలిని కోరక రాజు శత్రువులమీద పగతీర్చుకొనవలెనని ఫిలిష్తీయుల నూరు ముందోళ్లు కోరుచున్నాడని దావీదుతో చెప్పు డనెను. 26సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియ జేయగా తాను రాజునకు అల్లుడు కావలెనన్న కోరిక గలవాడై 27గడువుదాటకమునుపే లేచి తనవారితో పోయి ఫిలిష్తీయులలో రెండువందలమందిని హతముచేసి వారి ముందోళ్లు తీసికొనివచ్చి రాజునకు అల్లుడగుటకై కావలసిన లెక్క పూర్తిచేసి అప్పగింపగా సౌలు తన కుమార్తెయైన మీకాలును అతనికిచ్చి పెండ్లిచేసెను. 28యెహోవా దావీదునకు తోడుగా నుండుటయు, తన కుమార్తెయైన మీకాలు అతని ప్రేమించుటయు సౌలు చూచి 29దావీదునకు మరి యెక్కువగా భయపడి, యెల్ల ప్పుడును దావీదు మీద విరోధముగా ఉండెను.
30ఫిలిష్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలు దేరుచు వచ్చిరి. వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకము గలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకులందరికంటె అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 సమూయేలు 18: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.