1 సమూయేలు 23
23
1తరువాత ఫిలిష్తీయులు కెయీలామీద యుద్ధము చేసి కళ్లములమీది ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదునకు వినబడెను. 2అంతట దావీదు–నేను వెళ్లి యీ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణచేయగా యెహోవా–నీవు వెళ్లి ఫిలిష్తీయులను హతముచేసి కెయీలాను రక్షించుమని దావీదునకు సెలవిచ్చెను. 3దావీదుతోకూడియున్న జనులు– మేము ఇచ్చట యూదా దేశములో ఉండినను మాకు భయముగా నున్నది; ఫిలిష్తీయుల సైన్యములకెదురుగా కెయీలాకు మేము వచ్చినయెడల మరింత భయము కలుగును గదా అని దావీదుతో అనగా 4దావీదు మరల యెహోవాయొద్ద విచారణ చేసెను–నీవు లేచి కెయీలాకు వెళ్లుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవియ్యగా 5దావీదును అతని జనులును కెయీలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధముచేసి వారిని లెస్సగా హతముచేసి వారి పశువులను దోచుకొనివచ్చిరి. ఈలాగున దావీదు కెయీలా కాపురస్థులను రక్షించెను.
6అహీమెలెకు కుమారుడైన అబ్యాతారు ఏఫోదు చేతపట్టుకొని పారిపోయి కెయీలాలోనున్న దావీదునొద్దకు వచ్చెను. 7దావీదు కెయీలాకు వచ్చిన సంగతి సౌలు విని –దావీదు ద్వారములును అడ్డుగడలునుగల పట్టణములో ప్రవేశించి అందులో మూయబడి యున్నాడు, దేవుడతనిని నా చేతికి అప్పగించె ననుకొనెను. 8కాబట్టి సౌలు కెయీలాకు పోయి దావీదును అతని జనులను ముట్టడింపవలెనని జనులందరిని యుద్ధమునకు పిలువనంపించెను. 9సౌలు తనకు కీడే యుద్దేశించుచున్నాడని దావీదు ఎరిగి యాజకుడైన అబ్యాతారును ఏఫోదును తెమ్మనెను. 10అప్పుడు దావీదు–ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, సౌలు కెయీలాకు వచ్చి నన్నుబట్టి పట్టణమును పాడు చేయనుద్దేశించుచున్నాడని నీ దాసుడనైన నాకు రూఢిగా తెలియబడి యున్నది. 11కెయీలా జనులు నన్ను అతనిచేతికి అప్పగించుదురా? నీ దాసుడనైన నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చునా? ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, దయచేసి నీ దాసుడనైన నాకు దానిని తెలియజేయుమని ప్రార్థింపగా–అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చెను. 12–కెయీలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరల మనవిచేయగా యెహోవా–వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చెను. 13అంతట దావీదును దాదాపు ఆరువందలమందియైన అతని జనులును లేచి కెయీలాలోనుండి తరలి, ఎక్కడికి పోగలరో అక్కడకు వెళ్లిరి. దావీదు కెయీలాలోనుండి తప్పించుకొనిన సంగతి సౌలు విని వెళ్లక మానెను.
14అయితే దావీదు అరణ్యములోని కొండస్థలములయందును, జీఫు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను; సౌలు అనుదినము అతని వెదకినను దేవుడు సౌలుచేతికి అతని నప్పగించలేదు. 15తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరెనని తెలిసికొని దావీదు జీఫు అరణ్యములో ఒక వనమున దిగెను. 16అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి, వనము లోనున్న దావీదునొద్దకు వచ్చి–నా తండ్రియైన సౌలు నిన్ను పట్టుకొనజాలడు, నీవు భయపడవద్దు, 17నీవు ఇశ్రాయేలీయులకు రాజవగుదువు, నేను నీకు సహకారినౌదును, ఇది నా తండ్రియైన సౌలునకు తెలిసియున్నదని అతనితో చెప్పి దేవునిబట్టి అతని బలపరచెను. 18వీరిద్దరు యెహోవా సన్నిధిని నిబంధన చేసికొనిన తరువాత దావీదు వనములో నిలిచెను, యోనాతాను తన యింటికి తిరిగి వెళ్లెను. 19జీఫీయులు బయలుదేరి గిబియాలోనున్న సౌలునొద్దకు వచ్చి–యెషీమోనుకు దక్షిణమున నున్న హకీలామన్యము లోని అరణ్యమున కొండ స్థలములయందు మా మధ్య దావీదు దాగియున్నాడే. 20రాజా, నీ మనోభీష్టమంతటి చొప్పున దిగిరమ్ము; రాజవైన నీ చేతికి అతనిని అప్పగించుట మా పని అని చెప్పగా 21సౌలు వారితో ఇట్లనెను–మీరు నాయందు కనికరపడినందుకై మీకు యెహోవా ఆశీర్వా దము కలుగును గాక. 22మీరు పోయి అతడుఉండు స్థలము ఏదయినది, అతనిని చూచినవాడు ఎవడయినది నిశ్చయముగా తెలిసికొనుడి; అతడు బహు యుక్తిగా ప్రవర్తించుచున్నాడని నాకు వినబడెను గనుక 23మీరు బహు జాగ్రత్తగా నుండి, అతడుండు మరుగు తావులను కని పెట్టియున్న సంగతి యంత నాకు తెలియజేయుటకై మరల నాయొద్దకు తప్పక రండి, అప్పుడు నేను మీతోకూడా వత్తును, అతడు దేశములో ఎక్కడనుండినను యూదావారందరిలో నేను అతని వెదకి పట్టుకొందును. 24అంతట వారు లేచి సౌలుకంటె ముందు జీఫునకు తిరిగి వెళ్లిరి. దావీదును అతని జనులును యెషీమోనుకు దక్షి ణపు వైపుననున్న మైదానములోని మాయోను అరణ్యములో ఉండగా 25సౌలును అతని జనులును తన్ను వెద కుటకై బయలుదేరిన మాట దావీదు విని, కొండ శిఖరము దిగి మాయోను అరణ్యమందు నివాసము చేసెను. సౌలు అది విని మాయోను అరణ్యములో దావీదును తరుమ బోయెను. 26అయితే సౌలు పర్వతము ఈతట్టునను దావీదును అతని జనులును పర్వతము ఆతట్టునను పోవుచుండగా దావీదు సౌలుదగ్గరనుండి తప్పించుకొని పోవలెనని త్వరపడుచుండెను. సౌలును అతని జనులును దావీదును అతని జనులను పట్టుకొనవలెనని వారిని చుట్టుకొనుచుండిరి. 27ఇట్లుండగా దూత యొకడు సౌలునొద్దకు వచ్చి–నీవు త్వరగా రమ్ము, ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి దేశములో చొరబడియున్నారని చెప్పగా 28సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిష్తీయులను ఎదుర్కొనబోయెను. కాబట్టి సెలహమ్మలెకోతు#23:28 అనగా, భయవిముక్తి శిల. అని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. 29తరువాత దావీదు అక్కడనుండి పోయి ఏన్గెదీకి వచ్చి కొండ స్థలములలో నివాసము చేయుచుండెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 సమూయేలు 23: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.